‘కలిసి పోరాడదాం..ఉగ్రవాదాన్ని సమాధి చేద్దాం’

విదేశీ పర్యటనలో అఖిలపక్ష బృందాల పిలుపు..;

Update: 2025-05-25 10:17 GMT
Click the Play button to listen to article

జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రమూకల దాడిలో 26 మంది పర్యాటకులకు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాత..ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరుతూ ఏడు అఖిల పక్ష ప్రతినిధుల బృందాలు(Indian deligation) 33 ప్రపంచ రాజధానులకు బయలుదేరిన విషయం తెలిసిందే.

‘పాక్ ఉగ్రవాదులకు కొమ్ముకాస్తోంది’

మాస్కోకు వెళ్లిన డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి(Kanimozhi Karunanidhi) నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ పర్యటన ముగింపు సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించింది. రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు, మీడియాకు పాకిస్తాన్ కుట్రలు, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టంగా వివరించారు.

కనిమొళి మాట్లాడుతూ.. "ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని వివరించడానికి మాకు గొప్ప అవకాశం లభించింది" అని పేర్కొన్నారు. "పాక్ ఉగ్రవాదులను రక్షించాలని ప్రయత్నిస్తో్ంది. భారత్‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మేం ఉగ్రవాద కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము.’’ అని చెప్పారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము కూడా భారత్‌తో కలిసి పోరాడతామని రష్యా హామీ ఇచ్చింది.

‘భారత్‌ది జీరో టాలరెన్స్’

జపాన్‌కు వెళ్లిన పార్లమెంటరీ ప్రతినిధి బృందం కూడా శనివారం తన మూడు రోజుల పర్యటనను ముగించింది. ప్రతినిధి బృందానికి జెడి(యు) రాజ్యసభ ఎంపి సంజయ్ కుమార్ ఝా నాయకత్వ వహించారు. స్వాతంత్ర్య సమరయోధుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా ప్రతినిధి బృందం తమా స్మశానవాటికను సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత్ జీరో టాలరెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తుందని చెబుతూ.. పాక్ దుశ్చర్యలను బయటపెట్టారు.

"భారతదేశం గాంధీజీ శాంతి మార్గాన్ని అనుసరిస్తుంది, కానీ శాంతికి ముప్పు ఎదురైనప్పుడు, మనం రాష్ బిహారీ బోస్ నిర్భయ స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకువెళతాము. అహింస మా ఎంపిక, మా బలవంతం కాదు. ఉగ్రవాదం శాంతికి సవాలు విసురుతుంటే, భారతదేశం ఐక్యత మరియు సంకల్పంతో ప్రతిస్పందిస్తుంది," అని ఝా X పై తన పోస్ట్‌లో అన్నారు.

ఉగ్రవాదం కుక్క.. దాని యజమాని పాక్

జపాన్‌కు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ఉగ్రవాదం ఒక "పిచ్చి కుక్క" అని, దాని యజమాని పాకిస్తాన్ అని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని ఎదుర్కోడానికి ప్రపంచమంతా ఏకం కావాలని అన్నారు.

ఝా, అభిషేక్‌లతో పాటు, ప్రతినిధి బృందంలో ఎంపీలు అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, జాన్ బ్రిట్టాస్, ప్రదాన్ బారుహ్, హేమంగ్ జోషి, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మరియు ఫ్రాన్స్, బహ్రెయిన్‌లలో భారత మాజీ రాయబారి మోహన్ కుమార్ ఉన్నారు.

బహ్రెయిన్‌లోని మనామాకు చేరుకున్న అఖిలపక్ష భారత ప్రతినిధి బృందానికి సీనియర్ బిజెపి నాయకుడు బైజయంత్ జే పాండా నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా దుబాయ్‌లో ఉగ్రవాద సమస్యపై భారతదేశ వైఖరిని హైలైట్ చేయడానికి శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం దుబాయ్‌ని సందర్శించడాన్ని యుఈఇలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రశంసించారు.

ఖతార్‌లో సూలే బృందం..

NCP-SP నాయకురాలు సుప్రియా సులే(Supriya Sule) నేతృత్వంలోని నాల్గవ అఖిలపక్ష పార్లమెంటరీ బృందం శనివారం రాత్రి ఖతార్ చేరుకుంది. తరువాత దక్షిణాఫ్రికా, ఇథియోపియా మరియు ఈజిప్టులకు కూడా వెళ్తుంది. ఎన్‌సిపి-ఎస్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్ సూలేతో పాటు ఈ ప్రతినిధి బృందంలో బిజెపి నాయకులు రాజీవ్ ప్రతాప్ రూడీ, అనురాగ్ ఠాకూర్, వి మురళీధరన్, కాంగ్రెస్ నాయకులు మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, టిడిపి నాయకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, ఆప్ నాయకుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, మాజీ దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్ ఉన్నారు.

ఆపరేషన్ సిందూర్..

ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)లో భాగంగా భారతదేశం దాడులు నిర్వహించింది, ఆ తర్వాత మే 8, 9 , 10 తేదీలలో పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. పాకిస్తాన్ చర్యలకు భారతదేశం ప్రతిఘటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. 

Tags:    

Similar News