‘నిరాయుధ పౌరులే లక్ష్యంగా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తుంది’
డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్...;
ఇటీవల ఉగ్రవాదుల లక్ష్యం మారిందని, నిరాయుధులయిన పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం ఆందోళన కలిగిస్తోందన్నారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lt Gen Rajiv Ghai). అందుకు పహల్గామ్ ఘటనే అందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాదిలోనూ ఇలాంటి ఘటనే జరిగిందన్నారు. జమ్మూలోని శివఖోరి దేవాలయం నుంచి తిరిగి వస్తున్న భక్తులపై దాడిని గుర్తు చేశారు. ఆ ఘటనలో ఏడుగురు మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారని చెప్పారు. 2019లో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఉగ్రమూకలు (Terrorist Attack) ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు.
టీఆర్‌ఎఫ్ కొత్త వ్యూహం..
2024 అక్టోబరులో పాక్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) కాశ్మీర్‌లో గాందెర్బల్ జిల్లాలో జరిగిన మరో దాడికి బాధ్యత వహించినట్టు ప్రకటించింది. ఆ దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తొలిసారిగా కాశ్మీర్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలవారినీ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఇంతకుముందు కేవలం కశ్మీరీ పండితులను లక్ష్యంగా చేసుకునే టీఆర్‌ఎఫ్.. ఇప్పుడు సిక్కులు, ఇతర రాష్ట్రాల వలసదారులపై దాడులకు తెగబడుతుంది. వారి వ్యూహంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పహల్గాం దాడికి కూడా టీఆర్‌ఎఫ్‌యే బాధ్యత వహించింది.
2024 అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత గాందెర్బల్ దాడి జరిగింది. అంతకు ముందే 2024 ఏప్రిల్‌లోనూ అనంతనాగ్ జిల్లాలో బీహార్‌కు చెందిన మరో కార్మికుడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హత్య చేశారు. ఈ తరహా వరుస ఘటనలు రాష్ట్రంలోని ప్రజాస్వామ్య స్థితిగతులపై ఆందోళన కలిగిస్తున్నాయి.