నిర్మాత నాగవంశీ, డైరక్టర్ శంకర్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అసహనం, ఓర్వలేకనా?
గత ఐదేళ్లుగా బాలీవుడ్ వరుస ఫ్లాప్ లను చూస్తున్న సంగతి తెలిసిందే.;
గత ఐదేళ్లుగా బాలీవుడ్ వరుస ఫ్లాప్ లను చూస్తున్న సంగతి తెలిసిందే. అప్పటికి రకరకాల జానర్స్ ని మార్చి మార్చి ట్రై చేస్తుంది. కానీ ఏదీ చెప్పుకోదగిన రీతిలో వర్కవుట్ కావడం లేదు. బయోపిక్ లు , వార్ ఫిల్మ్ లు, ప్రాపగాండా ఫిల్మ్ లు, రొమాంటిక్ కామెడీలు, సీక్వెల్స్, ప్రీ క్వెల్స్, ఫ్రాంచైజీలు, రీబూట్, రీమేక్ లు , ఒరిజినల్ ఫిల్మ్ లు, రూరల్ డ్రామాలు, అర్బన్ యాస్పిరేషనల్ మూవీస్ ఇలా ఎన్నో బాలీవుడ్ లో వస్తూనే ఉన్నాయి. కానీ దేశం మొత్తాన్ని అల్లాడించే సినిమా మాత్రం రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ ని మెప్పించలేకపోతున్నాయి.
సల్మాన్ , అమీర్ ఖాన్ వంటి స్టార్స్ సైతం చేతులెత్తేసారు. ఉన్నంతలో షారుఖ్ ఖాన్ కొద్దిగా మేలుకుని సౌత్ డైరెక్టర్ అట్లీ తో చేసిన జవాన్ ట్రాక్ లో పెట్టింది. అదే సమయంలో ఇక్కడ సౌత్ సినిమాల్లో కొన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి, సలార్, పుష్ప, కల్కి ఇలా మన సినిమాలు నార్త్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఇక్కడ సౌత్ డైరక్టర్స్ కు అక్కడ విపరీతమైన డిమాండ్ పెరిగింది. సందీప్ వంగా వంటి దర్శకులకు అక్కడ నిర్మాణ సంస్దలు బ్రహ్మరథం పడుతున్నాయి. ఈ విషయం బాలీవుడ్ దర్శకులకు పెద్ద ఇబ్బందిగా మారింది. నిర్మాత నాగవంశీ కొంచెం అటూ ఇటూలో ఇదే విషయాన్ని రీసెంట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ మీట్ లో చెప్పుకొచ్చారు. కానీ ఈ మాటలు తట్టుకునే శక్తి బాలీవుడ్ కు లేనట్లుంది. ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తోంది. అలాగే దర్శకుడు శంకర్ సైతం బాలీవుడ్ గురించి మాట్లాడిన మాటలు అక్కడవారికి కోపం తెప్పిస్తున్నాయి. అసలేం జరిగింది...ఎవరేమన్నారో చూద్దాం.
నిర్మాత నాగవంశీ (Naga Vamsi)పై బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా పేరుపొందిన బోనీకపూర్‌తో నాగవంశీ మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. స్టార్ ప్రొడ్యూసర్ తో ఈవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్స్‌తోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. ‘‘బోనీకపూర్ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్యలతో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడి వైఖరి ఏమీ బాలేదు. నాలుగు హిట్స్ అందుకున్నంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు రాజు కాలేడు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్‌బాబు వంటి వారితోనూ ఇదేవిధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు.. గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతరం సంజయ్ మరో పోస్ట్ పెట్టారు. ‘పుష్ప 2’ చిత్రం రూ.86 కోట్లు వసూలుచేసిన తర్వాత బాలీవుడ్ మొత్తం నిద్రపోలేదు’ అని నాగవంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సంజయ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘మా ఎగ్జిబిటర్ల వల్లే ఆ సినిమా రూ.86 కోట్లు కలెక్ట్ చేసిందని తెలిసి మేము చాలా ప్రశాంతంగా నిద్రపోయాం. మేము మీలా కాదు. ఎదుటివాళ్ల విజయం మాకు నిద్ర లేని రాత్రులు ఇవ్వదు’’ అని పేర్కొన్నారు. సంజయ్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు నాగవంశీ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. సంజయ్ పెట్టిన పోస్ట్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఎక్కడ వివాదం మొదలైంది...
2024 సంవత్సరం ముగింపు సందర్బంగా రీసెంట్ గా ఓ వెబ్‌సైట్ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో నాగవంశీ, బోనీకపూర్ పాల్గొన్నారు. బోనీకపూర్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్, తమిళ మూవీలకు సింగపూర్, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్ బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్ మార్కెట్ ఉంటుందని నాగవంశీ అన్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ గురించి నాగ వంశీ అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘సౌతిండియా ఫిల్మ్‌మేకర్స్, యాక్టర్స్ బాలీవుడ్‌పై ప్రభావం చూపారు. ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR), ‘పుష్ప 2’ (Pushpa 2)లాంటి చిత్రాలతో మార్పు చూసి ఉంటారు. ‘యానిమల్’, ‘జవాన్’ సినిమాలు దక్షిణాది దర్శకులు తెరకెక్కించినవే. హిందీ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైంది’’ అని కామెంట్ చేయగా బోనీ కపూర్ దాన్ని అంగీకరించలేదు. అమితాబ్ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానినని అల్లు అర్జున్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దానిపై నాగవంశీ స్పందిస్తూ.. షారుక్ ఖాన్, చిరంజీవికీ పెద్ద అభిమాని అని తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మరో వివాదం
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల అమెరికాలో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ సౌత్ సినిమాలను బాలీవుడ్ సినిమాలను పోల్చుతూ మాట్లాడారు. ఆ సమయంలో బాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది అక్కడి వారికి అర్థం కావడం లేదు. గతంతో పోల్చితే అక్కడ చాలా మారింది. హిందీ పరిశ్రమ వారు సినిమాను వ్యాపారంలా చూస్తున్నారు. అక్కడి వారు సినిమాను వ్యాపారంలా చూడటం వల్ల వారి మేకింగ్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు.
శంకర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. మొదట హిందీ మీడియాలో శంకర్ వ్యాఖ్యల గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులు ఒకొక్కరు చొప్పున స్పందిస్తూ వస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒక్కరైన అనురాగ్ కశ్యప్ ఈ విషయమై స్పందించారు.
అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ... యూఎస్‌లో శంకర్ మాట్లాడిన మాటలు విన్నాను. ప్రేక్షకులు రీల్స్‌కి బాగా అలవాటు పడ్డారు, ప్రతి విషయాన్ని తక్కువ సమయంలోనే తెలుసుకోవాలని భావిస్తున్నారని ఆయన అన్నారు. అందుకు తగ్గట్లుగానే గేమ్ ఛేంజర్ సినిమాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారు అనేది నాకు అర్థం కాలేదు. సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఆయన మాటలు అర్థం అవుతాయేమో చూడాలి. కొన్ని రీల్స్‌ను కలిపి సినిమాలు చేస్తే వాటిని ప్రేక్షకులు చూస్తున్నారని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ భావించి అదే ఫిల్మ్ మేకింగ్‌ను ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది.
దర్శకులు గతంలో కొత్త కథలను, తమ ఆలోచనలను సినిమాలుగా తీసుకు వచ్చే వారు. వాటిని ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు చేస్తున్నామని స్వయంగా ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. ఎప్పుడైతే ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని సినిమాను చేస్తారో అప్పుడే ఫిల్మ్ మేకర్ పతనం మొదలైనట్లే అన్నారు. మంచి కథతో సినిమాను చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ విషయాన్ని నేను ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. ఎప్పుడూ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కాకుండా నా ఆలోచనల్లో ఉన్న విధంగా సినిమాను తీస్తాను, దాన్ని ప్రేక్షకులు మెచ్చే విధంగా ప్రయత్నిస్తాను.. అంటూ అనురాగ్ చెప్పారు.
అనురాగ్ సౌత్ చిత్రాలకు నార్త్‌లో ఆదరణ పెరగడానికి గల కారణాన్ని తెలియజేశారు. కోర్ ఆడియన్స్‌ను పట్టించుకోవడం బాలీవుడ్ ఎప్పుడో మానేసిందని ఆయన అన్నారు. అందువల్లే దక్షిణాది చిత్రాలు, ఫిల్మ్ మేకర్స్‌కు ఈ మార్కెట్‌లో ఆదరణ పెరిగిందని ఆయన తెలిపారు. ప్రేక్షకుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని అనురాగ్ పేర్కొన్నారు.
అనురాగ్ మాట్లాడుతూ...‘‘మనం హిందీ సినిమాలు చేస్తున్నాం. కానీ హిందీ ఆడియన్స్‌నే పట్టించుకోవడం మానేస్తున్నాం. దీనిని కొంతమంది అనువుగా చేసుకొని యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. దక్షిణాదికి సంబంధించిన కొన్ని చిత్రాలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. డబ్ చేసి తమ ఛానల్స్ వేదికగా హిందీ ఆడియన్స్‌కు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దక్షిణాది చిత్రాలనుచూడటానికి నార్త్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇటీవల ‘పుష్ప 2’ కార్యక్రమాన్ని పట్నాలో పెట్టారు’’ అని ఆయన వివరించారు.
ఇలా సౌత్ కు చెందిన ఓ పెద్ద నిర్మాత, దర్శకుడు మాటలపై బాలీవుడ్ ఇప్పుడు అసహనంతో స్పందిస్తోంది. విమర్శలు చేస్తోంది. ఇదో కొత్త పరిణామం అంటోంది టాలీవుడ్. ఇప్పుడు సౌత్ సినిమాను వేరే దారిలేక గురించి, తట్టుకోలేకే ఇలా మాట్లాడుతున్నట్లు చెప్తున్నారు. అయితే కొంతమంది అనురాగ్ కశ్యప్ చెప్పేది, నాగవంశీ చెప్పింది ఒకటే కదా..హిందీ పరిశ్రమ పరిస్థితి బాగోలేదనే కదా అని అంటున్నారు. అది నిజమే.