రష్యన్ ఎయిర్ డిఫెన్స్ ప్రయాణికుల విమానాన్ని కూల్చివేసిందా?
టర్కీ, పాశ్చాత్య మీడియా కథనాలు, స్పందించని రష్యా;
By : The Federal
Update: 2024-12-26 10:41 GMT
కజకిస్తాన్ లో నిన్న కూలిన విమానం ప్రమాదం.. పక్షి ఢీ కొట్టడం జరగలేదని ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు తెలిపారు. రష్యాన్ ట్రూప్స్ ఈ విమానాన్ని కూల్చివేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, మరో 29 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఢిపెన్స్ కౌన్సిల్ లోని డిస్ ఇన్పర్మేషన్ హెడ్ అండ్రీ కోవాలెంకో మాట్లాడుతూ.. రష్యన్ ఎయిర్ ఢిపెన్స్ సిస్టమ్ ప్రయాణికుల విమానాన్నిమిస్సైల్ తో కూల్చివేసిందన్నారు.
బాకు నుంచి గ్రోజ్నీ బయల్దేరిన అజార్ బైజాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ జే2-8243 నిన్న కజకిస్తాన్ లో కూలిపోతున్న విమానం దృశ్యాలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. రష్యాలో సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైన మిస్సైల్ వచ్చి తాకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో మంటల్లో చిక్కుకున్నట్లు కనిపించింది. ఆ సమయంలో విమానం చాలా వేగంగా కిందికి దిగుతున్నట్లు కనిపించింది. కాసేపటికీ నేలకు దిగి ఫ్లైట్ పేలిపోయింది. పొగమంచు కారణంగా పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతి కోరాడని సమాచారం.
సైనిక ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో గ్రోజ్నీ గగనతలాన్ని మూసివేయకుండా రష్యా ఈ చర్యకు పాల్పడిందని పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో కూడా రష్యా అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించకుండా తిరిగి కజకిస్తాన్ కు పంపారని ఆ దేశాలు ఆరోపించాయి.
టర్కీష్ మీడియా నివేదికల ప్రకారం విమానం ఫ్యూజ్ లేజ్ ష్రాఫ్ నెల్ దెబ్బతిన్నాయని పేర్కొంది. విపత్తు నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు తన లైఫ్ జాకెట్ లో ష్రాప్నల్ రంధ్రాలు ఉన్నాయని చెప్పాడు.
ఈ విమాన ప్రమాదం సైనిక ఉద్రిక్తతల కారణంగా మిస్సైల్ దాడికి గురైందని చెప్పడానికి మరో ఆధారం కూడా ఉంది. విమాన ట్రాకింగ్ డేటా క్రాష్ కావడానికి ముందు జెట్ తను ఉద్దేశించిన విమాన మార్గం నుంచి పక్కకు జరిగినట్లు అధికారులు తెలిపారు. పక్షి ఢీ కొడితే ఇలా జరగదని కేవలం మిస్సైల్ దాడి జరిగితేనే విమాన గమనం మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో అజార్ బైజాన్ తన దేశం నుంచి అన్ని విమానాలను రష్యాకు నిలిపివేసింది.
బ్లాక్ బాక్స్ దొరికింది
టర్కీ మీడియా ప్రకారం.. డ్యామేజ్ నమూనాలు పక్షుల దాడికి భిన్నంగా ఉన్నాయని, ఇవన్నీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ దాడికి సరిపోలుతున్నాయని పలువురు నిఫుణులు చెబుతున్నట్లు ప్రచురించింది. ప్రమాదానికి సంబంధించిన కీలకమైన బ్లాక్ బాక్స్ దొరికిందని పాశ్చాత్య మీడియా కూడా వార్తలు ప్రసారం చేసింది.