పన్నూన్ హత్యకు సుపారి: నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్
ఖలిస్తాన్ ఉగ్రవాదీ గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హత్య చేయడానికి కుట్ర పన్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ నుంచి యూఎస్ఏ..
By : The Federal
Update: 2024-06-17 05:13 GMT
సిక్కు ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ వ్యవస్థాపకుడు పన్నూన్ హత్యకు సుపారి ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ నుంచి అమెరికాకు తరలించారు. ఈ విషయాన్ని యూఎస్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. నిఖిల్ గుప్తా భారత జాతీయుడు.
గుప్తా (52), ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ను న్యూయార్క్ లో హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడంతో చెక్ రిపబ్లిక్ లో అమెరికా అభ్యర్థన మేరకు అరెస్ట్ కాబడ్డాడు. పన్నూన్ అమెరికా పౌరుడు. పన్నూన్ అమెరికాతో పాటు కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అమెరికాకు తీసుకు వచ్చిన నిఖిల్ గుప్తాను న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
న్యూయార్క్‌లో గుప్తా
నిఖిల్ గుప్తా ప్రస్తుతం బ్రూక్లిన్‌లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడని సమాచారం. అక్కడ ఉన్న ఖైదీల జాబితాలో గుప్తా పేరు ఉంది. వాషింగ్టన్ పోస్ట్ మొదటగా ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది.
"చెక్ రిపబ్లిక్‌లో నిర్బంధించబడిన గుప్తా, వారాంతంలో న్యూయార్క్ చేరుకున్నారు. యూఎస్ చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చిన నిందితులను దేశానికి వచ్చిన ఒకరోజు లోపు కోర్టుకు హజరుకావాలి’’ అని వాషింగ్టన్ పోస్ట్ వార్తలను ప్రచురించింది.
నిఖిల్ గుప్తాపై అభియోగం
ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పన్నూన్‌ను చంపడానికి గుప్తా ఒక హిట్‌మ్యాన్‌ను నియమించుకున్నారని ఇందుకోసం USD 15,000 అడ్వాన్స్‌గా చెల్లించారని ఆరోపించారు. ఇందులో పేరు తెలియని భారత ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) అధికారి విక్రమ్ యాదవ్ ఈ కుట్ర వెనుక భారతీయ అధికారి అని ఏప్రిల్ 2024లో వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అప్పటి R&AW చీఫ్ సమంత్ గోయెల్ ఈ ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చారని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను తోసిపుచ్చింది, ఇది పన్నూన్ ను చంపే పన్నాగంలో భారతీయ ఏజెంట్లు ప్రమేయం ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఖండించింది.
సులైవాన్ న్యూఢిల్లీ రాక..
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులైవాన్ వార్షిక ఐసీఈటీ చర్చల కోసం న్యూఢిల్లీకి రాబోతున్నారు. ఈయన పర్యటన ముందే నిఖిల్ గుప్తాను అమెరికా అదుపులోకి తీసుకుంది. ఈ సమస్యను సులైవాన్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ ముందు లేవనెత్తాలని భావిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను నిఖిల్ గుప్తా ఖండించారు. తనపై అన్యాయంగా అభియోగాలు మోపారని అంటున్నారు. గుప్తా తరఫున వాదిస్తున్న న్యాయవాదీ రోహిణి మూసా తన క్లయింట్ ను అన్యాయంగా విచారిస్తున్నారని భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్నూన్ ను హత్య చేయడానికి అసలు ఎలాంటి రికార్డులు లేవని అందులో పేర్కొన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. యూఎస్ ఏజెన్సీల ప్రభావంతో నియమితులైన కొంతమంది లాయర్లు గుప్తాకు తప్పుడు న్యాయసలహ ఇచ్చారని రోహిణి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భారత్, యూఎస్ ఒకరినొకరు నిందించుకోవడానికి ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నాయని విమర్శించారు.
అమెరికాకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను చెక్ రాజ్యాంగ న్యాయస్థానం గత నెలలో తిరస్కరించింది.