‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి శంకర్ సమస్య? రెడ్ కార్డ్ జారీ ?

రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-01-07 11:26 GMT

రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ట్రైలర్ రిలీజ్ తో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పుష్ప 2 చిత్రం నార్త్ ఇండియాలో దుమ్ము రేపిన నేపథ్యంలో ఈ చిత్రం అక్కడ మార్కెట్ ని ఏ స్థాయిలో రీచ్ అవుతుందని కొందరు లెక్కలేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు శంకర్ సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ కు అడ్డంకులు రాబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు శంకర్ కారణమంటోంది తమిళ మీడియా. అసలు ఏం జరుగుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రానికి శంకర్ దర్శకుడు కావడం, చరణ్‍కు పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉండడంతో తమిళనాడులోనూ ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళంలోనూ ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాత రెడీ అయ్యారు. అయితే, ఊహించని విధంగా తమిళనాడులో ఈ మూవీ రిలీజ్ ఆపాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమాను తమిళనాడులో రిలీజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూజర్ కౌన్సిల్‍ను లైకా ప్రొడక్షన్స్ కోరింది.

తమిళ నాడులో వినపడుతున్న వార్తల ప్రకారం , ఇండియన్ 3 షూటింగ్ పూర్తి చేయనందుకు నిర్మాతల సంఘం సహాయంతో శంకర్‌పై లైకా ప్రొడక్షన్స్ రెడ్ కార్డ్ జారీ చేయడానికి ప్రయత్నించింది. గతంలో ఇండియన్ 3 షూటింగ్ పూర్తి చేయమని లైకా శంకర్‌ని కోరినప్పుడు, శంకర్ 80 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం, నిర్మాణ వ్యయం 50 కోట్లు, అలాగే అతని రెమ్యునరేషన్ 30 కోట్లు. అయితే, ఇండియన్ 2 కూడా నష్టపోవడంతో లైకా ఈ డిమాండ్‌ ఒప్పుకోలేదు. లైకా ప్రొడక్షన్స్ కేవలం నిర్మాణ వ్యయాన్ని మాత్రమే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. శంకర్ రెమ్యునరేషన్ లేకుండా పని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇండియన్ 3ని శంకర్ ఇప్పటికీ పూర్తి చేయలేదు. కొన్ని భాగాలు మరియు ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది.

అందుకే ఇదే అవకాశం అని లైకా భావించింది. ఇండియన్ 3 చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ పూర్తి చేసే వరకు.. గేమ్ ఛేంజర్ రిలీజ్‍ను ఆపివేయాలని డిమాండ్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై కమల్ హాసన్ ...ఇండియన్ 3 చిత్రం కూడా శంకర్ లైనప్‍లో ఉంది. ఇండియన్ 2 దారుణ డిజాస్టర్ అవటం, గేమ్ ఛేంజర్ లైన్ లో ఉండటంతో ఈ మూడో పార్ట్ ని శంకర్ పక్కన పెట్టేశారు. దీంతో ఇండియన్ 3 పూర్తి చేయాలంటూ టైమ్ చూసి మెలిక పెట్టింది లైకా. గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసింది.

ఇక గేమ్ ఛేంజర్ మూవీని అడ్డుకునేందుకు లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నించడంపై అక్కడి ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బ్యానర్‌లో పొంగల్ (సంక్రాంతి)కు రావాల్సిన అజిత్ విదాముయర్చి చిత్రం వాయిదా పడింది. దీంతో అక్కడ స్టార్ హీరోల చిత్రాలు పండుగకు బరిలో లేవు. తమిళనాడులోనూ గేమ్ ఛేంజరే పొంగల్‍కు మెయిన్ ఫిల్మ్ గా ఉంది. దీంతో ఈ చిత్రాన్ని అడ్డుకోవడం సరికాదని కూడా ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తున్నాయి.

అంతేకాకుండా గేమ్ ఛేంజర్‌ను ఆపడం ద్వారా లైకా తనను తాను నాశనం చేసుకుంటోందని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పుడు లైకాపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 3ని చూడటానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అయితే గేమ్ ఛేంజర్ విడుదలై హిట్ అయితే, రెండూ శంకర్ సినిమాలే కాబట్టి ఇండియన్ 3కి హైప్ వచ్చే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు. అలాగే ఈ రెడ్ కార్డ్ సమస్యలు దర్శకుడు శంకర్‌పై మాత్రమే ఉన్నాయని, గేమ్ ఛేంజర్‌కు వ్యతిరేకంగా కాదని సమాచారం. ఈ సినిమాని సజావుగా విడుదల చేసేందుకు తమిళ డిస్ట్రిబ్యూటర్లు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏదైమైనా కొన్ని ఒప్పందాలతో మొత్తంగా గేమ్ ఛేంజర్ మూవీ అనుకున్న విధంగానే విడుదల అవడం ఖాయంగా కనిపిస్తోంది.

బడ్జెట్ ఎంత

ఈ సినిమా కు 300 కోట్లు దాకా పెట్టుబడి పెట్టారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే 250 కోట్ల దాకా థియేటర్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే 400-450 కోట్లు దాకా గ్రాస్ రావాలి. అంటే తమిళనాడులో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ కావాలి. అలాగే నార్త్ ఇండియా నుంచి 100 కోట్లు తెచ్చుకోగలగాలి. ఇది మెగా ఛాలెంజే అంటున్నారు. పుష్ప 1 నార్త్ లో సూపర్ హిట్ కాబట్టి పుష్ప 2 కు అక్కడ ఆ స్థాయి మార్కెట్ క్రియేట్ అయ్యింది.

కానీ గేమ్ ఛేంజర్ చిత్రం అక్కడ మార్కెట్ లోకి ప్రవేశించాలంటే ఆర్.ఆర్.ఆర్ ద్వారా వచ్చిన ఇమేజ్ శరణ్యం. కాబట్టి ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ సినిమా తమిళనాడు, కర్ణాటక, కేరళలలో గట్టిగా ఆడాలి. సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొట్టాలి. రామ్ చరణ్ స్టార్ డమ్ , శంకర్ కు ఉన్న మాస్టర్ స్టోరీ టెల్లర్ ఇమేజ్ కలిసి సినిమాకు పాజిటివ్ టాక్ రప్పించగలిగితే నెక్స్ట్ లెవెల్ లోకి సినిమా వెళ్తుంది. ఫస్ట్ డే టాక్ పై ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇలాంటి కీలక సమయంలో తమిళనాడులో సినిమా రిలీజ్ కు అడ్డంకులు అంటే పెద్ద ఇబ్బందే.

గేమ్ ఛేంజర్ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. భారీ బడ్జెట్‍తో రూపొందించారు. ఈ మూవీలో రామ్‍చరణ్‍తో పాటు కియారా అడ్వానీ, అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ లో ప్రభుత్వ ఉద్యోగిగా, మరొక క్యారెక్టర్ లో పొలిటిషన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani), టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali )హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో ఒక్కసారి నిర్వహించగా, ఏపీలోని రాజమహేంద్రవరంలో జనవరి 4వ తేదీన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇంక ఇప్పుడు సజావుగా రిలీజ్ అయ్యి..రికార్డ్ లు బద్దలు కొట్టడమే మిగిలింది.

Tags:    

Similar News