ఈడు జోడు: తిలక్ సెటిల్ చేసిన తాళి కథ

పాత సినిమా కొత్త రివ్యూ

Update: 2024-09-05 09:30 GMT

-సిఎస్ఎ షరీఫ్


భారతీయ చలన చిత్ర చరిత్ర లో,  ముఖ్యంగా తెలుగు సినిమారంగం లో 60 - 70 దశకాలని స్వర్ణయుగం గా చెప్పుకోవచ్చు. దానికి కారణం, అప్పటి సినిమాలలో  డాన్సులూ,  హీరో నుంచి వచ్చే గగుర్పొడిచే యాక్షన్ సీనులూ లేక పోయినా, నిండైన సామాజిక సందేశాలు  వుండేవి. ఆ సినిమాలలో “విషయం” వుండేది. అలనాటి దర్శక నిర్మాతలు  సినిమాలు,  వినోదం పంచడం తో పాటు ఒక సామాజిక బాధ్యత కలిగి వుండాలని భావించేవారు.

ఒక కథ చూద్దాం. యవ్వనం లో వున్న ఒక అమ్మాయి, పరిస్థితుల ప్రభావం వల్ల ధనవంతుడైన ఒక ముసలివాడిని పెళ్ళి చేసుకుంటుంది. ఆ ముసలివాడు ఆ అమ్మాయి తో శారీరక సంబంధాలు కలిగి ఉండక, ఆమెను తన కూతుర్లా భావిస్తాడు. ఆ అమ్మాయి ఇంతకు ముందే ఒక యువకుడిని ప్రేమించింది అని తెలుసుకుని, ఆ యువకుడినీ ఆ అమ్మాయిని కలిపి, వాళ్లిద్దరి పెళ్ళీ జరిపిస్తాడు. మన సంస్కృతీ, కట్టుబాట్లూ, ఆచారాల దృష్ట్యా అప్పటి కాలం లో ఇదొక విప్లవాత్మక కథ.  ఇలాంటి కథని ఒక సినిమాగా తీయాలంటే ఆషా మాషీ వ్యవహారం కాదు.


 దర్శకుడు కెబిజి తిలక్


 కొల్లిపర బాలగంగాధర తిలక్ ఉర్ఫ్ కె. బి. తిలక్ అభ్యుదయభావాలు కలిగిన ఒక దర్శక నిర్మాత.  శరత్ చంద్ర చటర్జీ (శరత్ బాబు) సాహిత్యం నుంచి తిలక్ ఓ అంశాన్ని తీసుకుని, రచయిత పినిశెట్టి  శ్రీరామ మూర్తి ద్వారా, ఒక ధనవంతుడైన ముసలివాడు వయసులో ఉన్న అమ్మాయిని పేళ్లిచేసుకుని చివర్లో ఆ అమ్మాయిని ఆమె ప్రియుడి తో కలిపే పరిస్థితులను ఒక కథ గా రాయించాడు. ఆ కథను “ఈడు జోడూ” (1963) అనే సినిమాగా తీశాడు.

ఇదీ కథ :

పార్వతమ్మా (మాలతి), రంగమ్మా (సూర్యకాంతం) ఇద్దరూ తోడి కోడళ్ళు. పార్వతమ్మ కూతురు శాంత (జమున). ఆమెకు తండ్రి ఉండడు.  రంగమ్మ కూతురు శోభ (మణిమాల).  శాంతా, డాక్టర్ వేణూ (జగ్గయ్య) ప్రేమించుకుంటారు. అయితే రంగమ్మ తన కూతురు శొభను డాక్టర్ వేణూ కిచ్చి పెళ్ళిచేయడానికి వేణూ తల్లి సుందరమ్మ(హేమలత) ని ఒప్పిస్తుంది. ఈ విషయం జరుగుతుండగా, అనారోగ్యంగా వున్న పార్వతమ్మ మరణిస్తుంది.

పార్వతమ్మ చనిపోయాక దిక్కులేని శాంత మీద కపట ప్రేమను చూపించి ఆమెను తనింటికి తెచ్చుకుంటుంది రంగమ్మ. ఈ రకంగా ఆమెను వేణు కి దూరంగా వుంచుతుంది. తరువాత ఆమెను ముసలి వాడైన లక్ష్మీపతి కి ఇచ్చి పెళ్లి చేస్తుంది.   లక్ష్మీపతి ఆమెతో శారీరకంగా దూరంగా వుండటమే కాకుండా ఆమెను తన కూతుర్లా చూసుకుంటూవుంటాడు. ఇదిలా ఉండగా, చలపతి (రమణా రెడ్డి)  తనకు మాట ఇచ్చినట్లు రంగమ్మ శోభను తన కొడుకు అంజి (చలం) కి కాకుండా వేణు కి ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటున్నదని తెలుసుకుని   అసలు రహస్యం బయట పెడతాడు. శాంతా, లక్ష్మీపతుల పెళ్ళి జరిగినప్పుడు, పెళ్ళి పీటల మీద కూర్చున్న లక్ష్మీపతి తప్ప తాగి వుండి తాళి కట్టే స్థితి లో వుండడు.  అప్పుడు ఎలాగైనా శాంత పెళ్ళి లక్ష్మీ పతి తో చేసేయ్యలని కుతంత్రం పన్నిన రంగమ్మ కరెంటు తీసేయించి, లైట్లు ఆరిపోయేట్లు చేసి,  తనే  శాంత మెడలో తాళి కట్టిందని చెప్పేస్తాడు. దరిమిలా తాను తాళి కట్టలేదని తెలుసుకున్న లక్ష్మీపతి వేణుని, శాంత ను కలిపి వాళ్లిద్దరి పెళ్ళి జరిపిస్తాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం గొప్ప విజయం సాధించింది.

సమకాలీన సాంఘిక కట్టుబాట్లూ, ఆచార వ్యవహారాలను సవాలు చేస్తూ సినిమా తీయడం కష్టమైన పనే.. అనుపమా ఫిలంస్ సంస్థ అధినేత గా దర్శక నిర్మాత కె.బి తిలక్ ద్వారా మంచి చిత్రాలు చాలా వచ్చాయి. వాటిలో  ఎం. ఎల్. ఏ. (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఈడూ జోడూ (1963), ఉయ్యాలా జంపాలా (1965), పంతాలూ పట్టింపులూ (1968) మచ్చుకు కొన్ని.

చిత్రం లో తాళి సమస్య ఎలా తీరింది?

మన సంఘం లో తాళి కి వున్న ప్రాధాన్యత తెలిసిందే. ఒక సారి తాళి కట్టిన తరువాత కట్టించుకున్న స్త్రీ ఆ తాళి తెంపలేదు. పైపెచ్చు ఇంకొకరికి భార్యగా మారలేదు.చిత్రం మొదట్లో శాంతను పెళ్ళాడేటప్పుడు లక్ష్మీపతి తాళి కడతాడు. అయితే సినిమా చివర్లో లక్ష్మీపతి శాంతను డాక్టర్  వేణూ కి అప్పగించాలంటే ఎలా? ఆ తాళి సమస్య తీరేదెలా ? సినిమా మధ్యలో ఒక సన్నివేశం లో లక్ష్మీ పతి శాంతను మెడలో నుంచి తాళి తీసెయ్య మని చెప్పాలి.  అయితే అది అప్పటి సెన్సారు ఆఫీసరు జి.పి. శాస్త్రీ కి అభ్యంతరకరంగా వుండడం తో ఆ సన్నివేశాన్ని విడాకుల సన్నివేశంగా మార్చారు.

ఇక శాంత మెడలో ఉన్న తాళి విషయానికి వస్తే, ఈ సినిమాలో లక్ష్మీపతి శాంత మెడలో అసలు తాళి కట్టడు. అతడు పెళ్ళి పీటల మీద తప్ప తాగిన స్థితి లో వుంటే, కరెంటు తీసేయించి రంగమ్మ (సూర్యకాంతం) శాంత మెడలో తనే తాళి కడుతుంది. చివరి సీను లో అందరూ ఒకసారి పెళ్ళైన అమ్మాయి మళ్ళీ  ఎలా పెళ్ళి చేసుకుంటుంది? అని అడిగినప్పుడు ఈ విషయం లక్ష్మీపతి  తనే చెబుతాడు. కాబట్టి లక్ష్మీ పతి శాంత ను వేణు కిచ్చి పెళ్ళిచేయడం తప్పు కాదు అని తేలుతుంది.

గుమ్మడి నటనా ప్రావీణ్యాన్ని పొగిడిన హిందీ నటుడు

ఈ చిత్రం లో లక్ష్మీపతి ఎప్పుడూ తాగుతూ వుంటాడు. ఈ చిత్రాన్ని చూసిన హిందీ నటుడు అశోక్ కుమార్ గుమ్మడి నటనకు ముగ్ధుడయ్యాడు. మూసలో పోసినట్లు కాకుండా ఏ మాత్రం ఓవర్ ఆక్టింగ్ లేకుండా నాచురల్ గా నటించిన గుమ్మడి నటనను అశోక్ కుమార్ తెగ మెచ్చుకున్నాడు. ఈ చిత్రం లో గుమ్మడి తన గురువు (కె.వి.ఎస్.శర్మ) సలహా మేరకు శాంతను వివాహం చేసుకుంటాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని 1971 లో కంగన్ అనే పేరుతో హిందీ లో రిమేక్ చేసినప్పుడు గుమ్మడి నటించిన లక్ష్మీపతి పాత్రను అశొక్ కుమారే పోషించాడు. అశోక్ కుమార్ తన గురువుగా గుమ్మడిని అభినయించమని అడిగాడట. గుమ్మడి అలాగే అన్నాడట. ఆ రకంగా గుమ్మడి తెలుగు చిత్రం లో లక్ష్మీపతి గానూ, హిందీ చిత్ర్రం లో  లక్ష్మీపతి (అశొక్ కుమార్ ) గురువుగానూ నటించడం జరిగింది.

ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు. దీనిలో ఘంటసాలా, సుశీలా పాడిన “ఇదేమి లాహిరి..ఇదేమి గారడీ” అనే పాట ఉంది.  ఈ పాట ను మహబలిపురం లో జగ్గయ్య, జమునల మీద చిత్రీ కరించారు. ఆ సమయంలో మహా బలిపురం చూడటానికి ఓ జపాను సాంస్కృతిక బృందం వచ్చివుండింది . ఆ బృందం సభ్యులు ఆ పాట విని దాని సంగీతానికి పరవశం చెంది, ఆ పాటను పదే పదే వినిపించ మని అడిగారట.


Tags:    

Similar News