భయం అంటే ఇదే: ‘ది బ్రైడ్’ (The Bride) ఓటీటి మూవీ రివ్యూ
హారర్ ప్రియులకు ఫుల్ కిక్కిచ్చే సినిమా ‘ది బ్రైడ్’. రష్యా సినిమా అయినా చాలా బాగుంది. హారర్ లవర్స్ తప్పకుండా ఒక లుక్కేయాల్సి మూవీ..
భయం అనే ఎమోషన్ చాలా మందికి నచ్చే ఓ కమర్షియల్ ఎలిమెంట్. అందుకే సినిమాని చూస్తూ భయపడటానికి, ఉలిక్కిపడటానికి, భయంలోని థ్రిల్ ఎంజాయ్ చేయడానికి తండోపతండాలుగా వస్తుంటారు ప్రేక్షకులు. కాబట్టే హారర్ సినిమాల జోనర్‌కి ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్. అయితే మనకి ఇక్కడ హారర్ సినిమాల కంటే హారర్ కామెడీలంటేనే మోజు ఎక్కువ. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి సక్సెస్ స్ఫూర్తితో బోలెడన్ని హారర్ కామెడీ సినిమాలు తయారయ్యాయి. ఇప్పటికీ అప్పుడప్పుడూ వస్తూంటాయి. అయితే ప్యూర్ హారర్ సినిమాలు చూద్దామనుకునే వారికి ఇవి పెద్దగా కిక్ ఇవ్వవు. అలాంటప్పుడు వేరే భాషలో వచ్చే హారర్ చిత్రాలపై ఆధారపడక తప్పదు. అందుకే ఎక్కడైనా మంచి నికార్సయిన హారర్ సినిమా వచ్చినా వెతుక్కుని మరీ చూసేస్తూంటాం. కాకపోతే ఆ భయం చూసేవాళ్లకు వెన్నులో వణుకు పుట్టించాలి. అలాంటి హారర్ చిత్రం ఒకటి ఇప్పుడు యాపిల్ టీవీలో ఉంది. ఆ సినిమా పేరు ‘ది బ్రైడ్’.
‘ది బ్రైడ్’స్టోరీ లైన్ విషయానికి వస్తే.. 1800 సంవత్సరంలో ఓ కెమిస్ట్రీ జీనియస్ డాక్టర్.. కొత్తరకం సిల్వర్ లెన్స్ కనుక్కుంటాడు. ఆ లెన్స్ కేవలం ఎదుటివారి ఫొటోని మాత్రమే కాకుండా ఆత్మను సైతం పట్టుకోగలుగుతుంది. అంటే ఆ లెన్స్ ఉన్న కెమెరాతో చనిపోయిన వారి ఫొటో తీస్తే ...వాళ్ల ఆత్మను కాప్చర్ చేయగలుగుతామున్నమాట. ఆ కెమిస్ట్ భార్య పెళ్లైన కొద్దికాలానికే అనారోగ్యంతో చనిపోతుంది. దాంతో ఆమె ఆత్మను తన కెమెరాతో బయటకు తీసి వేరొక శరీరంలోకి ప్రవేశపెట్టాలనుకుంటాడు. అందుకే ఆమె చనిపోయాక పెళ్లికూతురులా అలంకరించి ఫొటో తీస్తాడు. ఆ ఫొటోను దాచిపెడతాడు. తర్వాత ఓ అమ్మాయిని తీసుకొచ్చి తన భార్య రింగ్ తొడగటం ద్వారా ఆ ఆత్మను ఆ అమ్మాయిలోకి పంపాలనుకుంటాడు.
అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రయోగం సక్సెస్ అవదు. తన భార్యది కాకుండా వేరొకరి ఆత్మ వచ్చి అతడు తీసుకొచ్చిన అమ్మాయిలో దూరుతుంది. అంతేకాకుండా అది ఓ జాంబీ మాంస్టర్‌లా రూపొందిన అతని కుటుంబాన్ని ఏం చేయకుండా ఉండాలంటే ఓ వర్జిన్ అమ్మాయిని తీసుకొచ్చి బలి ఇమ్మని కండీషన్ పెడుతుంది. ఆ తర్వాత ఆ కెమిస్ట్ చనిపోతాడు. ఇంకింతే కథ అని అనుకోకండి. కథ ఇంకా అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇదంతా గతం అన్నమాట.
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఈ కాలంలోకి వస్తే... నాస్త్య (విక్టోరియా అగలకోవా), ఇవాన్ (వ్యాచెస్లేవ్ చెపుర్చెంకో)లు కొత్తగా పెళ్లైన జంట. ఇవాన్.. తన భార్య నాస్త్యను తన వంశ పారంపర్యంగా వస్తున్న ఇంటికి తీసుకెళ్తాడు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఇవాన్ చెల్లెలు లీసా (అలెక్సాండ్రా రెబెనాక్).. తన పిల్లలతో కలిసుంటుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ ఇల్లు మరెవరిదో కాదు 1800ల్లో మనకు చూపించిన కెమిస్ట్ ఫొటోగ్రాఫర్ ఇల్లే అది. అంటే ఇవాన్ కూడా ఆ కెమెస్ట్ వంశానికి చెందినవాడే అన్నమాట.
ఇక ఆ ఇంట్లోకు వెళ్లినప్పుడు నాస్త్యకు గిప్ట్‌గా రింగ్ ఇస్తుంది ఆమె ఆడబడుచు. ఆ రింగ్ మరేదో కాదు.. మొదట్లో మనం చూసిన రింగే. అక్కడ నుంచి నాస్త్యకు అక్కడ ఏదో తేడా కొడుతూంటుంది. వింతగా భయపెట్టే సంఘటనలు జరుగుతూంటాయి. ఎవరికైనా చెప్పినా అక్కడ అంతా బాగానే ఉందని, అదంతా నీ భ్రమ అని కొట్టిపారేస్తూంటారు. అయితే అసలు నిజం ఏంటంటే… ఆ ఇంట్లో ఉండిపోయిన ఆత్మకు నాస్త్యను బలి ఇవ్వడానికి లీసా స్కెచ్ వేసిందన్నమాట. అందుకే పెళ్లి అయిన వెంటనే నాస్త్యను అక్కడికి తీసుకురమ్మని ఇవాన్‌ను పురమాయించింది.
ఇలా కథ నడుస్తూండగా.. ఈ సీక్రెట్ ఇవాన్‌కు తెలిసిపోతుంది. తన భార్యే బలి పశువు అని అర్థమై కంగారుపడతాడు. ఆత్మ ఏమో ఓ ప్రక్క నరబలి కోసం ఆశగా.. ఆవేశంగా ఎదురుచూస్తూంటుంది. లీసా కూడా అదే పనిమీద ఉంటుంది. ఇవాన్ మాత్రం తన భార్యను కాపాడుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. కానీ అతన్ని బంధించేసి ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా తెర వేస్తుంది అతని చెల్లెలు. అప్పుడు ఏమైంది. ఇవాన్ తన భార్యను కాపాడుకోగలిగాడా? చివరకు ఆ ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదేదో గొప్ప సినిమా.. యావత్ ప్రపంచాన్ని షేక్ చేసేసిందని కాదు కానీ.. ఉన్నంతలో చాలా చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, సెట్ డిజైన్, కాన్సెప్ట్ అన్ని ఫెరఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. అయితే కాస్తంత స్లోగా వెళ్తూంటుంది సినిమా. యాక్ట్ 1, యాక్ట్ 2 రెండు కూడా ఇంట్రస్టింగ్‌గా తర్వాత ఏం జరుగుతుందనే యాంగిల్‌లోనే వెళ్లాయి. కానీ థర్డ్ యాక్ట్‌కు వచ్చేసరికే తన్నేసింది. చాలా ప్రెడిక్టబుల్‌గా, ఇల్లాజికల్‌గా ఎలాగోలా ముగించేయాలి, లేకపోతే ఆ దెయ్యం మనల్ని తినేస్తుందేమో అని డైరక్టర్ భయపడి కంగారుపడినట్లు అనిపిస్తుంది. అయితే ఈ కాన్సెప్టు ఒరిజల్‌గా ఉండటం ఇప్రెస్ చేస్తుంది.
చూడచ్చా..
ఈ సినిమా slow moving atmospheric horror. ఆ నేరేషన్‌కు ప్రిపేర్ అయ్యే సినిమా చూడటం బెస్ట్.
ఎక్కడుంది
అమేజాన్ ప్రైమ్ లోనూ,నెట్ ప్లిక్స్ లోనూ, యాపిల్ టీవిలో (ఇంగ్లీష్ వెర్షన్ అందుబాటులో ఉంది)
ఇది రష్యన్ చిత్రం