మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి ఎందుకు?

పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇది మరింత విస్తరిస్తే మూడో ప్రపంచ యుద్ధమే. ఇజ్రాయిల్ పై ఇప్పటి వరకు దాడి చేస్తున్న వారికి మరో దేశం తోడైంది.

Update: 2024-10-02 04:12 GMT

పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇది మరింత విస్తరిస్తే మూడో ప్రపంచ యుద్ధమే. ఇజ్రాయిల్ పై ఇప్పటి వరకు దాడి చేస్తున్న వారికి మరో దేశం తోడైంది. అక్టోబర్ 1న యూదు దేశమైన ఇజ్రాయిల్ పై ముస్లిం దేశమైన ఇరాన్ భీకర దాడులు జరిపింది. రాత్రంతా క్షిపణుల వర్షం కురుస్తూనే ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. అందుకు తామూ సిద్ధమేనని ఇరాన్, లెబనాన్ కేంద్రంగా పని చేస్తున్న హిజ్బుల్లా, పాలస్తినా కేంద్రంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్న హమస్ ప్రకటించాయి. ఈ పరిస్థితే పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇజ్రాయిల్ కి అగ్రరాజ్యమైన అమెరికా అండగా నిలిచింది. మరో అగ్రరాజ్యం రష్యా ఇంకా ఏ నిర్ణయం ప్రకటించకపోయినా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తుందన్నది అందరికీ తెలిసిన నిజమే. దీనిలో భాగంగా లెబనాన్ పై భూతల దాడుల్ని ఆపమని విజ్ఞప్తి చేసింది.

దాడులు ఇలా మొదలయ్యాయి...
ఇజ్రాయెల్‌ టైం ప్రకారం మంగళవారం రాత్రి 7.30 సమయంలో ఒకసారి.. 8 గంటల సమయంలో మరోసారి ఇరాన్ ఖండాంతర క్షిపణుల వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత విడతల వారీగా రాత్రి 10 గంటల వరకు క్షిపణిదాడులను కొనసాగించింది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) స్థావరాలు, వైమానిక దళ బేస్‌లు ఉన్న హాట్జెరిమ్‌, నెవాటిమ్లోని, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా.. తొలుత 108 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది.

ఆ తర్వాత అరగంటకే.. మరో 100 క్షిపణులు ఇజ్రాయెల్‌పైకి వచ్చాయి. ఇజ్రాయెల్‌ కు రక్షణగా ఉండే ఐరన్‌డోమ్‌ వ్యవస్థ క్షిపణులను అడ్డుకున్నా.. టెల్‌అవీవ్‌, నెగెవ్‌, షారోన్‌ నగరాలను క్షిపణులు తాకాయి. అక్కడక్కడ భవనాలు దెబ్బతిన్నాయి. జనం భయంతో పరుగులు తీశారు. ప్రజల్ని అప్రమత్తం చేసేలా పలు నగరాలలో సైరన్లు మోగించారు. మధ్యధరా సముద్రంలోని ఇజ్రాయిల్ గ్యాస్‌పైప్‌లైన్‌ దెబ్బతిన్నట్లు సమాచారం.
ఇరాన్ క్షిపణులను కూల్చేయమన్న అమెరికా...
ఇరాన్‌ నుంచి వచ్చే క్షిపణులను కూల్చేయాలంటూ పశ్చిమాసియాలో ఉన్న తమ సైన్యానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‌ ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా పశ్చిమాసియాకు మూడు ఫైటర్‌ స్క్వాడ్రన్లను తరలించారు. క్షిపణి దాడి నేపథ్యంలో అధికారులు ఇజ్రాయెల్‌ గగనతలాన్ని మూసివేసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో.. టెల్‌అవీవ్‌లోని బెన్‌గురియన్‌ విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.
బంకర్లలోకి వెళ్లాలని ప్రజలకు పిలుపు...
ఇరాన్‌ దాడికి ముందే.. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దేశప్రజలను అప్రమత్తం చేసింది. ఇళ్లలోంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలు, బంకర్లలోకి తరలి వెళ్లాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా బంకర్లలోంచే పరిస్థితిని సమీక్షించారు. దేశవ్యాప్తంగా.. 1,864 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. దేశవ్యాప్తంగా వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాత్రి పదిగంటల సమయంలో ఇరాన్‌ క్షిపణి దాడి నిలిచిపోయింది.
ముందే హెచ్చరించిన అమెరికా..
ఇరాన్ దాడులు చేయవచ్చునని ఇజ్రాయిల్ ను అమెరికా ముందే హెచ్చరించింది. బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయవచ్చని అమెరికా మంగళవారం ఉదయమే హెచ్చరించింది. ‘‘హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియే హత్య తర్వాత ఇరాన్‌ తన బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులను, డ్రోన్లను సిద్ధం చేసింది. హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా హత్య తర్వాత దాడులకు వ్యూహాలను రచించింది. 12 నుంచి 24 గంటల్లో దాడులు జరుపుతుందని మా నిఘావర్గాల సమాచారం’’ అని అమెరికా అప్రమత్తం చేసింది. ఇరాన్‌ గనక దాడికి దిగితే.. మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా హెచ్చరించింది.

మరోవైపు, భూతల దాడులను వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్‌ తన సేనలను లెబనాన్‌ నుంచి ఉపసంహరించుకోవాలంటూ రష్యా మంగళవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఫోన్‌లో చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమచారం.
లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు..
యుద్ధ ట్యాంకులు.. రాకెట్‌ లాంచర్లతో లెబనాన్‌ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. భూతల దాడులు ప్రారంభించింది. మంగళవారం ఒక్కరోజే 70కి పైగా ఆపరేషన్లను నిర్వహించింది. సరిహద్దుల్లో హిజ్బుల్లాకు చెందిన భారీ సొరంగాలను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌ సరిహద్దులకు సమీపంలోని టన్నెల్స్‌లో హిజ్బుల్లా ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఆయుధాలను నిల్వ చేశారన్న అనుమానంతో ఈ దాడులు చేసింది.
ఐక్యరాజ్య సమితీ భద్రతా మండలి భేటీ
పశ్చిమాసియాలో దాడులను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఖండించారు. ఆయన ఏ దేశం పేరును ప్రస్తావించకుండా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆగిపోవాలని.. కాల్పుల విరమణ జరగాలని ఆకాంక్షించారు. ఇరాన్‌ దాడిపై బుధవారం ఐరాస భద్రతామండలిలో చర్చకు డిమాండ్‌ చేస్తామని ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ చెప్పారు. ‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ అతిపెద్ద, హింసాత్మక క్షిపణులతో దాడి చేసింది. మేము ఆత్మరక్షణకు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్‌ పౌరుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పేజర్ పేలుళ్లు చేసింది ఇండియనే?
గత నెలలో లెబనాన్‌ వ్యాప్తంగా ఏకకాలంలో 3 వేలకు పైగా పేజర్‌ బాంబులు పేల్చింది నార్వేలో స్థిరపడ్డ భారతీయుడని తెలుస్తోంది. ఆ దాడుల్లో వేలాది మంది గాయపడ్డారు. 39 మంది మృతిచెందారు. ఈపేజర్లు తయారు చేసింది తైవాన్‌కు చెందిన కంపెనీ మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత హంగరీకి చెందిన డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా హిజ్బుల్లాకు పేజర్లు అందినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. భారతీయ-నార్వేయన్‌ రిన్సన్‌ జోస్‌ కోసం అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. నార్వేలో స్థిరపడ్డ రిన్సన్‌ స్వస్థలం కేరళ. పేలిపోయిన పేజర్లను నార్వే ఆధారంగా పనిచేస్తున్న అతని కంపెనీలో తయారైనవని నార్వేస్‌ నేషనల్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ గుర్తించింది.
Tags:    

Similar News