బాలీవుడ్ 'హీ-మ్యాన్' ధర్మేంద్ర కన్నుమూత
భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది
తన అద్భుతమైన నటనతో ఆరు దశాబ్దాలకు పైగా హిందీ సినిమాపై చెరగని ముద్ర వేసిన బాలివుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తన 89 వ ఏట కన్ను మూశారు. ఆయన మరణవార్తను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఎక్స్ లో పోస్ట్ ద్వారా ప్రకటించారు.
1935లో పంజాబ్‌లో ధర్మేంద్ర సింగ్ డియోల్గా జన్మించిన ఆయన, ఒక టాలెంట్ పోటీలో గెలిచిన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే ‘చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత దశాబ్దాలలో, ఆయన రొమాన్స్, యాక్షన్, కామెడీ, డ్రామా వంటి వివిధ జానర్‌లలో అద్భుతమైన కెరీర్ తో దూసుకుపోయారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన ఐకానిక్ మాస్ హీరోలలో ఒకరిగా నిలిచారు.’షోలే’ సినిమాతో ఆయన దక్షిణ భారత్ లోనే టాప్ స్టార్ గా మారారు.
ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్‌లో కేవలం ఒక్క జోనర్ కే పరిమితం కాలేదు. ఒకవైపు ‘చూప్కే చూప్కే’ వంటి చిత్రాలలో హాస్యాన్ని పండించి ప్రేక్షకులను నవ్వించగలరు, మరోవైపు ‘ప్రతిజ్ఞ’, మేరా గావ్ మేరా దేశ్’ వంటి యాక్షన్ చిత్రాలలో మాస్ హీరోగా ఉగ్రరూపం చూపగలరు. ఈ బహుముఖ ప్రజ్ఞే ఆయనను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది, తద్వారా అన్ని తరగతుల ప్రేక్షకులను ఆకర్షించగలిగారు. నటుడిగా ఆయన ప్రదర్శించిన సహజత్వం కారణంగానే ఆయన పాత్రలు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాయి.
సినిమా జీవితానికి తోడు, ధర్మేంద్ర రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టారు. 2004 నుండి 2009 వరకు భారతీయ జనతా పార్టీ తరపున రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రంగం మాత్రం సినిమానే. తెర వెనుక కూడా, తన సరళమైన మనస్తత్వం వల్ల ఆయన పరిశ్రమలో సహచరుల నుంచి గౌరవాన్ని పొందారు. ఆయన తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లు కూడా బాలీవుడ్‌లో విజయవంతమైన నటులుగా రాణించడం ద్వారా, డియోల్ కుటుంబం భారతీయ సినిమాకు అందించిన సేవలు తరాలుగా కొనసాగుతున్నాయి. ఈ దిగ్గజ నటుడి మరణంతో , భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసినట్లే.
* * *