హీరోయిన్ల షూటింగ్ కష్టాల మీద నటి శారద కామెంట్

233 పేజీలతో జస్టిస్‌ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక లో అనేక ఇబ్బందికరమయిన విషయాలను ‘ఉర్వశి’ శారద వెల్లడించారు. అవేంటంటే...

Update: 2024-08-21 05:57 GMT

సీనియర్ నటి ఊర్వశి శారదది ఆరు పదులపైగా కొనసాగిన విజయవంతమైన సినీ ప్రస్థానం. ఎన్నో అద్భుత పాత్రలతో తెలుగు,తమిళ, మళయాళ ప్రేక్షకులను అలరించారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండు సార్లు ఫిలిం ఫేర్‌ అవార్డులు, ఎన్టీఆర్‌ జాతీయ అవార్డులతో ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. మాతృభాషలో హీరోయిన్ గా ఎదగటానికి ఆమె కొంత టైమ్ తీసుకున్నారు కానీ.. మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఆమె స్టార్ గా ఎదిగారు. తన అందం, అభినయంతో మలయాళ వాసులను మెప్పించారు. మలయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. తాజాగా ఆమె జస్టిస్ హేమా కమిటీలో సభ్యురాలిగా ఉండి సినీ పరిశ్రమలో స్త్రీల సమస్యలు గురించి రిపోర్ట్ ఇచ్చారు.

‘వేషాలు కావాలంటే శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు..’ఈ మాటలు గాసిప్స్ క్రింద, అనీఫిషియల్ గా మీడియాలో ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ గురించి వింటున్నవే. అయితే అఫీషియల్ గా .. 233 పేజీలతో జస్టిస్‌ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక లో ఇవే ప్రధానాంశాలు చోటు చేసుకోవటం మాత్రం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. తాము వింటన్న విషయాలు నిజమే..గాసిప్స్ కావనేవి సమాన్యుడుకు ఆశ్చర్యపరిచే విషయమే. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు.

ఆ రిపోర్ట్ లో శారద ఏమంటారంటే... 'ఈ రోజుల్లో సినీ పరిశ్రమలో ఆడవాళ్లు వేసుకునే దుస్తులు సరిగ్గా లేవు. ఆ దుస్తులు శరీరాన్ని దాచిపెట్టడం కంటే, శరీర భాగాలను బహిర్గతం చేస్తున్నాయి. పాత రోజుల్లో సెక్సువల్ డబుల్ మీనింగ్ కబుర్లు సెట్స్ పై ఉండేవి కాదు. దాంతో జూనియర్ ఆర్టిస్ట్ లను కానీ టెక్నిషియన్స్ గా సెట్లో ఉన్న ఆడవాళ్లను టచ్ చేయటం, బ్రెస్ట్ లను నొక్కటం వంటి లైంగిక వేధింపులు సెట్స్ పై ఉండేవి కాదు. ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటివి లేవు అని చెప్పటం హాస్యాస్పదమే.

శారద ఈ రిపోర్ట్ లో మరోచోట ఏమంటారంటే... మన సొసైటీపై వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫూలియెన్స్ బాగా ఎక్కువగా ఉంది. గతంలో ఉన్న సమాజానికి ఇప్పటికి పోలికేలేదు. ఇప్పుడు ప్రతీ ఒక్కరు మరొకరితో ఓపెన్ గానే కలిసిపోతున్నారు. గర్ల్ ప్రెండ్స్, బోయ్ ప్రెండ్స్ ఇప్పుడు పబ్లిక్ గానే కలుస్తున్నారు. ఇప్పటి కొత్త జనరేషన్ కల్చర్ పూర్తిగా విభిన్నంగా ఉంది. లైంగిక సాన్నిహిత్యంతోపాటు ‘అడ్జస్ట్‌మెంట్స్‌, ‘కాంప్రమైజ్‌’ అనే పదాలు ఇండస్ట్రీలో సర్వసాధారణమైపోయాయి.

క్యాస్టింగ్ కోచ్ గురించి శారద ఈ రిపోర్ట్ లో చెప్తూ... కాస్టింగ్ కౌచ్ అనేది పూర్వ కాలం రోజుల్లోనూ ఉంది. కానీ ఈ రోజు ఆడవాళ్లు ఓపెన్ గా మాట్లాడటం మొదలెట్టగలుగుతున్నారు. పాత రోజుల్లో హీరో,హీరోయిన్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ,ఒప్పుకుని రిలేషన్ లో ఉండేవారు, ఇప్పుడు అలా జరగటం లేదని అన్నారు.

కమిషన్ సభ్యుల వ్యక్తిగత అబ్జర్వేషన్స్, రికమండేషన్స్ , సజెషన్స్ విభాగంలో శారద ఈ కామెంట్స్ చేశారు.అలాగే సినిమాల్లో మహిళల పార్టిసిపేషన్ పెంపొందించడంలో ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా సినిమా సాంకేతిక అధ్యయనాల్లో మహిళలు పాల్గొనడాన్ని తాను ఇష్టపడనని అన్నారు. ఇక డెలివరీ, పిల్లల కారణంగా ఉద్యోగం లేని మహిళలకు కేరళ ప్రభుత్వం సహాయం అందించడాన్ని తాను ఇష్టపడనని నివేదికలో పేర్కొంది.

అసలు ఈ హేమా కమిటీ ఏమిటి

2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో మలయాళ సూపర్‌స్టార్‌ దిలీప్‌ పేరు రావడంతో సెన్సేషన్ అయ్యింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్‌ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్‌ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. అయితే విచారణ ముగించిన కమిషన్‌ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు.

తాజాగా ‘రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌’ యాక్ట్‌ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు.

ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిందీ కమిటీ. ఈ క్రమంలో కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మళయాళ పరిశ్రమలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అనేక మందిని విచారించి, సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రిపోర్ట్ లో వెల్లడైన కొన్ని అంశాలు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి.

ఇదిలా ఉంటే హేమ కమిటి వెల్లడైన కొన్ని అంశాలు సమాజాన్ని దిగ్భ్రాంతి పరిచేవి.. అందులో కొన్ని

సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది. దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదుల్లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతారు. అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్‌ లభిస్తుందని అంటారు.

తాగి వచ్చి తలుపులు కొడతారు

ఇక సినిమా షూటింగ్‌ సమయంలో మహిళలు బసచేసే హోటల్‌ గదులకు పురుషులు తాగి వచ్చి ఆ మత్తులో వచ్చి తలుపు తడుతుంటారు. వాటిని తెరిచేవరకూ.. బలవంతంగా, డోర్లు పగిలేలా శబ్దాలు చేస్తారు. మహిళా నటులు ఒంటరిగా ఉండేందుకు జంకుతారని, అందుకే తమ కుటుంబీకులు, స్నేహితులతో షూటింగ్‌కు వస్తుంటారని పేర్కొంది.

స్టార్‌డమ్‌ తో వేధింపులు పెరుగుతాయి

స్టార్‌డమ్‌ పెరిగే కొద్ది వేధింపులు ఎక్కువవుతాయని జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్ లో పేర్కొంది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు తెలిపింది.

వాళ్లే మొత్తం నడిపిస్తారు

సినిమా ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్‌ హౌస్‌ల నియంత్రణలో ఉన్నట్లు ఈ రిపోర్ట్ లో వెల్లడించింది. అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా.. ఆ ఒక్క సినిమాలో ఆఫర్ పోగొట్టుకోవటమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయరు.

ఇక ఈ నివేదికపై పినరయి విజయన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్‌ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Tags:    

Similar News