ఓటేసి వచ్చేస్తే చాలదు, వాళ్లకు థాంక్స్ చెప్పాలి: 'న్యూటన్' మూవీ రివ్యూ
నీతి, నిజాయితీకి మరో రూపంలో ఉండే అనే వ్యక్తి మావోయిస్టు ప్రభావితం ప్రాంతంలో ఎన్నికలను ఎలా నిర్వహించాడో తెలుసా. తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కొందరు వ్యక్తులు నడుస్తున్నారు.. కొండల్లో.. గుట్టల్లో… రెండు మూడు గంటల నడక తర్వాత కాసేపు రెస్ట్. మళ్ళీ నడక మొదలు. కొన్ని సార్లు సెలయేళ్లు దాటాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్ల కాలువలు అడ్డొస్తున్నాయి. బోటు సాయంతో అవతల పక్కకు చేరుకుంటున్నారు. బియ్యం, కూరగాయలు, స్టవ్ వగైరాలన్నీ ప్యాక్ చేసిన సంచుల్లో ఉంటాయి. ఎక్కడ వీలైతే అక్కడ వంట చేసుకుంటారు. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ నడక ప్రారంభిస్తారు. సాధ్యమైనంత వరకు రాత్రిళ్లు వాకింగ్‌కి రెస్ట్ ఇస్తారు. ఊరి పొలిమేరల్లో ఉండే చిన్నచిన్న షెడ్లలో నైట్ గడిపేస్తారు.
ఇంతలా నడుస్తున్నది మరెవరో కాదు పోలింగ్ సిబ్బంది. పోలింగ్ మెటీరియల్‌ని భుజాన మోసుకుని మైళ్లకుమైళ్లు నడుస్తున్నారు. ప్రతి పోలింగ్ టీంకి సాయంగా కొంతమంది పోర్టర్లను గవర్నమెంట్ ఇచ్చింది. ఈవీఎంలు, వాటికి అనుసంధానంగా ఉండే వీవీప్యాట్‌లు ఇతరపోలింగ్ మెటీరియల్‌ని జాగ్రత్తగా సంచుల్లో ప్యాక్ చేసుకుని పోర్టర్లు మోస్తుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా కొండ ప్రాంతం. ఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది బయల్దేరారు. పోలింగ్ స్టేషన్లను చేరుకోవడానికి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నా రు. కొండల మధ్యన నడుస్తూ పోలింగ్ స్టేషన్లకు ప్రయాణమయ్యారు. పోలింగ్ స్టేషన్లు పెట్టిన చోటుకు కార్లు, వ్యాన్లు వెళ్లవు. అవే కాదు స్కూటర్లు, బైక్‌లకు కూడా నో చాన్స్. దీంతో నడకనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. ఇది నిజంగా జరిగిన సంఘటనే.
ఈసారి పోలింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది ఇంజనీర్లు. ఊరి జనానికి ఉపయోగపడే ఏదో ఒక పని కోసం తరచూ నడుచుకుంటూ గ్రామాలకు రావడం వీరికి అలవాటే. ఈ కారణంతోనే వీరిని పోలింగ్ ఆఫీసర్లుగా సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు ఎన్నికల సంఘం అధికారులు. వాళ్లు పోలింగ్ జరిగే రోజుకు ఒకరోజు ముందుగానే సంబంధిత స్టేషన్‌కి చేరుకునేలా ప్లాన్ చేశారు. అంతా కొండ ప్రాంతం కాబట్టి ఏ ఇబ్బంది ఎదురైనా, పోలింగ్ రోజుకు చేరుకోవడం కష్టమవుతుందన్నది సిబ్బంది ఆలోచన. అందుకే ఒక రోజుముందుగానే స్టేషన్‌కి చేరుకుని అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. పోలింగ్ మెటీరియలే కాకుండా ఆహార పదార్థాలు కూడా వెంట తీసుకెళుతున్నారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో సక్సెస్‌ఫుల్‌గా ఎలక్షన్ డ్యూటీ చేసిన వారిని గుర్తించి ఈసారి కూడా వాళ్లకే డ్యూటీ వేశారు. అప్పట్లో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా (ఏపీఓ) ఉన్నవారిలో కొంతమందికి ఈసారి పోలింగ్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఏమైనా లోక్‌సభ ఎన్నికలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడానికి అరుణాచల్ ప్రదేశ్ ఉద్యోగులు నానాకష్టాలు పడ్డారు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్‌లోని మంచు ప్రదేశాల్లో ఎన్నికల సిబ్బంది పడే కష్టాలు అయితే ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే....
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలుస్తారు. ఓటేసిన వాళ్లంతా తాము ఓటు వేసిన నాయకుడు గెలిచాడా లేదా అనే చిన్నపాటి టెన్షన్‌లో ఉంటారు. అయితే అదే సమయంలో ఈ ఎలక్షన్ సమయంలో… సజావుగా ఎన్నికలకు జరిగేందుకు సహకరించే ఎలక్షన్ ఉద్యోగులు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కొద్ది గంటలు సేపు వారి రక్షణలో ఉంటుంది. అలాంటి వారిపై ఓ సినిమా వచ్చింది. ఈ టైమ్‌లో ఖచ్చితంగా గుర్తు వచ్చే.. గుర్తు చేసుకోవాల్సిన సినిమా న్యూటన్.
న్యూటన్ అనేది హీరో పేరు. అదేమీ వాళ్ల అమ్మా, నాన్న పెట్టిన పేరు కాదు. అతని పేరు నూతన్ కుమార్! కానీ 'న్యూటన్' అని పిలిపించుకోవడమే అతనికి మోజు. అలాగే న్యూటన్ అనే ఈ కుర్రాడు బాగా నిజాయితీపరుడు. ఎంతలా అంటే.. తను ఓ పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ అమ్మాయికి 16 ఏళ్లే అని తెలిసి పెళ్లి చూపుల నుంచి లేచి వెళ్లిపోతాడు. అయితే.. ఇలాంటి వాడిని తండ్రి కూడా అర్థం చేసుకోడు. నిజాయితీపరుడు అనే గుర్తింపు కోసం పాకులాడుతున్నాడని వెటకారం చేస్తాడు తండ్రి. అలాంటి వ్యక్తి ప్రభుత్వోద్యోగం సాధించిన తర్వాత.. మావోయిస్టుల ప్రభావం విపరీతంగా ఉండే ఓ అఢవిలో పోలింగ్ బూత్ ఆఫీసర్‌గా ఎలక్షన్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది.
ఆ దండకారణ్యంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో కేవలం 76 ఓటర్లు ఉండే ఒక పోలింగ్ బూత్‌లో అతని డ్యూటీ. అక్కడ సిట్యువేషన్ ఏమిటి అంటే ఓటింగ్‌ను పెద్దగా పట్టించుకోని గిరిజనులు.. పోలింగ్‌ను లైట్ తీసుకునే పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలింగ్ సిబ్బంది.. దేశం కోసం ప్రాణాలిచ్చే ఆర్మీ.. వీటిన్నిటి మధ్య హీరో నిజాయితీ ప్రయాణం ఎలా సాగించాడన్నదే సినిమా. అక్కడ చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ఎలా ఉంటుందో ఆ ఓటర్లకు తెలీదు. కనీసం ఎలక్షన్స్‌లో నిలబడ్డ అభ్యర్థుల గురించి విననైనా లేదు వాళ్లు. అక్కడ డ్యూటీ ఒక వృథా ప్రయాస అని అక్కడి సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్ ఆత్మాసింగ్ (పంకజ్ త్రిపాఠి)కి తెలుసు. కానీ న్యూటన్ లక్ష్యం ఒక్కటే.. అవినీతికి తావు లేకుండా స్వేచ్ఛగా పోలింగ్ జరపడం! ఆ ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేది ప్రధానాంశం.
వాస్తవానికి తన విధుల్ని నిజాయితీగా నిర్వర్తించాలనుకొనే ఒక ఉద్యోగికి మన ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో హృదయాన్ని స్పృశించేలా, ఒకింత డార్క్ కామెడీని జోడించి, ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరక్టర్ అమిత్. కథలో ఏ ప్రదేశం గురించి చెప్పాడో అదే ప్రదేశంలో షూటింగ్ నిర్వహించాడు. దండకారణ్యంలోకి షూటింగ్ నిమిత్తం జనరేటర్లను, లైట్లను తీసుకెళ్లడం కుదరదు. అందుకే పగటి వెలుతురులో షూటింగ్ జరిపాడు. వేకువ సన్నివేశాల్ని వేకువలో, మధ్యాహ్న సన్నివేశాల్ని మధ్యాహ్నం తీశాడు. వెలుతురు మందగిస్తే మరుసటి రోజు వరకు ఆగాల్సిందే. అమిత్ ఎక్కడైతే షూటింగ్ నిర్వహించాడో ఆ చోటు ప్రభుత్వం ప్రకారం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అయితే అటు ప్రభుత్వం కానీ, ఇటు నక్సల్స్ కానీ 'న్యూటన్' షూటింగ్‌కు ఆటంకం కలిగించలేదు.
ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్ అమిత్ వి. మసుర్కర్ దే. అమిత్ కు 'న్యూటన్' కేవలం రెండో చిత్రం. ఈ సినిమా చేయటానికి ఆరేళ్ల క్రితం 'సులేమాని కీడ' అనే సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. రెండో సినిమా కోసం ఆయన దృష్టి మన ఎన్నికల వ్యవస్థపై, అందులోనూ పోలింగ్ బూత్‌పై పడింది. ప్రజాస్వామ్యానికీ, పోలింగ్ బూత్‌కూ అవినాభావ సంబంధం ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. ఒక సాధారణ పౌరుడు ఓటు వేసి, తన మనోగతాన్ని వెల్లడించే పోలింగ్ బూత్ చుట్టూ ఎందుకు సినిమాని నడపకూడదనే ఆలోచన వచ్చిందే తడవుగా 'న్యూటన్' కథను అల్లాడు అమిత్. ఇలాంటి ఇంటెన్స్ మూవీకి కామెడీ మిక్స్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంటుంది. చివరగా న్యూటన్ టైటిల్ విషయంలో ఇచ్చిన క్లారిటీ సూపర్ అనాల్సిందే.
న్యూటన్‌గా టైటిల్ రోల్‌లో రాజ్‌కుమార్ రావ్ నటన అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది మరియు 90వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్‌గా కి ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో భారతదేశానికి నామినీగా కూడా నిలిచింది.చి ఆస్కార్ రాలేదు కానీ పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. ఇలాంటి సినిమాలను మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్‌లో మనం ఓటేసి వచ్చేస్తాం కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్దని సజావుగా నడపటానికి ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసుకోవాలి. కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
ఇక నటుడు రాజ్ కుమార్ రావును భారత ఎన్నికల సంఘం జాతీయ చిహ్నం (నేషనల్ ఐకాన్)గా గుర్తించింది. చాలామంది యువత, విద్యావంతులు, పట్టణవాసులు ఎంతో మంది ఉదాసీనతకులోనై తమ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌ల వద్దకు రావడం కంటే సెలవు రోజుగా ఇంటివద్దే ఉండటానికి ఇష్టపడుతున్నారు. వారంతా పోలింగ్ లో పాల్గొనేలా ప్రేరేపించడానికి ప్రముఖ వ్యక్తులను ఎన్నికల సంఘం జాతీయ చిహ్నాలుగా నియమిస్తోంది. అందులో భాగంగానే రాజ్ కుమార్ రావును ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్రపాండే, అరుణ్ గోయల్‌లతో కూడా పోల్ ప్యానెల్ ఈసీ ఐకాన్‌గా నియమిస్తూ ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది.
ఎక్కడుంది సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'న్యూటన్' స్ట్రీమింగ్ అవుతోంది.