అప్పట్లో ట్రెండ్ సెట్టర్..ఇప్పుడు మళ్లీ తీశారు ఎలా ఉందంటే..?
బషీర్ కథతో అప్పట్లో వచ్చి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాను మళ్ళీ ఇప్పుడు తీశారు. ఈసారి ఎలా రాణించిందంటే
మీరు ఓ కొత్త ఇంట్లోకి అద్దెకు దిగారు. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందని భావించారు. అయితే ఆ ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని, రాత్రిళ్లు ఆ ఆత్మ దెయ్యంలా వచ్చి పీక నులిమే పోగ్రామ్ పెట్టుకుంటుందని మొదటి రోజే మీకు ఎవరైనా వచ్చి చెప్తే.. వింటానికి ఆసక్తిగా ఉంది కదా... దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఓ మలయాళ చిత్రం వచ్చింది. సినిమా గురించి మాట్లాడుకునే ముందు కాస్తంత ఉపోద్గాతం...
నవలలు, కథలు సినిమాలుగా తీయటం కొత్త విషయం ఏమీ కాదు. కానీ.. మనకు ఇష్టమైన రచయిత రాసిన ఓ షార్ట్ స్టోరీని సినిమా తీశారంటే కచ్చితంగా ఆసక్తే. అసలు అంత చిన్న కథని అంత పెద్ద సినిమాగా ఎలా తీశారనే జనరల్ ఇంట్రస్ట్ ఓ వైపు.. మనం కథ చదువుతున్న మనస్సులోకి వచ్చిన విజువల్స్ .. తెరపై ఎలా ప్రాణం పోసుకున్నాయి.. అసలు ఆ కథకు సినిమా వాళ్లు న్యాయం చేశారా? ఇలాంటి బోలెడు డౌట్‌లు. అలాంటి అనుభవమే ...నాకు రీసెంట్‌గా వైక్కం మొహమ్మద్ బషీర్ ( మలయాళ రచయిత) కథను సినిమా చేశారనగానే కలిగింది. ఆ కథను అప్పట్లో అంటే 1964 లో సినిమాగా తీస్తే మంచి హిట్టైంది. ఇప్పుడు మళ్లీ 2023లో తీశారు. ఎలా ఉంది ఇప్పటి సినిమా..
ఇంతకీ బషీర్ రాసిన ఆ కథ పేరేమిటంటే... "Neelavelicham". దాన్నే భార్గవి నిలయం సినిమాగా మలయాళంలో తీశారు. 1964లో రిలీజైన భార్గవి నిలయం మలయాళంలో హారర్ సినిమాలకు ప్రేరణగా నిలిచింది. యాభై ఏళ్ల క్రితం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఆ సినిమా రీమేక్‌గా నీల వెలిచమ్‌ను తెరకెక్కించటం సాహసమనే చెప్పాలి. వైక్కం మహమ్మద్ బషీర్ మలయాళ రచయిత అయినా, తన రచనా కాలంలో కేవలం 30 పుస్తకాలే రాసినా ఇప్పటికీ దేశం అంతా సాహిత్యం ఇష్టపడే వాళ్లు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
భాషా భేదం లేకుండా బషీర్ రచనలు అనువాదం చేసుకుని చదువుకున్నారు. ఆయన మరణించి రెండు దశాబ్దాలు పైగా కావస్తున్నా బషీర్ ఇప్పటికీ మలయాళంలోని అత్యంత ఇష్టమైన రచయితలలో ఒకరు. ఆయన కథలు నిజ జీవిత పాత్రల ఆధారంగా ఉండటంతో ఎవరైనా వాటికి ఈజీగా కనెక్ట్ అయ్యిపోతూంటారు. ఆయన రాసిన వైవిధ్యభరితమైన జీవితానుభవం కనపడుతుంటుంది. అలాంటి కథల్లో ఒకటి నీలవెలిచం. మళయాళ పరిశ్రమలో విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్న టోవినో థామస్(Tovino Thomas) హీరోగా నటించిన చిత్రం ఇది. ఇదో హారర్ ఫిల్మ్.
ఒరిజినల్ కథ రచయిత బషీర్ మాటల్లోనే ఉంటుంది. ఆయన ఓ ఇంటి కోసం వెతుకుతూంటాడు. ఒంటి అంతస్థు మేడ ఇల్లు దొరుకుతుంది. ఊరి పొలిమేర దగ్గరలో ఉంటుంది. దుమ్ము పట్టిన టులెట్ బోర్డు చూసి మాట్లాడుకుని అందులోకి దిగుతాడు. ఆ ఇల్లు బషీర్‌కు బాగా నచ్చుతుంది. మేడపైన రెండు గదులు, విశాలంగా బాల్కనీ ఉంటాయి. క్రింద నాలుగు గదులు ఉంటాయి. ఒక బాత్ రూమ్, వంటగది, మంచి నీటి కుళాయి అన్నీ ఉంటాయి. కరెంట్ మాత్రం లేదు.
పెరట్లో ఓ బావి ఉంది. చుట్టుపక్కల ఏ ఇల్లూ లేదు. తను రైటర్ కాబట్టి ప్రశాంతంగా ఉంటుందని ఆ ఇంట్లో దిగుతాడు. రెండు నెలల అడ్వాన్స్ ఇస్తాడు. లాంతరు కొనుక్కుంటాడు. ఇల్లు చిమ్మి శుభ్రం చేసి ఇంట్లో దిగుతాడు. చాలా ఆనందంగా ..ఇక్కడ కూర్చుని హాయిగా కథలు రాసుకోవచ్చు అని మురిసిపోతాడు. కాంపౌండ్‌లో పచార్లు చేసుకోవచ్చు.. తోటలో పూల మొక్కలు వేసుకోవచ్చు ఇలా చాలా చాలా ఊహలు ప్లాన్స్.
పోస్ట్‌మన్‌కు కొత్త అడ్రస్ చెప్పి ఇక్కడ ఉత్తరాలు ఇవ్వమంటే ఓ బాంబ్ పేలుస్తాడు. ఆ ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని. పెరట్లో బావిలోకి దూకి చనిపోయారు. అప్పట్నుంచి ఆ ఇంట్లో ప్రశాంతత లేదు. చాలా మంది ఆ ఇంట్లో ఉన్నారు. రాత్రిళ్లు తలుపులు గట్టిగా కొట్టుకుంటాయి. కుళాయిల్లో నీళ్లు పోతూంటాయి అని చెప్పాడు. ఇప్పటికిప్పుడు ఏం చేయాలి. ఇల్లు ఖాళీ చేద్దామా.. అబ్బే అక్కర్లేదు ..చూద్దాం ఏం జరుగుతుందో అనేది బషీర్ ధైర్యం. అయితే ఆ ధైర్యం ఎప్పటిదాకా ఉంది.. ఆ దెయ్యం కనిపించిందా.. కనిపిస్తే ఎలా ఆ దెయ్యాన్ని డీల్ చేశారు అనేది కథ.
అయితే ఇప్పుడీ కథ చదువుతూంటే చెప్పావులే బోడి...నా తలమీద ఉన్న వెంట్రుకలు (బట్టతల గురించి కాదు చెప్పేది) అన్ని ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలు చూశాం అంటున్నారా.. అయితే అక్కడే ఆగండి.. ముందే చెప్పాను ఈ కథ ఎప్పుడో అరవైల్లో రాసింది. అరవై నాలుగులోనే సినిమాగా వచ్చింది ఓ సారి అని. ఆ దెయ్యం పేరు భార్గవి కావటంతో భార్గవి నిలయం పేరుతో సినిమా చేశారు. ఇక ఇప్పుడు వచ్చిన ఈ సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే. అయితే ఆ కాలానికి తీసుకెళ్లారనే చెప్పాలి. అయితే నాదీ మీ సమస్యే. కథ ప్రెడిక్టబుల్‌గా అనిపించింది. బషీర్ కథను మార్చే ధైర్యం లేదు. హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఆషిక్ అబూ దర్శకత్వం వహించాడు. రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, టామ్ చాకో కీలక పాత్రలను పోషించారు.
చూడచ్చా
అంత తెలిసున్న దెయ్యం కథను మళ్లీ చూడాలంటే బషీర్ మీద అభిమానం లేదా ఆ కథ అంటే ఇష్టం ఉండాలి. కాబట్టి ఈ పాత దెయ్యాన్ని కొత్తగా చూడాలంటే జై బషీర్ అనుకోండి. అప్పుడు చివరిదాకా చూసేయగలుగుతారు. అదీ కాదంటారా ముందు ఆ కథ చదవండి..రెండు పేజీలే ఈజీగా లాగేయచ్చు.
ఇంతకీ సినిమా ఎక్కడుంది.
నీలవెలిచమ్ ఆమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీలో రిలీజైంది.