మమ్ముట్టి 'టర్బో' ఓటిటి మూవీ రివ్యూ
మమ్ముట్టికి అన్ని చోట్లా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో ఆయన డబ్బింగ్ సినిమాలు మొదటి నుంచీ బాగా వర్కవుట్ అయ్యాయి.
మమ్ముట్టికి అన్ని చోట్లా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో ఆయన డబ్బింగ్ సినిమాలు మొదటి నుంచీ బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక్కడ స్ట్రైయిట్ సినిమాలు కూడా చేశారాయన. దానికి తోడు ఓటిటిలు వచ్చాక ఆయన కొత్త సినిమాలు అన్నీ తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం విడుదలై విజయం సాధించిన మలయాళ యాక్షన్ చిత్రం టర్బో (Turbo)ఓటిటిలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ మూవీలో మన తెలుగు కమెడియన్ సునీల్ (Sunil), కన్నడ నటుడు రాజ్ బీ షెట్టి (Raj B. Shetty) కీలక పాత్రల్లో నటించడం కూడా మరో ప్లస్ పాయింట్. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉంది.. తెలుగు వారికి నచ్చే సినిమాయేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
డ్రైవర్ జోసీ అలియాస్ టర్బో (మమ్ముట్టి) కి తల్లి అంటే ప్రాణం. ఆవిడ ఎంత చెప్తే అంత. అలాగే తన స్నేహితులకు ఎలాంటి అవసరం వచ్చినా వెనకాడడు. ఈ క్రమంలో ఊళ్లో ఎప్పుడూ ఏదో గొడవ పడుతూంటాడు. ఓ సారి తన స్నేహితుడు జెర్రీ (శబరీష్) ఓ అమ్మాయి ఇందులేఖ (అంజనా జయప్రకాశ్) ని ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోవటం లేదని తెలిసి... తనే స్వయంగా వెళ్లి ఆమెను తీసుకొస్తాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు భయపడి జెర్రీ ఆ అమ్మాయి ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తాడు. దీంతో కోపమొచ్చి ఇందులేఖ తిరిగి చెన్నై వెళ్లిపోతుంది. జెర్రీ కూడా చెన్నై వెళ్లి తన ఉద్యోగంలో చేరిపోతాడు. అయితే ఈ గొడవలో టర్బో పై కిడ్నాప్ కేసు పడుతుంది. ఊళ్ళో పోలీసులు అరెస్ట్ చేయటానికి రెడీగా ఉంటారు.
దాంతో టర్బో సైతం చెన్నైలో కొంతకాలం ఉండాల్సిన పరిస్దితి వస్తుంది. అయితే అదే చెన్నైలో బ్యాంక్ లో పనిచేస్తున్న జెర్రీ ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. మొదట అది ప్రేమ కోసం చేసుకున్న ఆత్మహత్య అనుకుంటారు కానీ అది ఆత్మహత్య కాదని హత్య అని తెలుస్తుంది. చనిపోయినవారి బ్యాంకు ఎకౌంట్ల ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందని జెర్రీ గుర్తించటంతో అతన్ని చంపేసారని గుర్తిస్తాడు.
అతని హత్యకు కారణం, ఈ స్కామ్ వెనుక ఉన్నది వెట్రివేల్ షణ్ముగ సుందరం (రాజ్ బి శెట్టి) అని తెలుసుకుంటాడు టర్బో. అక్కడ నుంచి టర్బో ఏం చేసాడు. తన స్నేహితుడిని చంపిన వెట్రివేల్ షణ్ముగ సుందరంని ఏం చేశాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన ఛాలెంజ్ లు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
ఇది పక్కా కమర్షియల్ మసాలా సినిమా. 72 ఏళ్ల వయస్సులోనూ ముమ్మట్టి యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా ఫైట్స్ చేస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా ఫస్టాఫ్ అయినా హీరో సమస్యలో పడడు. విలన్ ఎవరో తెలియదు. విలన్ కు ఇతనెవరో తెలియదు. యాక్షన్ సినిమాల్లో ఇది చాలా ప్రమాదం. అలాగే విలన్ వైపు కథ నడుస్తూంటుంది. విలన్ యాక్షన్ కు హీరో ముమ్మట్టి స్పందిస్తూంటాడే తప్పించి హీరో... విలన్ కు సవాళ్లు విసిరి ఇరుకున పెట్టడు. దాంతో హీరో క్యారక్టర్ చాలా ప్యాసివ్ గా మారిపోయి... యాక్షన్ తెరపై నడుస్తున్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అలాగే హీరోకు తల్లి తప్పించి తన స్నేహితుడుతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ కనపడదు.
దాంతో తన స్నేహితుడు కోసం అతను యాక్షన్ లోకి దిగినా మనకేమీ అనిపించదు. అయితే ప్లస్ ఏమిటంటే సినిమాలో ముమ్మట్టికి హీరోయిన్ ని పెట్టలేదు. అలాగే పాటలు కూడా లేవు. నీట్ గా సీన్ బై సీన్ వెళ్లిపోతుంది. ఇక సినిమాకు కీ పాయింట్ అయిన స్కామ్ ని సరిగ్గా అర్దమయ్యేలా చెప్పలేకపోయారు. ఆ స్కామ్ మూలంగా ఎవరికి నష్టం వస్తుంది అనేది చెప్పలేకపోతే మనకు విలన్ మీద కోపం ఎందుకు వస్తుంది?
నటీనటుల్లో ముమ్మట్టి ఎప్పటిలాగే అదరగొట్టాడు. తన వయస్సుని తన హుషారుతో దాటేసారు. ఇక విలన్ గా రాజ్ బి శెట్టి సెట్ కాలేదనిపించింది. ఆ క్రూరత్వం సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. సునీల్ ఫన్ టైమింగ్ బాగుంది కానీ అతనికి తగ్గ పాత్ర కాదు. టెక్నికల్ గా సినిమా బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. విష్ణు శర్మ కెమెరా వర్క్.. క్రిస్టో సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
చూడచ్చా
ఫ్యామిలీతో చూడవచ్చు, కాలక్షేపానికి లోటు లేకుండా సినిమా నడిచిపోతుంది.
ఎక్కడుంది
సోనీలివ్ వేదికగా ఓటీటీలో తెలుగులో ఉంది.