నవ్వులతో అలరించిన 'OMG (ఓ మంచి ఘోస్ట్)' మూవీ రివ్యూ

"ఓఎంజి ఓ మంచి ఘోస్ట్" సినిమా మాత్రం ప్రత్యేకమైన కేటగిరి గా భావించాలి. అసంబద్ధమైనప్పటికీ అలరించిన సినిమా ఇది.

Update: 2024-06-21 10:00 GMT

ఇంతవరకు తెలుగు తెరమీద దయ్యం సినిమాలు చాలా వచ్చాయి. కొన్ని హారర్, కొన్ని కామెడీ, కొన్ని సూపర్ న్యాచురల్ మరికొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్. కానీ "ఓఎంజి, ఓ మంచి ఘోస్ట్" సినిమా మాత్రం ప్రత్యేకమైన కేటగిరి గా భావించాలి. ఈ సినిమా దర్శకుడు శంకర్ మార్తాండ్ ఈ సినిమాని తీసిన పద్ధతి కొంత క్రియేటివ్ గా కూడా ఉండడమే కాకుండా, మొదటి నుంచి చివరిదాకా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇది ఒక అసంబద్ధమైన (ఫార్సికల్) కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడికి మొదటి నుంచి చివరి దాకా ఏం తీయాలి? ఎలా తీయాలి? అన్నదానిమీద స్పష్టమైన అవగాహన ఉంది. దానికి తోడు ఇద్దరు కమెడియన్స్ (వెన్నెల కిషోర్, షకలక శంకర్) తమ టాలెంటు చూపించడం.

ఎంత అసంబద్ధమైన సినిమా అయినప్పటికీ కథ మాత్రం చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే లో కొన్ని సీన్లు దీర్ఘంగా ఉన్నప్పటికీ, తర్వాతి సీన్లలో దర్శకుడు మళ్ళీ కథలోకి వచ్చి, కామెడీతో, క్రియేటివిటీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు.

మామూలు కథతో ప్రేక్షకులను మురిపించిన సినిమా

ఒక కిడ్నాప్ తో సినిమా మొదలవుతుంది. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో నలుగురు అపరిచితులు ఒకరికొకరు పరిచయం అవుతారు. "కొన్ని పరిచయాలు స్నేహంగా మారితే, మరికొన్నిప్రేమగా మారుతాయి" అన్న డైలాగు ఈ సన్నివేశానికి సరిపోయింది. అదేవిధంగా సినిమాకు కూడా సరిగ్గా సరిపోయింది. ఆ నలుగురిలో ఒకడు షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ. పోలీస్ స్టేషన్లో వీళ్ళ పరిచయ సన్నివేశం, సినిమాలో రాబోయే కామెడీ గురించి, డైలాగులు గురించి, ప్రాస పంచుల గురించి ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఇక అక్కడ నుంచి సినిమా ఒక హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా నడుస్తుంది. అలా పరిచయమైన నలుగురికి డబ్బే ప్రధానం కారణం కాబట్టి, అందరూ కూడబలుక్కొని డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. కొన్ని ఐడియాలు చర్చించిన తర్వాత, కిడ్నాప్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటారు.

ఈ క్రమంలో రజత్ రాఘవ మేనమామ అయిన ఎమ్మెల్యే (నాగినీడు) కూతుర్ని కిడ్నాప్ చేయాలని డిసైడ్ చేస్తారు. అలాగే ఎమ్మెల్యే కూతురు కీర్తిని ఎలాగోలా కిడ్నాప్ చేసి ఒక పాతబడిన బంగ్లాకు చేరుస్తారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. వాళ్ళు కిడ్నాప్ చేసిన కీర్తిని ఆల్రెడీ ఒక దయ్యం ఆవహించి ఉంటుంది. ఆమెకు తోడవుతుంది బంగ్లాలో ఆల్రెడీ ఉన్న ఒక దయ్యం(ఆ దయ్యం ఎవరో చివర్లో తెలుస్తుంది. చిన్న సస్పెన్స్) ఎమ్మెల్యే బామ్మర్ది డబ్బుల కోసం మాంత్రికుడు ప్రభాకర్ సాయంతో ఆ దయాన్ని కీర్తిలో ప్రవేశపెట్టి ఉంటాడు. ఇక వీళ్ళకి ఆత్మారాం (వెన్నెల కిషోర్) తోడు అవుతాడు .ఇక సినిమా మొత్తం చివరి వరకు ఆ బంగాళాలోనే నడుస్తుంది. చివరికి ముగుస్తుంది.

చెలరేగిపోయిన వెన్నెల కిషోర్, షకలక శంకర్

ఈ సినిమా ప్రధాన బలం, దర్శకుడు అనుకున్న విధంగా చేసి ప్రాస పంచులతో, కామెడీ టైమింగ్ తో సినిమాను ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తయారుచేసిన వెన్నెల కిషోర్, షకలక శంకర్. వీరిద్దరు పోటీపడి నటించారు. ఒక మాంత్రికుడి కొడుకు(పావురం) గా షకలక శంకర్ ఈ సినిమాలో విజృంభించాడు. కామెడీ టైమింగ్, నటన తో సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇక వెన్నెల కిషోర్ గురించి చెప్పేదేముంది. ఈ సినిమాలో అతనికి ప్రత్యేకమైన టైమింగ్ తో, హావభావాలతో, డైలాగ్ డెలివరీతో సినిమాకు డబల్ ప్లస్ అయ్యాడు. వీరిద్దరూ దాదాపుగా తమ భుజాల మీద ఈ సినిమాను మోశారు. వీళ్లిద్దరూ దయ్యాలు పిలిస్తే, వారి కోసం వెళ్లి దెయ్యాల చేతిలో దెబ్బలు తిని వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్. ఈ సినిమా షకలక శంకర్ కి ఒక మంచి అవకాశం ఇచ్చింది. సినిమా మొత్తం ఐదు మంది మధ్యలో నడుస్తుంది కాబట్టి మిగతా నటీనటులకు పెద్దగా అవకాశం లేదు.

నవ్వుల జడివాన కురిపించిన డైలాగులు

ఈ సినిమాకు మరో ప్రధాన బలం, కామెంటుకు తగ్గట్టుగానే పేలిన పంచులు, నవ్వించిన ప్రాసలు, డైలాగులు. దర్శకుడితో పాటు స్క్రిప్టులో, డైలాగ్స్ లో కలిసి పనిచేసిన రితేష్ రానా, ఈ సినిమా కామెడీ ని ఒక లెవెల్ కి తీసుకెళ్లారు. సినిమా అద్యంతం నవ్వులు పంచడానికి డైలాగులు ప్రధాన కారణం. ఈ సినిమా మొదటి సగం ఆట ఆడుకోవడం అయితే, రెండో సగం వేటాడడం (దయ్యాలు). ఈ సినిమా క్రియేటివిటీకి నిదర్శనం నందిత శ్వేత, ఆల్రెడీ

ఆ బంగ్లాలో ఉన్న దయ్యానికి "మనుషుల్ని చంపడం కాదు, ఒక శరీరాన్ని ఎంచుకొని దాన్ని ఆవహించు. ఎంజాయ్ చెయ్" అని ఇచ్చిన సలహా. దాంతో ఇద్దరు కలిసి మిగతా నలుగురిని ఓ ఆటాడుకుంటారు, వేటాడుతారు. నలుగురు దెయ్యాలను అభ్యర్థిస్తే దయ్యాలు చేసిన డాన్స్ ప్రోగ్రాం క్రియేటివ్ గా ఉంది. ఇంతవరకు ఏ సినిమాలు రానిది.

ఎవరైనా సరే చూడొచ్చు

ముందే చెప్పినట్లు ఇది ఒక అసంబద్ధమైన కథతో కూడిన, కామెడీ ఎంటర్టైనర్. నూటికి నూరుపాళ్ళు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడు క్రియేటివిటీకి, వెన్నెల కిషోర్ షార్ప్ కామెడీ టైమింగ్ కి నిదర్శనాలు. ఈ ఏడాది ఇంతవరకు వచ్చిన సినిమాలు ఏవి ఇంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. థియేటర్ మొత్తం నవ్వులు కేరింతలతో నిండిపోయే అవకాశం ఉండి, కొన్ని మానవ జీవన యాంగిల్స్ ని స్పృశించిన సినిమా ఇది. మంచి సినిమా కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన ప్రేక్షకులకు, మంచి సినిమా కాకపోయినా ఇది మంచి ఎంటర్టైనర్. కుటుంబంతో ఒక రెండు గంటల పాటు నవ్వుకోవాలంటే, ఈ సినిమా చూడొచ్చు. అన్నట్టు ఈ సినిమాకు ఇంకో బలం, ఈ సినిమా నిడివి. అది కేవలం రెండు గంటల నాలుగు నిమిషాలు మాత్రమే. ఒక్క నిమిషం కూడా నవ్వకుండా ఉండలేం.

నటీనటులు: వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందితా శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్,

దర్శకత్వం: శంకర్ కె. మార్తాండ్

డైలాగ్స్: శ్రీనివాస తేజ

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు. ఐ

ఎడిటర్: ఎం.ఆర్.వర్మ

నిర్మాత: డాక్టర్. అబినికా ఇనాబతుని

నిర్మాణ సంస్థ: మార్క్సెట్ నెట్వర్క్స్ ప్రొడక్షన్స్

విడుదల: జూన్ 21, 2024

Tags:    

Similar News