జానీ మాస్టర్ వివాదం: పవన్ ఫ్యాన్స్ Vs బన్నీ ఫ్యాన్స్

ఝాన్సీ వ్యాఖ్యలతో.. కొత్త వివాదం మొదలైంది. పవన్ వెర్సస్ బన్నీ వివాదం మళ్లీ రాజుకుంది.

Update: 2024-09-20 01:17 GMT

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి నగరానికి తీసుకొస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముంది. ఈ నేపధ్యంలో జానీ మాస్టర్ కేసుపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. మరో ప్రక్క సోషల్ మీడియా ఈ విషయమై చర్చలు చేస్తూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు సోషల్ మీడియా ఇప్పుడు రెండుగా ఈ ఇష్యూ విషయంలో విడిపోయిందనే చెప్పాలి. యూట్యూబ్ ఛానెల్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు.

ఝాన్సీ వ్యాఖ్యలతో..

ముఖ్యంగా జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు నటి, యాంకర్‌ ఝాన్సీ మాట్లాడుతూ అన్న ఓ మాట పెద్ద చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఒక పెద్ద హీరో తన మేనేజర్‌తో ఫోన్‌ చేయించి జానీ మాస్టర్ పై కంప్లైంట్ చేసిన ఆ అమ్మాయికి తన సినిమాలో అవకాశమిస్తామని హామీనిచ్చారని ఝాన్సీ పేర్కొన్నారు. ఆ మాటలు వైరల్ అయ్యాయి. ఆమె ఎవరా హీరో అనేది పేరు చెప్పకపోయినప్పటికీ అది అల్లు అర్జునే అని ఫిక్స్ అయ్యిపోయారు. అక్కడ నుంచి కొత్త వివాదం మొదలైంది. పవన్ వెర్సస్ బన్నీ వివాదం మళ్లీ రాజుకుంది. పవన్ అభిమానులు, కొందరు జనసేన సైనికులు చాలా మంది అల్లు అర్జున్ వెనక ఉంది ఇదంతా చేయించాడనటం మొదలెట్టారు. అంతేకాకుండా , YSRCP పార్టి సైతం జాని మాస్టర్ వివాదం వెనక ఉందని అనటం మొదలెట్టారు.

అల్లు అర్జున్ సాయం

అదే సమయంలో జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలికి అల్లు అర్జున్ భరోసా ఇచ్చారని,. తను నెక్స్ట్ చేయబోయే సినిమాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోయే సినిమాలలో కూడా ఛాన్స్ ఇస్తానంటూ ఫోన్ చేసి మరీ చెప్పారని సోషల్ మీడియా జనం మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు మొదట భాధితరాలు పక్షాన మాట్లాడాడు ,సపోర్ట్ చేస్తున్నాడంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. కానీ బన్నీ హేటర్స్, జనసైనికులు మాత్రం ఈ విషయంలో బన్నీ స్వార్థం చూసుకుంటున్నాడు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇప్పుడేమో బాధితురాలికి అండగా నిలుస్తానని చెబుతున్నాడు. గతంలో ఇలాంటి ఆరోపణల వల్లే ఒక యువతి ఆత్మహత్యకు కారణమైన పుష్ప నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని బెయిల్ పై బయటకు తీసుకొచ్చాడు అని గుర్తు చేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ Vs బన్నీ ఫ్యాన్స్

పొలిటికల్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఈ కేసు నమోదవగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీకి జనసేన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళకు అల్లు అర్జున్ మద్దతునిచ్చారని వైరల్ అవుతున్న విషయంలోనూ మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతోంది. ఏపీ ఎన్నికల నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు ఉన్నాయి. వైసీపీ నంద్యాల అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంతో సోషల్ మీడియాలో మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్ ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో అది పీక్స్ కు వెళ్లింది.

నాగబాబు ట్వీట్స్

జానీ మాస్టర్ పేరు డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్స్ చేశారు మెగా బ్రదర్. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. మొదటి పోస్ట్ లో ‘ మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ప్రతి కథలోనూ మూడు వెర్షన్‌లు ఉంటాయి. మీ వైపు, నా వైపు, నిజం’ అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను నాగ బాబు షేర్ చేశారు.

అంతకు ముందు ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో చెప్పిన కొటేషన్‌ను కూడా నాగ బాబు షేర్ చేశాడు. అయితే ఈ రెండు ట్వీట్స్ లో ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు నాగ బాబు. అయితే వీటి అర్థాలు, సందర్భాన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్ కోసమే ఈ ట్వీట్స్ చేసినట్లు ఉంది.

మరో ప్రక్క టాలీవుడ్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. కొరియోగ్రఫి అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్‌ను తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సిఫారసు చేసింది. పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీ కోరారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే..

ఇక తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేశారు.

బాధితురాలు ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందంటే..

‘‘2017లో జానీ మాస్టర్‌ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా షూటింగ్ కు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

లైంగిక వాంఛ తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడు. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్‌ టీమ్ నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్‌ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో రాసి ఉంది’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Tags:    

Similar News