ఈ సారి దాడి చేస్తే మీకు ఏమి మిగలదు: ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో బెదిరింపుల పర్వం నడుస్తోంది. మేము ప్రతిదాడి చేస్తామని ఇరాన్ చెబుతుండగా, దుస్సాహసాలు చేస్తే ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్ వార్నింగ్..

Update: 2024-10-30 10:13 GMT

ప్రతీకారం అంటూ మరోసారి మాపై దాడులు చేస్తే ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్, ఇరాన్ ను హెచ్చరించింది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడికి ప్రతీకారంగా శనివారం (అక్టోబర్ 26) ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో నలుగురు సైనికులు మాత్రమే మరణించారని, కొంత నష్టం జరిగిందని టెహ్రన్ ప్రకటించింది.

“ ఇరాన్ పొరపాటు చేసి, ఇజ్రాయెల్‌పై మరో క్షిపణిని ప్రయోగిస్తే, ఇరాన్‌ను ఎలా చేరుకోవాలో, ఏ సమయంలో దాడి చేయాలో, ఎలాంటి లక్ష్యాలు ఎంచుకోవాలో, ఈ సారి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. మొన్నటి దాడుల్లో కాస్త తప్పించుకున్నారు. ఈ సారి చాలా కష్టం’’ అని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి మంగళవారం ఓ మీడియా సంస్థకు చెప్పారు.
ఇరాన్‌లోని కొన్ని లక్ష్యాలపై శనివారం దాడి చేయలేదని ఇజ్రాయెల్ సైనిక అధిపతి చెప్పారు, కానీ ఈసారి ఇరాన్ దాడి చేస్తే ఒక్కటి కూడా మిగలదని హెచ్చరించారు. "ఈ సంఘటన ముగియలేదు, మేము ఇంకా దాని మధ్యలో ఉన్నాము" అని లెఫ్టినెంట్ జనరల్ హలేవి అన్నారు.
ఇరాన్ దూకుడు ప్రకటన..
అక్టోబర్ 26న ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ దూకుడుగా వ్యవహరించింది. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునే హక్కు తమకుందని,కచ్చితంగా ఎదురుదాడి చేస్తామని ప్రకటించింది. ఈ హెచ్చరిక తరువాత ఇజ్రాయెల్ స్పందించింది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఓ ప్రకటన చేస్తూ "ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది" అని పేర్కొంది. సైనిక లక్ష్యాలపై గురి చూడటంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.
IRGC కమాండర్ హోస్సేన్ సలామి ఇజ్రాయెల్ దాడిని ఖండించారు, ఇది "తప్పు లెక్క, నిస్సహాయతకు సంకేతం" అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ చర్యల వల్ల కలిగే చెడు పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై కూడా దూకుడును ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించి టెహ్రాన్ ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News