‘గాజా’ రియల్ ఎస్టేట్ డ్రీమ్ అమెరికాకు మరో ప్లాప్ షో అవుతుందా?

ట్రంప్ ప్రకటన వెనక ఉన్న ఉద్దేశం ఏంటీ?;

Update: 2025-02-07 08:12 GMT

నిత్యం వివాదాలతో సావాసం చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీకాలంలో కూడా వాటితోనే ప్రారంభించారు. ఇప్పటికే అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి సైనిక విమనాల్లో మాతృదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా గాజాపై కూడా మరో వివాదాస్పద ప్రకటన చేశారు.

గాజాను అమెరికా స్వాధీనం చేసుకుని దాని పునర్మిణామం చేస్తామని ప్రకటించారు. అక్కడ ఉన్న పాలస్తీనియన్లు వేరే ప్రాంతాలకు వెళ్లాలని ప్రతిపాదించారు. దాని కోసం అమెరికా సైన్యాన్ని వినియోగించాలనే ప్రణాళికలను సైతం బయటపెట్టాడు.

గాజాను ఉన్నత స్థాయి వాణిజ్య కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రణాళికను అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిని పాలస్తీనియన్లను శాశ్వతంగా తమ దేశం నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి తీసుకొచ్చిన ప్రణాళికగా భావిస్తున్నారు.

గాజా పై నిరంతరం దాడి
గత 15 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తమ భూభాగంపై దాడి చేసి 1200 మంది అమాయకులు కిరాతకంగా అంతం చేయడం, మరో 250 మందిని బందీలుగా తీసుకున్న ఉగ్రవాద సంస్థ హమాస్ ను వెంటాడుతోంది. ఈ ప్రక్రియలో దాదాపు 47 వేలమంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపుగా 2 మిలియన్లకు పైగా తమ నివాసాలను విడిచిపెట్టి వెళ్లాల్లి వచ్చింది.
ప్రస్తుతం గాజాలో మిగిలిన జనాభాను ఖాళీ చేసి స్థిర నివాసుల కోసం దానిని పున: నిర్మించాలని ట్రంప్ ప్రతిపాదన చేయడం పాలస్తీనా చరిత్రను పూర్తిగా తుడిచివేసే ప్రయత్నమే.
ఇప్పటికే ఇజ్రాయెల్ చాలాకాలంగా ఆక్రమిత ప్రాంతాలలో యూదు నివాసాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ‘రివేరా’ ప్రణాళిక పాలస్తీనా భూభాగంపై పూర్తిగా ఇజ్రాయెల్ నియంత్రణను అధికారికంగా చేస్తుందని విమర్శకులు భయపడుతున్నారు.
ట్రంప్ అనుకున్నట్లుగా పాలస్తీనా శరణార్థులను తీసుకోవడానికి జోర్డాన్, ఈజిప్టు నిరాకరించాయి. అలాగే అరబ్ ప్రపంచం కూడా దీనిపై తమ విముఖతను చూపాయి. ఇది పాలస్తీనా సార్వభౌమత్వాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అని వాటి అభిప్రాయం.
అమెరికా జోక్యం చరిత్రను మార్చింది
అనేక ప్రాంతాలు సంక్షోభాలను పడేసిన చరిత్ర అమెరికాది. దాని సైనిక జోక్యం ఫలితంగా ఇరాక్ ఇప్పటికి కోలుకోలేదు. 2003 లో అది సద్దాం హుస్సెన్ పై దండయాత్రకు దిగింది. ఫలితంగా ఈ అస్ఫష్ట పరిస్థితుల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉద్భవించింది.
అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లతో పోరు సాగించడానికి ఇలాగే కాబూల్ లో అడుగుపెట్టింది. ఇక్కడ 20 సంవత్సరాలుగా అనేక గందరగోళ పరిస్థితులు సృష్టించి వెనుదిరిగింది. ఇప్పుడు దాని కన్ను గాజాపై పడింది. యుద్దంతో దెబ్బతిన్న ప్రాంతాలను బలవంతంగా అయినా ఆర్థిక కేంద్రాలుగా మార్చాలనే ఆలోచన చారిత్రాత్మకంగా తప్పుడు నిర్ణయం అవుతుంది. ఇది శాంతికి బదులుగా దీర్ఘకాలిక అస్థిరతకు దారి తీసే అవకాశం ఉంది.
పశ్చిమాసియా మొత్తం సంఘర్షణలతో అట్టుడుకుతోంది. సిరియా, లిబియా, యెమెన్ లో సైనిక తిరుగుబాటు జరుగుతోంది. వీటిలో అమెరికా జోక్యంతో పరిస్థితి మరింత క్షిష్టంగా మారింది.
బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానం వలనే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిందని, కీవ్ ను నాటో లో చేరాలనే ఒత్తిడితోనే రష్యా దాడికి దిగిందని ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయన ప్రకటించిన ‘రివేరా’ ప్రాజెక్ట్ కూడా ఇలానే అస్థిర పరిస్థితులు సృష్టించడానికి కారణం అయ్యేలా ఉంది.
ట్రంప్ ఉద్దేశం ఏంటీ?
ట్రంప్ మాటలు వింటే గాజాను సైనిక జోక్యంతో స్వాధీనం చేసుకుంటారని అనిపిస్తోంది. అయితే అందులో కూడా పూర్తి స్పష్టత కనిపించడం లేదు. అమెరికా సైనిక, ఆర్థిక సాయం అందిస్తుందని, ఇజ్రాయెల్ దాన్ని పర్యవేక్షిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తో ట్రంప్ కు ఉన్న బలమైన సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పాలస్తీనియన్లకు గాజాకు తిరిగి వచ్చే అవకాశం దాదాపు కనిపించట్లేదు.
ట్రంప్ చెప్పిన దాని ప్రకారం గాజాను విలాసవంతమైన ప్రదేశంగా మార్చడం దాదాపు అసాధ్యం కావచ్చు. లోతుగా పాతుకుపోయిన రాజకీయ ఉద్రిక్తతలతో కలిసి ఈ ఆలోచనను ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. అంతేకాకుండా అరబ్ ప్రపంచం ఈ ప్రణాళికను తిరస్కరించడం వల్ల పాలస్తీనా ప్రమేయం లేకుండా గాజాను పున: నిర్మించే ఏ ప్రయత్నమైన తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తుంది.
ట్రంప్ తన అనురించే రియల్ ఎస్టేట్ ఆధారిత విదేశాంగ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుండగా, పాలస్తీనియన్లు మరో అనిశ్చిత అధ్యాయానికి కేంద్ర బిందువుగా మారారు. ట్రంప్ గాజాలో అతిపెద్ద నగరాన్ని నిర్మించాలని ఊహిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరో కథను చెబుతున్నాయి. ఈ ప్రణాళిక విజయం వంతం అవుతుందా? లేదా యూఎస్ సైనిక జోక్యం పు చరిత్రలో మరో అపజయంలా మిగులుతుందా చూడాలి.
Tags:    

Similar News