ఇండియా టార్గెట్ పాక్ రాజధాని ఇస్లామాబాద్?
సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడే పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత మోగడం కలకలం రేపింది.;
By : The Federal
Update: 2025-05-08 18:15 GMT
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్థాన్ (India-Pakistan)కు ఇండియన్ సైన్యాలు గట్టి సమాధానం ఇచ్చాయి. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా దాడులు చేసింది. పలు కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయినట్లు తెలిసింది. సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడే పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత మోగడం కలకలం రేపింది. అదే సమయంలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతోందని, దీంతో ప్రధాని సహా మంత్రులు, అధికారులు కలవరపడ్డారని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇండియా టార్గెట్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదే కావొచ్చునని ఆదేశ విదేశీ వ్యవహార విభాగం అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.
ఇలా అనుమానించడానికి బలమైన కారణం ఉందని, భారతీయ త్రివిధ దళాల అధిపతులు కొద్ది సేపటి కిందట (మే 8వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో) ప్రధానమంత్రి మోదీని కలవడమేనని కూడా పాక్ అనుమానిస్తోంది. పాక్ లోని 9 నగరాల్లోని కీలక స్థావరాలపై భారత్ డ్రోన్లు దాడి చేశాయని కూడా చెబుతున్నారు.
పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి సమయంలో కొద్దిగంటల క్రితం పాకిస్థాన్ ప్రధాన నగరాలైన లాహోర్, కరాచీలో పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. పాక్ దాడుల యత్నాన్ని తిప్పికొట్టిన భారత్.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీసినట్టు రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. దీనిపై పాక్ ప్రధాని మంత్రి కార్యాలయం (PMO)లో జరిగిన సమావేశానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఉన్నతస్థాయి మిలిటరీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతుండగా సైరన్లు మోగాయి.
గగనతల రక్షణ వ్యవస్థకు విఘాతం...
భారత్ ప్రతీకార దాడుల్లో పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. ఇలా ధ్వంసం అయిన వాటిల్లో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ఉందని భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. పాకిస్థాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.
ఎల్ఓసీ పొడవునా కాల్పులు...
మరోవైపు నియంత్రణ రేఖ (LoC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతోంది. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన 8 మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్‌అవుట్ పాటించారు.
ఈ ప్రాంతాల్లో కాల్పులు...
జమ్మూతో సహా పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్‌లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీచేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలుచోట్ల కరెంటు నిలిపివేశారు.