వణికిస్తున్న 'దానా' తుపాను, 200కి పైగా రైళ్ల రద్దు

'దానా' తుపాను ప్రభావంతో సుమారు 200 రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారిమళ్లించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

Update: 2024-10-23 15:33 GMT

తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపానుతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ తుపాను పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ‘దానా’ తుపాను (సైక్లోన్ దానా) ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే తాజాగా 200కి పైగా రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని రైళ్లను దారిమళ్లించింది. 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసింది. ఈ తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు, పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు లేదా దారిమళ్లించింది.


ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలను రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో నందన్‌కానన్‌ జూ, బొటానికల్‌ గార్డెన్‌లకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. 23 నుంచి 25 వరకు సిమిలిపాల్‌ టైగర్‌ రిజర్వు, భిటార్కనిక జాతీయ పార్కులను మూసివేశారు. తుపాను సమయంలో మూగ జీవాలకు ఆశ్రయం కల్పించాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 1962 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం కనుక్కోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ రాత్రి - అక్టోబర్ 25 ఉదయంలోపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో అక్టోబరు 24, 25 తేదీలలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

ఒడిశాలో తుపాను సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్హీ కోరారు. జిల్లా అధికారులతో ఎప్పటి కప్పుడు మాట్లాడి సమన్వయం ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో త్వరిత గతిన విద్యుత్,వాటర్, టెలిఫోన్, రవాణా సౌకర్యాలను పునరుద్దరించే విషయమై చర్చలు జరుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా కొనసాగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలలో తుపాను సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం ఉంటుందనుకునే ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Tags:    

Similar News