బ్లాక్ కామెడీ.. 'బ్లాకౌట్' సినిమా రివ్యూ!

‘12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కుర్రాడు విక్రాంత్ మెస్సె. అతను హీరోగా చేసిన ఈ సినిమా ఓ బ్లాక్ కామెడీ.

Update: 2024-06-23 03:30 GMT

‘12th ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కుర్రాడు విక్రాంత్ మెస్సె. అతను హీరోగా చేసిన ఈ సినిమా ఓ బ్లాక్ కామెడీ. కొద్దిగా థ్రిల్లర్ జోనర్ లక్షణాలతో వండివార్చిన ఈ కథ ఓ రాత్రిలో జరుగుతుంది. జియో ఓటిటిలో రిలీజైన ఈ సినిమా ఏ మేరకు నవ్వించింది. అసలు ఈ సినిమాలో ఉన్న కొత్త పాయింట్‌ ఏమిటి? కొత్త డైరెక్టర్‌ ఈ సినిమాకు ఎంతవరకు న్యాయం చేశాడు? ఈ సినిమా ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్‌ అయ్యింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథేంటి

పూణేలో క్రైమ్ రిపోర్టర్‌గా చేస్తూంటాడు లెనీ డిసౌజా ( విక్రాంత్ మెస్సె . స్టింగ్ ఆపరేషన్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటాడు. వృత్తిలో మంచి పేరు, మంచి సంపాదన హ్యాపీ లైఫ్. భార్య రోహిణి (రుహాని శర్మ) కూడా అతనికి సపోర్ట్‌గా ఉంటుంది. ఒక రోజు రాత్రి లెచి ఓ ఫుడ్ ఐటమ్ కోసం కార్లో బయలుదేరతాడు. అప్పుడే సిటీలో ఓ దొంగల బ్యాచ్ పవర్ కట్ చేసి బ్యాంక్‌లు లూటీ చేసే పనిలో ఉంటుంది. అయితే వాళ్ల దురదృష్టవశాత్తు దొంగతనం చేసి పట్టుకెళ్లున్న వ్యాన్ తిరగబడుతుంది. దొంగల పరిస్థితి దెబ్బలతో కదలలేకుండా ఉంటారు.

అప్పుడే మన హీరో లెనీ డిసౌజా తన కారులో అటుగా వస్తాడు. ఆ వ్యానులో డబ్బు, బంగారం ఉండటం చూస్తాడు. దాంతో తను అందులోంచి కొంత లేపేద్దామని ఆలోచన పుడుతుంది. దాంతో ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం చూసి, ఓ పెద్ద బాక్స్ ఒకటి లేపేసి కారులో బయలుదేరతాడు. అక్కడనుంచి అతను ఆ డబ్బులో జీవితం సెటిల్ చేసుకుని ఎంజాయ్ చేద్దామనే కలలు కంటూ ఓ వ్యక్తిని గుద్దేస్తాడు. అతను చచ్చిపోతాడు. అది ఓ తాగుబోతు చూస్తాడు. తనకు ఆ కారులో ఉన్న డబ్బులో కొంత వాటా ఇస్తే శవం పూడ్చేందుకు సాయం చేద్దామంటాడు. ఈలో అక్కడకి మరో ఇద్దరు వస్తారు. ఈ లోగా పోలీసులకు విషయం లీక్ అవుతుంది. అలా ముందుకు వెళ్తుంది. చివరకు ఈ కథ ఎక్కడ ముగిసింది. ఆ డబ్బు ఏమైంది. లెనీ డిసౌజా పరిస్థితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఒకే రాత్రిలో జరిగేటట్లుగా కథలు సెట్ చేయబడిన సినిమాలు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లిమిటెడ్ పాత్రలతో చాలా టైట్ నేరేషన్‌తో ప్రతీ సీన్ లెక్కేసుకుంటూ రాసుకోవాలి. టైమ్ ఫ్రేమ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సినిమా ప్రారంభం చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తుంది. ఓ క్రైమ్ రిపోర్టర్‌కు ఊహించని విధంగా, ఊహించని డబ్బు దొరికితే అతను ఎలా బిహేవ్ చేస్తాడు. అక్కడనుంచి ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తాడు అనేది వినడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది. గమ్మత్తైన పాత్రలు కూడా నేరేషన్‌ని ముందుకు బాగానే తీసుకెళ్తాయి. కానీ అది కాసేపే. కథలో కదలిక లేకపోతే కొద్దిసేపటికు జరిగిందే జరుగుతోందేంటి.. చూసిందే చూపిస్తున్నారేంటి అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు జరిగింది.

ప్రిమైజ్ డార్క్ కామెడీని ఆఫర్ చేసినా, ఫ్లాట్ నేరేషన్ , సరిగ్గా సెట్ కాని స్క్రీన్ ప్లే, ఓవర్ స్టఫ్ సీన్స్ సినిమాని నెక్ట్స్ లెవిల్‌కు తీసుకెళ్లలేకపోయాయి. దానికి తగినట్లు సెకండాఫ్‌లో వచ్చే ప్లాట్ ట్విస్ట్‌లు ఏమీ కన్వీన్సింగ్‌గా ఉండవు. కొత్త క్యారక్టర్స్ సోసోగా ఉంటాయి. సెకండాఫ్‌లో చాలా క్యారెక్టర్లు ఎంటర్‌ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. అది హీరో కథకి లింక్‌ అవుతూ క్లైమాక్స్‌కి వెళ్తుంది సినిమా. అయితే చాలా చోట్ల ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. సినిమాలో చాలా చోట్ల బోర్‌ ఫీల్‌ అయితే, మరికొన్నిచోట్ల విపరీతంగా నవ్వుకుంటాం.

ఏదైమైనా కథపరంగా, కథనం పరంగా, క్యారెక్టర్ల పరంగా కొంత కన్‌ఫ్యూజన్‌, మరికొంత బోర్‌ ఉన్నా కామెడీ పరంగా ఓకే అనిపిస్తాడు డైరక్టర్. అయితే ఈ సినిమా వల్ల హీరో విక్రాంత్ మెస్సెకి , డైరెక్టర్‌కి, కమెడియన్స్‌కి ఒరిగేదేమీ లేదు. ఫన్ కూడా హీరో క్యారెక్టర్‌ నుంచిగానీ, అతని పెర్‌ఫార్మెన్స్‌ నుంచి గానీ వచ్చింది కాదు. ఈ సినిమా కథపరంగా ఆలోచిస్తే అందులో కొత్తదనం ఉన్నా, కథనంలో కొత్తదనం కనిపించదు. కానీ, కొన్ని సీన్స్‌ మాత్రం కొత్తగా అనిపిస్తాయి.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:

అనుభవ భన్సాల్ ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఈ కథకి కెమెరావర్క్‌లో వండర్స్‌ చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా చాలా రిలాక్స్‌డ్‌గా తీసినట్టు తెలుస్తుంది. విశాల్ మిశ్రా సంగీతం ఫర్వాలేదు అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే అనిపించాడు. ఇక డైరెక్టర్‌ దేవాంగ్ గురించి చెప్పాల్సి వస్తే స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వించడమే ధ్యేయంగా ఈసినిమా చేసినట్టు కథను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ అందులో సక్సెస్ కాలేదు.

ఎంత కామెడీ సినిమా అయినా కంటెంట్ రిపీట్ అయితే కొన్నిచోట్ల బోర్‌ ఫీల్‌ అవ్వక తప్పదు. ఈ సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఆడియన్స్‌కి బాగా నవ్వు తెప్పిస్తాయని డైరక్టర్ భావించిన సీన్స్‌ని కాస్త ఎక్కువ సేపు రన్‌ చేసేసరికి ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అయ్యారు. ఉన్నికృష్ణన్ ఎడిటింగ్ నడిచిపోతుంది. అయితే డబ్బింగ్ బాగా కుదరలేదు. తెలుగు డైలాగ్స్ బాగా సెట్ కాలేదు.

చూడచ్చా

ఈ సినిమాలో ఆడియన్స్‌ని అబ్బుర పరిచే సీన్స్‌, థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌గానీ లేకపోయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడగలిగే కొంత కామెడీ ట్రై చేశారు. కాబట్టి ఓ లక్కేయచ్చు.

ఎక్కడుంది

జియో సినిమా ఓటిటిలో తెలుగులో ఉంది

Tags:    

Similar News