మాజీ ప్రిన్సిపాల్‌కు జుడిషియల్ కస్టడీ పొడిగింపు

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనతో ముడిపడిన ఆర్థిక అవకతవకల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మాజీ ప్రిన్సిపాల్ కు జ్యుడీషియల్ కస్టడీని విధించింది.

Update: 2024-09-10 12:28 GMT

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనతో ముడిపడిన ఆర్థిక అవకతవకల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అతని భద్రతా సిబ్బంది అఫ్సర్ అలీ, ఇద్దరు సహచరులు, కాంట్రాక్టర్లు, విక్రేతలు బిప్లబ్ సిన్హా సుమన్ హజ్రాలను కూడా కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అవసరమైతే మళ్లీ వారి కస్టడీని కోరుతామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

సందీప్ ఘోష్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సెప్టెంబర్ 2న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. సెప్టెంబర్ 3న కోర్టు అతడిని ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.

51 మందికి నోటీసులు..

బెదిరింపు సంస్కృతిని ప్రోత్సహించడం, సంస్థ ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రమాదంలో పడేస్తున్నందుకు ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ 51 మంది వైద్యులకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11 న విచారణ కమిటీ ముందు హాజరు కావాలని కోరింది. కమిటీ ముందు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులో పేర్కొంది. ఈ జాబితాలో సీనియర్ రెసిడెంట్‌లు, గృహ సిబ్బంది, ఇంటర్న్‌లు, ప్రొఫెసర్‌లు ఉన్నారు.

ఆర్‌జి కర్ హాస్పిటల్ ప్రాంగణంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ విషాదకర మరణం అనంతరం జూనియర్ డాక్టర్ల నిరసనలతో కోల్‌కతా అట్టుడికింది. బాధితురాలు విధి నిర్వహణలో ఉండగా అత్యాచారం, హత్యకు గురైనట్లు కేసు నమోదయ్యింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. బాధితురాలికి న్యాయం జరిగేదాకా విధులకు హాజరుకామని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News