సన్ ఫ్లవర్ : నవ్వించే మర్డర్ మిస్టరీ.. రివ్యూ
‘సన్ ఫ్లవర్’ ప్రస్తుతం అందరి ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్ అంతా కూడా సస్పెన్స్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే..
Update: 2024-03-12 11:35 GMT
ఒక మర్డర్ జరుగుతుంది.. ఆ హంతుకుడు ఎవరో కనుక్కోవాలి..ఇది అగతా క్రిస్టీ కాలం నుంచి క్రైమ్ రైటర్స్ తమ పాఠకులను లేదా వీక్షకులను ఆకట్టుకునేందుకు పన్నుతున్న వ్యూహం. కాలం మారచ్చేమో కానీ ఆ సెటప్‌లు మాత్రం మారట్లేదు. ఇప్పుడు ఓటీటీ యుగంలోనూ అవే కంటిన్యూ అవుతున్నాయి. అయితే అవి కొత్త సొగసులు అద్దుకుంటున్నాయి. నిజానికి కంటెంట్ విపరీతమైన ఈ కాలంలో సాధారణ ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోవడం కష్టంగానే మారింది. సరైన వెబ్ సీరిస్ పడితే ఆ ఓటీటీ ఛానెల్‌కు కొత్త వ్యూయర్స్ వస్తారు. అయితే ఆ సరైన అనే పదానికి అర్థం తెలియకే ఓటీటీ కంటెంట్ క్రియేటర్స్ తలపట్టుకుంటున్నారు.
దాంతో అటు తిరిగి ఇటు తిరిగి క్రైమ్ కామెడీలే ఓటీటీ ప్రేక్షకుల మనస్సులు గెలవడానికి సరైన మార్గం అని భావించి వాటినే అందిస్తున్నారు. వాటిలో కొన్ని వర్కవుట్ అయితే మరికొన్ని ఎప్పుడు విడుదలయ్యాయో ఎప్పుడు వెళ్లిపోయాయో అన్న విషయం కూడా తెలియట్లేదు. ఆ క్రమంలోనే జీ5 వాళ్లు తాజాగా ఓ మర్డర్ మిస్టరీని ఫన్‌తో కలిపి అందించారు. ఇది ఓ అపార్టమెంట్‌లో జరిగే మర్డర్.. దాన్ని ఎవరు చేశారో కనుక్కునే కార్యక్రమం లాంటి సీన్స్‌తో వచ్చి పోయే సీరిస్. అలాగే ఈ సీరిస్ మొదటి సీజన్ గతంలో వచ్చి జనాలను బాగానే ఆకట్టుకుంది. దాంతో రెండో సీజన్‌ని దించేశారు.
వాస్తవానికి ఇదో బ్లాక్ కామెడీ జానర్. ‘సన్ ఫ్లవర్’లో ఉన్నట్లుగా బ్లాక్ కామెడీని ఈ మధ్యకాలంలో ఎవరూ కాప్చర్ చేయలేదనే చెప్పాలి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవ్వించడం అంటే ఆషామాషీ విషయం కాదు. దాన్ని ఈ దర్శకుడు అతి సులభంగా చేసేశాడు. అయితే ఆ స్క్రిప్ట్ రాయడం, దాన్ని తెరకెక్కించడం కష్టమే. అందుకే మొదటి సీజన్ వచ్చిన మూడేళ్లకు రెండో సీజన్ వచ్చింది. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ 2021, జూన్‌లో వచ్చింది. మొదటి సీజన్‌లో ఎవరు హంతకుడు తేల్చకుండా వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రేక్షకులు దాన్ని అప్పుడప్పుడు తలుచుకుంటూనే ఉన్నారు. కాబట్టే ఈ రెండో సీజన్‌కు కావాల్సినంత హైప్, ఎక్సపెక్టేషన్స్ ,యాంటిసిపేషన్ వచ్చాయి. తర్వాత ఏం జరిగి ఉంటుందనే ఆసక్తి కలిగింది. అయితే మొదట సీజన్‌ని ఫెరఫెక్ట్‌గానే కంటిన్యూ చేయగలిగిందా ఈ సీజన్ 2.
ఈ కథ మొత్తం ముంబైలో జరుగుతుంది. సన్ ఫ్లవర్ అనేది ముంబైలోని ఓ మిడిల్ క్లాస్ జనం ఉండే హౌసింగ్ సొసైటీ అపార్టమెంట్. సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లోనే కథలోకి వచ్చేసి సన్ ఫ్లవర్ అనే అపార్ట్మెంట్‌లో మిస్టర్ కపూర్ (అశ్విన్ కుశాల్) హత్య జరిగినట్లుగా చూపిస్తారు. అక్కడ నుంచి ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు ? అనే ఇన్వెస్టిగేషన్ డ్రామాగా నడుస్తుంది. అయితే, అలాగే చూపించేస్తే అది బోర్ కొట్టేసేలాంటి డ్రై క్రైమ్ థ్రిల్లర్ అయ్యుండేది. అలా కాకుండా ఆ హత్యకు గురైన వ్యక్తి నివసించే ప్లాట్‌కు ఎదురుగా ఓ సేల్స్‌మాన్ పాత్రతో కథని పరుగులు పెట్టించాడు. ఆ అపార్ట్మెంట్‌లో వేరే ఫ్లోర్‌లో సోను సింగ్ (సునీల్ గ్రోవర్) ఉంటాడు.
అతనో సేల్స్ పర్సన్. ఓసీడి కంప్లైంట్ ఉన్న ఓ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ హత్యకు సంబంధించి వీళ్లిద్దరు మెయిన్ సస్పెక్ట్స్ అంటే ప్రధాన అనుమానితులు అన్నమాట. వీళ్లిద్దరిలో ఎవరు ఆ హత్య చేసి ఉంటారా అనే పాయింట్ చుట్టూ మొదటి సీజన్ చుట్టూనే తిరిగింది. ఒక్కో ఎపిసోడ్ పూర్తయ్యేసరికి మన అనుమానం పూర్తిగా ఆ సేల్స్‌మాన్ (సునీల్ గ్రోవర్) మీదకు వెళ్లిపోతుంది. అయితే చిత్రంగా సునీల్ గ్రోవర్ ఓ అమ్మాయికి హెల్ప్ చేయబోయి తానే కిడ్నాప్‌కు గురికావడంతో చూసే ప్రేక్షకుడికి భారీ ట్విస్ట్ పడుతుంది. దాంతో సీజన్ ముగుస్తుంది. . ఇప్పుడు ఆ సీజన్‌కు కంటిన్యుషన్‌గా రెండవ సీజన్ మొదలైంది.
ఈ సన్ ఫ్లవర్ సీజన్ 2 కథ విషయానికొస్తే.. ఇది కూడా మళ్ళీ అదే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పోలీసులు రణవీర్ షోరే, గిరీష్ కులకర్ణి ఇద్దరూ మిస్టర్ కపూర్‌ని మర్డర్ చేసిన హంతకుడి కోసం వెతుకుతూనే ఉంటారు. అయితే ఇక్కడ కొత్త ఆధారం వాళ్లకు దొరుకుతుంది. మర్డర్ అయిన కపూర్ మహాశయుడు.. రోజీ (ఆదాశర్మ)పేరున విల్లు రాశాడనే విషయం తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మూడో సస్పెక్ట్ కథలో యాడ్ అయ్యారు. పోలీసులు ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమె ఓ బార్ డాన్సర్ అని తెలుస్తుంది.
అంతేకాదు సోనూ (సునీల్ గ్రోవర్) కు, ఆమెకు మధ్య లవ్, రొమాన్స్ ఉందని తెలుస్తుంది. ఇది మరో మలుపు. దాంతో తలలు పట్టుకున్న ఆ పోలీసులు ఈ క్రైమ్ పజిల్‌ని ఎలా సాల్వ్ చేశారు. అసలు వీళ్లలోనే హంతకుడు ఉన్నాడా.. వేరే వాళ్లు ఉన్నారా... ఈ క్రమంలో కథ సాగుతుంది. ఫైనల్‌గా హంతకుడు ఎవరో పోలీసులు కనిపెట్టేస్తారు. కానీ అక్కడ మరో ట్విస్ట్ ఇచ్చి సీజన్-3 కి లీడ్‌తో ఇస్తూ వదిలేశారు.
ఈ సీరిస్‌కు స్క్రీన్ ప్లే, సరదాగా సాగే డైలాగ్స్ అందం. వికాశ్ భల్(బాలీవుడ్ సూపర్ హిట్స్ క్వీన్, సూపర్ 30 రచయిత, దర్శకుడు) ఈ సీరిస్‌కు పనిచేయటంతో అందరి దృష్టి పడింది. అందుకు తగినట్లుగానే ఈ సీరిస్ చాలా సరదాగా సాగిపోయింది. అయితే కొంత సాగతీత ఉంది. వెబ్ సీరిస్‌ల్లో అది కామన్ లక్షణమే కాబట్టి పట్టించుకోవాల్సిన పనిలేదు.
చూడచ్చా
కాసేపు నవ్వుకోవడానికి ఈ క్రైమ్ కామెడీ మీకు సహాయం చేస్తుంది. అయితే ఫస్ట్ సీజన్ చూసి సెకండ్ సీజన్ లోకి వస్తే బాగుంటుంది.
ఎక్కడ చూడొచ్చు: Zee5 (తెలుగులోనూ ఉంది)
నిడివి: 8 ఎపిసోడ్‌లు, ఒక్కొక్కటికి 32-43 నిమిషాలు