విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పై దాడికి ప్రయత్నించిన ఖలిస్థానీలు
ఖండించిన విదేశాంగ శాఖ, దౌత్య నియమాలు పాటించాలని డిమాండ్;
By : The Federal
Update: 2025-03-06 07:28 GMT
ఖలిస్తాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి ఏకంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. లండన్ లోని ఛాథమ్ హౌజ్ నుంచి ఒక చర్చకు హజరైన తరువాత బయటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రయత్నాలు జరిగాయని తెలిసింది.
చాథమ్ హౌజ్ వెలుపల నుంచి వెళ్తున్న సమయంలో ఖలిస్తాన్ తీవ్రవాది ఒకరు జైశంకర్ పై దాడి చేయడానికి పరుగెత్తుకుంటూ వెళ్లగా, అతని సహచరులు నినాదాలు చేస్తున్న సమయంలో పోలీసు అధికారుల ముందు భారత జెండాను చింపివేశారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇంత జరుగుతున్న పోలీస్ అధికారులు వారిని ఆపలేదు. అలాగే చూస్తుండిపోయారు. కానీ చివరకూ వారిని అక్కడి నుంచి నిరసనకారులను తరలించారు.
జైశంకర్ చర్చకు కోసం వస్తున్న సందర్భంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్నమరో వీడియో కూడా ఎక్స్ లో ఉంది.
ఖండించిన విదేశాంగ శాఖ
జైశంకర్ మీద దాడి చేయడానికి ప్రయత్నాలు జరగడంతో విదేశాంగమంత్రిత్వశాఖ స్పందించింది. ఆతిథ్య ప్రభుత్వం వారి దౌత్య బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాలని కోరింది.
‘‘విదేశాంగమంత్రి యూకే పర్యటన సందర్భంగా భద్రతా ఉల్లంఘన వీడియో ఫుటేజీని మేము చూశాం’’ అని ఎంఈఏ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. వేర్పాటువాదులు, తీవ్రవాదుల ఈ చిన్న సమూహాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను మేము ఖండిస్తున్నామని అన్నారు.
విభజన శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని మేము ఖండిస్తున్నామని, దౌత్య సంబంధాలను సరిగా నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని జైస్వాల్ అన్నారు.
జైశంకర్ పర్యటన..
వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, రక్షణ రంగాలలో యూరోపియన్ దేశాలతో భారత్ సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా భారత విదేశాంగ మంత్రి మార్చి 4 నుంచి 9 వరకూ యూకే, ఐర్లాండ్ లలో పర్యటించబోతున్నారు.
యూకే, ఐర్లాండ్ లలో ఆరు రోజుల పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఉన్నత స్థాయి చర్చలు, విదేశాంగ విధానంపై మార్పులు వంటివి ఉన్నాయి.
ఈ పర్యటన రెండు దేశాలతో భారత్ కు స్నేహపూర్వక సంబంధాలను కొత్త ఊపునిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వారం చివర్లో విదేశాంగమంత్రి ఉత్తర ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్, ఉత్తర ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లలో కొత్త భారత కాన్సులేట్ జనరల్ లను ప్రారంభించనున్నారు.