పరువు, అహంకారం, ప్రేమ: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ
ఇది సినిమా కాదు, ఘటన!
తెలంగాణాలోని ఓ చిన్న గ్రామం. అక్కడ రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ అంటే పెద్ద పేరు. అతని బ్యాండ్ లేనిదే ఆ చుట్టు ప్రక్కన పెళ్లీ కాదు..చావు నడవదు. ప్రశాంతంగా తన బ్యాండ్ ఏదో తను వాయించుకుంటున్న అతని జీవితంలోకి బ్యాండ్ బాజా బరాత్ వాయించటానికి రాంబాయి (తేజస్విని రావ్) ప్రవేశించింది. అతని ప్రేమను ఆమె మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత తర్వాత మెల్లిగా ఓకే చెప్పేస్తుంది. అయితే మరి ఇప్పుడు వీరి ప్రేమ కథను పెద్దవాళ్లు ఓకే చెప్పి పెళ్లి చేయాలి. అయితే అక్కడే ట్విస్ట్ పడుతుంది.
రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ)కు ఇలాంటి ప్రేమ యవ్వారాలు నచ్చవు. మరీ ముఖ్యంగా బ్యాండ్ వాయించుకునే రాజు అంటే చిన్న చూపు. దాంతో నో చెప్పేస్తాడు. చక్కగా తన కూతురుని ఓ గవర్నమెంట్ ఉద్యోగస్తుడుకి ఇచ్చి చెయ్యాలని కలలు కంటూంటాడు. ఈ విషయం ఈ ప్రేమ జంటకు తెలిసిపోయి..ఆ తండ్రిని ఒప్పించటానికి ఓ సినిమాటెక్ ప్లాన్ వేస్తారు. అది మరేదో కాదు..ఆమెను గర్బవతిని చేస్తే చచ్చినట్లు వేరే దారిలేక తనకి ఇచ్చే పెళ్లి చేస్తారని రాజు ఆలోచన. దాన్ని అమల్లో పెడతారు. అయితే మరి వాళ్ల ప్లాన్ ఫలించిందా..చివరకు ఏమైంది...అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
2010 టైమ్ లో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఆ సంఘటన నే క్లైమాక్స్ గా వాడారు. దాంతో ఆ క్లైమాక్స్ ప్లస్ గా, మైనస్ గా మారింది.
కథ రాసుకున్నప్పుడు సినిమాలో ఏకైక హైలెట్ విషయం...సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఇంటెన్స్ ట్విస్ట్ .. దాన్ని టార్గెట్ చేసుకుని అక్కడదాకా మిగతా సినిమా అంతా నడవాలి. అలాంటప్పుడు సాధారణంగా దర్శక,నిర్మాతలు ఏం చేస్తారు. అదిరిపోయే పాటలు, అద్బుతమైన లవ్ ట్రాక్ తో నడిపిస్తూ ముందుకు వెళ్తారు. ఉప్పెన సినిమాకు అదే జరిగింది. అయితే ఆ మ్యాజిక్ ఇక్కడ రిపీట్ కాలేదు. అందుకు కారణం ఎక్కువ శాతం డాక్యుమెంటరీలా అనిపించటమే.
గాలి, దుమ్ము, వంతెన, మట్టి — ఇవన్నీ కథకు నేటివిటి అద్దాయి. కానీ స్క్రీన్‌ప్లే ఈ వాతావరణాన్ని కథను ముందుకు నడిపించేలా ఉపయోగించలేదు. గ్రామం ఒక “లివింగ్ ఆర్గానిజం”లా కనిపించినా, అది కథలో యాక్టివ్ ఫోర్స్ కాలేదు.
అలాగే రాజు–రాంబాయి ప్రేమకు: ఆర్క్ ఒకటి ఉంది, మోటివ్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, పేయాఫ్ కూడా ఉంది, కాని డెప్త్ లేదు.రాజు ఎమోషన్ సౌండ్‌లో ఉంటుంది, రాంబాయి ఎమోషన్ సైలెన్స్‌లో ఉంటుంది. కానీ స్క్రీన్‌ప్లే వాళ్ల వ్యక్తిగత ప్రపంచాలను లోపలకి వెళ్లి చూపించలేదు. పాత్రలు సన్నివేశాలను నడపలేదు —సన్నివేశాలు పాత్రలను నడిపించాయి. కథలో వచ్చే ప్రతి బీట్ — ప్రపోజల్, తిరస్కారం, చిన్న చిన్న అల్లరి, గ్రామంలో అందరికీ తెలిసిపోవడం—అన్నీ చూసినవే. దాంతో లీడ్ పెయిర్ లవ్ ట్రాక్ “నిజం” అనిపించినా, “కొత్తది” గా అనిపించదు.
విలన్ ఏ ప్రేమకథలోనైనా థీమాటిక్ ఎన్కౌంటర్ పాయింట్. ఇక్కడ అమ్మాయి తండ్రి వెంకన్న స్క్రీన్‌ప్లేకు కేంద్ర బలం కావాలి. కోర్ట్ సినిమాలో శివాజీ పాత్రలా. కానీ… అతని పాత్రలో ఆ ఫోర్స్ సరపడా లేదు. క్లైమాక్స్ ట్విస్ట్ పండటం కోసం దాచి పెట్టారు. దాంతో విలన్ ఒక టిక్లింగ్ క్లాక్ కాదని వెంటనే అర్థమవుతుంది. అది కథను ప్రమాద రహితంగా చేస్తుంది.
పరువు హత్యల ప్రధాన మూలం — కల్చరల్ ప్రైడ్ + పబ్లిక్ హ్యూమిలియేషన్ భయం, ఇవి అతనిలో మౌనంగా ఉన్నా… స్క్రీన్‌ప్లే అవి బయట పెట్టలేదు. అందుకే అతని క్రూరత “ఇన్సిడెంట్”లా కనిపిస్తుంది కానీ “పర్సన్”లా కాదు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా అకస్మాత్తుగా ఒక మానసిక రోదనలా మారుతుంది. అది అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పలేం. ఎందుకంటే క్లైమాక్స్‌తోనే సినిమా అస్తిత్వం పొందుతుంది.
ఎవరెలా చేసారు..
హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినా చాలా బాగా నటించారు. దర్శకుడు మంచి అవుట్ ఫుట్ తీసుకున్నాడు. టెక్నికల్ గా సురేశ్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. పాటలు అద్బుతం కాదు కానీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ సెకండాఫ్ ని మరోసారి ఎడిట్ చేస్తే ప్రేక్షకులు థాంక్స్ చెప్దురు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
మన సమాజం బయటికి శాంతిగా కనిపించినా, లోపల ఇంకా న్యాయమేలేని చీకటితో నిండిపోయి ఉందని ఈ కథ మెల్లగా, వేధించే నిశ్శబ్దంతో చెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఏదైమైనా తాను నమ్మిన కథను అంతే నిజాయితీగా చెప్పాలని, ఎక్కడా కమర్షియల్ ఆలోచనల వైపుకు వెళ్లకుండా ప్రయత్నించిన దర్శకుడు తెగువని మెచ్చుకోవాలి. అలాగే ఇలాంటి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేసిన నిర్మాతలును అభినందించాలి. అయితే ఇలాంటి సినిమాని ఇంత టైమ్, డబ్బు ఖర్చు పెట్టి థియేటర్ లో చూస్తారా అనేదే పెద్ద ప్రశ్న. అందులోనూ ఈ ఓటిటి రోజుల్లో...చూస్తే నిజంగానే చిన్న సినిమాను పెద్ద మనస్సు చేసుకుని ఎంకరేజ్ చేసే జనం ఉన్నారని భావించాలి.