ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రద్దీ..
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటైన సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహించిన పాక్ తన గగనతలం మీదుగా విమానాలు వెళ్లేందుకు వీల్లేదని ఆంక్షలు విధించింది.;
పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీ్ర్‌లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట భారత భద్రతా బలగాలు చేపట్టిన క్షిపణుల ధాటికి సుమారు వంద మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా వెళ్లే భారత్ విమానాలపై ఆ దేశం ఆంక్షలు విధించింది.
సాధారణంగా వివిధ దేశాలను చేరుకోడానికి పాక్ మీదుగా 25 మార్గాలున్నాయి. భారత్ ప్రతిదాడి తర్వాత ఆ మార్గాలన్నింటిని పాకిస్థాన్ మూసివేసింది. దాంతో మరో రూట్‌లో వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా ముంబైలో విమానాల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
సాధారణ రోజుల్లో ముంబై (Mumbai) ఎయిర్‌పోర్టు నుంచి వివిధ దేశాలకు 950-970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో ఉత్తర భారతదేశం నుంచి యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని గమ్యస్థానాలకు దాదాపు 130 విమానాలు ముంబైని తాకకుండా భోపాల్-అహ్మదాబాద్-కరాచీ మార్గంలో మస్కట్‌కు వెళ్లేవి. ప్రస్తుతం పాక్ గగన తలం మూసివేయడంతో ఆ మార్గంలో వెళ్లే విమానాలన్నీ అహ్మదాబాద్ మీదుగా ముంబై చేరుకుని మస్కట్‌కు వెళ్తున్నాయి. దీంతో ముంబై ఎయిర్‌పోర్టు విమానాల రద్దీ పెరిగిపోయింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. అనేక విదేశీ విమానయాన సంస్థలు కూడా పాకిస్తాన్ గగనతలంపై వెళ్లేందుకు సంకోచిస్తున్నాయి.