మారి సెల్వరాజ్ 'వాళై' ఓటిటి సినిమా రివ్యూ!

తమిళంలో అప్పట్లో గ్రామీణ చిత్రాలు బాగా వచ్చేవి. భారతీరాజా వంటి దర్శకులు గ్రామీణ చిత్రాలను సహజత్వానికి దగ్గరగా , నేచురల్ లొకేషన్స్‌లో తీసి హిట్ కొట్టేవారు.

Update: 2024-10-20 10:38 GMT

తమిళంలో అప్పట్లో గ్రామీణ చిత్రాలు బాగా వచ్చేవి. భారతీరాజా వంటి దర్శకులు గ్రామీణ చిత్రాలను సహజత్వానికి దగ్గరగా , నేచురల్ లొకేషన్స్‌లో తీసి హిట్ కొట్టేవారు. ఆ తర్వాత భాగ్యరాజా వంటివారు ఆ జానర్ ని అందిపుచ్చుకుని ఫన్ కలిపి మరిన్ని హిట్స్ కొట్టారు. అయితే కాలక్రమేణా అక్కడ ఆ హవా తగ్గింది. ఇప్పుడు అప్పుడప్పుడూ అడపా, దడపా మాత్రమే ఆ తరహా చిత్రాలు వస్తున్నాయి. తాజాగా కర్ణన్‌, మామన్నన్‌ చిత్రాలతో సౌత్‌ ఇండియా ప్రేక్షకులను మెప్పించిన మారి సెల్వరాజ్‌మరోసారి అలాంటి సినిమా తీసారు. తమిళంలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అలరిస్తోంది. ఈ సినిమా ఎలా ఉంది. మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.

కథేంటి

90లలో జరిగే ఈ కథ తమిళనాడులో ఓ మారు మూల గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ అరటి తోటలు జనం జీవనాధారం. ఆ తోటల్లో పనులు చేసుకుంటూ చుట్టు ప్రక్కల జనం జీవనం సాగిస్తూంటారు. ఆ ఊళ్లో 12 ఏళ్ల కుర్రాడే శివానంద. అతనికి తల్లి .. పెళ్లి కావలసిన అక్క. అతనికో క్లోజ్ ఫ్రెండ్ శేఖర్. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే తిరుగుతూ ఉంటారు. రోజూ స్కూల్ కు వెళుతూ..సెలవు రోజుల్లో అరటిగెలలు దింపటానికి వెళ్తూంటారు. అయితే శివనందకు అలా వెళ్లటం ఇష్టం ఉండదు. కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే వయస్సు కాదు. దాంతో ఏదో వంక చెప్తూ తప్పించుకోవటానికి చూస్తూంటాడు.

స్కూల్ వెళ్లటం అంటే ఇష్టపడే శివ బాగా చదువుతూంటాడు. తన క్లాస్ లో అతనే ఫస్టు కావటంతో టీచర్లు అతన్ని బాగా ఇష్టపడుతూంటాడు. ఇదిలా ఉండగా..శివకు పూన్ గుడి టీచర్ (నిఖిలా విమల్) అంటే ఇష్టం. ఆ టీచర్ చెందిన కర్చీఫ్ దొరికితే దానిని ఎంతో భద్రంగా దాచుకుని .. అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. మరో ప్రక్క టీచర్ కు అంత పేదరికంలోను చదువుకోవడానికి ఆసక్తిని చూపుతున్న శివ అంటే ఇష్టం. అయితే ఆ టీచర్ వలనే తన కుటుంబంలో సమస్యలు వస్తాయి. తను చేసిన ఓ పనితో ఊళ్లో అందరిచేతా కుటుంబం మాట పడాల్సి వస్తుంది. మరో ప్రక్క తన అక్కని ఇష్టపడుతున్న 'కణి' ని తమ కుటుంబంలో కలుపుకోవాలని చూస్తాడు. అందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శివ ఏం చేశాడు. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఇది నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని అల్లిన స్క్రీన్ ప్లే. సినిమా మెల్లిగా సాగుతున్నట్లు అనిపించినా మన గుండెలను తాకేలా డిజైన్ చేసాడు దర్శకుడు. పేదరికం, బాల్యం, కష్టాలు, చిన్న చిన్న ఆనందాలను సినిమాలో బాగా చూపించాడు. ఆ కాలం నాటి వాతావరణాన్ని మన కళ్ల ముందు ఉంచుతాడు. మనం కూడా ఆ ఊళ్లో భాగమైపోతాము. సినిమా చివర్లో వచ్చే ఓ ఎమోషన్ మనల్ని ఈ సినిమా మర్చిపోలేని విధంగా మారుస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమాని చెప్తున్నారు. అందుకేనేమో చాలా కన్విక్షన్ తో మనని కన్వీన్స్ చేయటానికి కాకుండా తను చెప్పాలనుకున్న ఎమోషన్ ని మనలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తాడు. చిన్న పిల్లల అల్లరి చేష్టలు మనని బాల్యంలోకి తీసుకెళ్తాయి. మరో ప్రక్కన ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేసి నిట్టూర్పు వదిలేలా చేస్తాడు.

టెక్నికల్ గా..

ఈ సినిమాకు ప్రాణం కెమెరా వర్క్. పచ్చటి పొలాలు, కొబ్బరి తోటలు, చుట్టూ కొండలు ఉన్న లొకేషన్స్ ని సజీవంగా మన ముందు ఉంచారు ఛాయాగ్రాహకుడు. దానికి సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రాణం పోసాయి. సూర్య ప్రథమన్ ఎడిటింగ్ కూడా ఎక్కడా లాగ్ లేకుండా సాగుతుంది. మిగతా డిపార్టమెంట్స్ అన్ని సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లటానికి సాహం చేసాయి. ఆర్టిస్టుల ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే..పిల్లలు అయినా చక్కగా చేసారు. ఎమోషన్స్ బాగా పండించారు. డబ్బింగ్, తెలుగు డైలాగులు బాగా కుదరాయి.

చూడచ్చా

పిల్లలు ప్రధాన పాత్రలో నడిచే ఈ చిత్రంలో రెగ్యులర్ ఎంటర్టైన్మంట్ ఎలిమెంట్స్ వెతికితే మాత్రం పూర్తి నిరాశే. అలా కాకుండా ఓ నిజాయితీగా చెప్పిన కథగా చూస్తే బాగా నచ్చుతుంది.

ఎక్కడ చూడచ్చు

ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో తెలుగులో ఉంది. పాటలు మాత్రం తమిళంలో ఉంటాయి.

Tags:    

Similar News