పదహారాణాల ‘ప్రజానాయకుడు’ ఎర్రన్నాయుడికి నివాళి
ఆయన మరణంతో తెలుగు వాళ్లు బాగా నష్టపోయారు. ఎందుకంటే, వాళ్లు ఢిల్లీలో ఒక అండ, ఒక అడ్రసు, ఒక ఫోన్ నెంబర్ కోల్పోయారు. ఈ రోజు ఎర్రన్నాయుడి జయంతి.
కింజారాపు ఎర్రన్నాయుడు (23 ఫిబ్రవరి 1957-2 నవంబర్ 2012) మాజీ కేంద్రమంత్రి, పలు మార్లు ఎంపి. తెలుగు దేశం పార్టీ నేత. ఆయన చనిపోయి పదకొండు సంవత్సరాలయింది. ఒక సారి పరిచయమయితే మర్చిపోలేని మనిషి ఎర్రన్నాయుడు. నార్త్ ఇండియా మారుమూల టౌన్లో కూడా ఆయన్ని నాయుడు సాబ్ గా గుర్తుపడతారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ఆయన జన్మస్థలం. తెలుగుదేశం పార్టీ ఆయన రాజకీయ జన్మస్థలం. ఆయన కారు ప్రమాదంలో 2012 నవంబర్ 2న చనిపోయారు. నేడు ఆయన జయంతి. క్లుప్తంగా ఇదీ ఆయన జీవితం.
నిజానికి ఇవేమీ అంత పెద్ద విశేషాలు కాదు. అయితే, ఆయన ప్రజా జీవితంలో మాత్రం ప్రతిరోజూ విశేషమే. ఎందుకంటే, అంతరించిపోతున్న ప్రజానాయకుడనే కోవకు చెందిన వాడు ఎర్రన్నాయుడు. మనిషిగా ఎత్తయినవాడు. హృదయం అలాగే చాలా విశాలం, వ్యక్తిత్వం ఉన్నతమయింది.
ఇపుడు కూడా పెద్ద పెద్ద రాజకీయనాయకులున్నారు. చాలా సార్లు ఎంపిగా ఎన్నిక అవుతున్నారు. వాళ్లకి కేంద్రంలో మంచి పలుకుబడి ఉంటుంది. చాలా కోట్ల ఆస్తి ఉంటుంది. ఎన్నో కంపెనీలుంటాయి. వాళ్లు చాలా మందికి ఆదర్శంగా ఉంటారు. చాలా ఫోలోయింగ్ ఉంటుంది. పాలాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. పార్టీకి ధనపుష్టి, జనపుష్టి ఇస్తుంటారు.
ఇక్కడే ఎర్రన్నాయుడు బాట వేరవుతుంది. ఎర్రన్నాయుడు కోట్లు, కంపెనీలు లేకుండా కేవలం ఓట్లతో నాయకుడయిన వాడు. పార్టీకి ఆయన ప్రజాపుష్టి నిచ్చాడు. ఎపుడూ ప్రజల మధ్య ఉండాలనే తపన పడ్డాడు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. 1980 తర్వాత ఇలాంటి తరం అంతరించిపోతూ వస్తున్నది. 2020దశాబ్దంలో బాగా అరుదు.
ఎర్రన్నాయుడు రాజకీయ జీవితమంతా ఢిల్లీలోనే సాగింది. ఆయన నిజానికి తక్కువ కాలం మంత్రి, ఎక్కువ కాలం ఎంపిగా ఉన్నారు. అయితే, ఢిల్లీలోనే కాదు, దేశమంతా ఆయన చాలా పాపులర్. భారీ విగ్రహం, చొరవ, జంకుగొంకు లేని ఉపన్యాస శైలి, ఆయన ఇంగ్లీష్, హావభావాలు, అరచిపిలిచి పలకరించే ఆప్యాయత ఆయనని పార్లమెంటులో అంతా అభిమానించే నాయకునిగా చేశాయి. ఎర్రన్నాయుడు ఢిల్లీలో ప్రవేశించిన కాలం కూడా మాంచి రాజకీయ పూత కాలం. తెలుగుదేశం పార్టీ ఒక వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో వెలుగొందిన ఎకైక ఎంపి ఎర్రన్నాయుడు. ఒక వెనకబడిన కుల నాయకుడికి తెలుగు వాళ్ల పార్లమెంటరీ చరిత్రలో ఇంతటి హోదా ఎపుడూ రాలేదు. ఇక ముందు అసలు రానే రాదు. ఈ విషయంలో తెలుగుదేశం నిర్ణయాన్ని హర్షించక తప్పదు.
ఆంధ్రప్రదేశ్ కు బాగా జాతీయ గుర్తింపు వచ్చిన కాలమది. తెలుగుదేశం పార్టీ కింగ్ మేకర్ గా గుర్తింపు పొందింది. ఆ రోజుల్లో ముగ్గురు తెలుగు నాయుళ్లు ఢిల్లీలో తెలుగు రాజకీయాలకు మారు పేరుగా ఉన్నారు. ఇందులో ఒకరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకాగా, రెండో నాయుడు కింజారపు ఎర్రన్నాయుడు. మూడో నాయుడు అపుడు బిజెపి అధ్యక్షుడిగా ఉండిన ఎం వెంకయ్య నాయుడు. ముగ్గుర నాయుళ్లు ఢిల్లీ చిత్రపటం మీద తళుక్కున మెరియడం నార్త్ వాళ్లకి అర్థమయ్యేది కాదు. వీళ్లంతా బంధువులేమో అనుకునే వాళ్లు.
హోదాలో చిన్నవాడు కింజారపు నాయుడు. కాని ఢిల్లీ పాపులారిటీలో నిమ్మాడ నాయుడే టాప్. అందరికి తెలిసిన ఫోన్ నెంబర్ ఆయనది. ఢిల్లీ కి వచ్చే తెలుగు వాళ్లకి, హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్న నార్త్ ప్రముఖులకు ఫస్ట్ పోర్ట్ ఆఫ్ కాల్ (First port of call) ఎర్రన్నాయుడే.
వాజ్ పేయికి ఎంత ఇష్టమో
అటల్ బీహారీ వాజ్ పేయి హాయాంలో ఎర్రన్నాయుడికి ఎనలేని గుర్తింపు వచ్చింది. ఎక్కడ చూసినా తెలుగు ఎంపిల పరివారాన్నేసుకుని ఆయన కనిపించేవాడు. అపుడు వాజ్ పేయి ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు నీయడం, క్యాబినెట్ పదవులను తిరస్కరించడంతో పార్లమెంటరీ పార్టీ నాయకుడయిన ఎర్రన్నాయుడికి క్యాబినెట్ మంత్రికంటే ఎక్కువ గౌరవం గుర్తింపు వుండేది. వాజ్ పేయి ఎర్రన్నాయుడికి ఎంత మర్యాద ఇచ్చే వారంటే, అప్పాయంట్ కోసం ఫోన్ చేస్తే ఏకంగా ఆయన లైన్లోకి వచ్చిపల్కరించి విషయం కనుక్కునేవాడు. దానికి నేనే ఎన్నోసార్లు సాక్ష్యం.
బిజీబిజీ బంగళా
ఎర్రన్నాయుడు ఉన్న బంగళా ‘9, సఫ్దర్ జంగ్ రోడ్’ ఢిల్లీలో చాలా పాపులర్ అడ్రస్. రాజకీయ పార్టీలకే కాదు, ఢిల్లీ లో సాయంకావలసి వచ్చిన వాళ్లందరికి అదే అడ్డా. ఆ రోజులో మూడు బంగళాల దగ్గిర ఎక్కువ విజిటర్లు ఉండే వారు. అందులో ఒకటి ప్రధాని వాజ్ పేయి బంగళా. ఆ తర్వాతి స్థానం ఎర్రన్నాయుడి బంగళా. మూడోది ఏపి భవన్ ఎదురుగా ఉన్నా అప్పటి పట్టాణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ఇల్లు.
ఎర్రన్నాయుడు ఢిల్లీ రాజకీయాల్లో మునిగి తెలుతున్నా, తన వూరు, తన జిల్లా, తన రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే వారు. పొద్దునే ఆరు గంటలకల్ల స్నానం చేసి, ఆఫీస్ కు వచ్చి ‘ది హిందూ’ పేపర్ ని క్షుణ్ణంగా చదివేవాడు. ఎందుకో తెలుసా? తనకు ఇంగ్లీష్ రాదని, ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. హిందూ పేపర్ చదవితే ఇంగ్లీష్ వస్తుందన నమ్మే కోటానుకోట్లలో ఆయన ఒకరు. ఇంగ్లీష్ కోసం ఎంత తపన పడే వాడో. హిందూ పేపర్ మొదటి పేజీ మొత్తం చదివే వాడు. ఆ పేజీలో తనకు అర్థంకాని పదాలని పెన్ తో అండర్ లైన్ చేసి అర్థం తెలుసుకునేవాడు. అలా చేసి అందులో కొన్ని మాటలనయినా లోక్ సభ ప్రసంగంలో ప్రయోగించాలనుకునే వాడు. “నాగరాజూ, ఎక్కడ నిమ్మాడ, ఎక్కడ లోక్ సభ. ఎంత దూరం వచ్చనయ్చా. నాలుగు ముక్కలు ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటే మనం ఇంకా గుర్తింపు వచ్చేది కదా,’
చక్కగా హిందీలో, ఇంగ్లీష్ లో మాట్లాడి జైపాల్ రెడ్డి లాగా మాంచి పార్లమెంటేరియన్ కావాలని ఆయనకు కోరిక ఉండేది. కొద్ది రోజులు హిందీ కోచింగ్ కూడా తీసుకున్నాడు. కానీ ఆ భాష అబ్బలేదు.
అయితే, తన చిన్నకుటుంబం, పల్లెటూరి స్కూల్ జీవితం, గ్రామీణ సామాజిక నేపథ్యం అడ్డంకిగా మారాయని బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. తన నిమ్మాడ ఎక్కడ? న్యూఢిల్లీ ఎక్కడ? లోక్ సభ ఎక్కడ, తన నేపథ్యం ఏమిటి? అని ఎపుడూ గతం తలుచుకుని గర్వపడేవాడు. అందుకే తననీ స్థాయికి తెచ్చిన వాళ్లకు ఎంత సేవ చేసినా రుణం తీరదని భావించే వాడు. దానికి తగ్గట్టుగానే ఆయన ఇల్లు జనంతో క్రిక్కిరిసి ఉండేది. ఎర్రన్నాయుడిలో ఎంపిననే దర్పం ఉండదు. ఆయన్ని కలుసుకునే వాళ్లు జడిపించే హోదా ఉన్న రాజకీయనాయకుడిని కాకుండా ఆత్మీయుని కలుసుకున్నట్లు ఫీలయ్యే వాళ్లు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. తనలాంటి వాళ్లకి బాగా గుర్తింపు వస్తుందనే చంద్రబాబు నాయుడు వాజ్ పేయి క్యాబినెట్ లో చేరలేదని ఆయన అనుమానం. అయితే, ఇప్పటి ఎంపిల్లాగ, ఎమ్మెల్యేల్లాగా, పార్టీ మారే యోచన ఆయన ఎపుడూ లేదు. కొన్ని విషయాల్లో బాధ ఉన్నా, బాబుని హృదయపూర్వకంగా గౌరవించేవాడు.
ఎర్రన్నాయుడి కొడుకు కుర్రన్నాయుడు
ఆయన ఇంగ్లీష్, హిందీ కోరిక కొడుకు రామ్మోహన్ నాయుడి ( ఆ రోజు నిక్కర్ వేసుకుని చలాకిగా కనిపించే రామ్మోహన్ కి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి కుర్రన్నాయుడు అని పేరు పెట్టారు) రూపంలో నెరవేరింది. రామ్మోహన్నాయుడు హిందీలో ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడి పేరు తెచ్చుకున్నాడు. ఇంక ప్రజల విషయంలో ఎర్రన్నాయుడి వారసుడని గుర్తింపు పొందాలి.
ఎర్రన్నాయుడి బంగళా గేటు 24 గంటలు తీసి ఉంచేవారు. ఇలాంటి ఢిల్లీ లో బంగళాలు చాలా అరుదు. అందులో బండార దత్తాత్రేయ (అశోకా రోడ్, 5)ది ఒకటి, కృష్ణమీనన్ మార్గ్ లోని మూడో నెంబర్ కోటి మూడోది. అది వేరే కథ. అంది రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ది. కమ్యూనిస్టు ఎంపిల ఇళ్లది అదే పరిస్థితి. ఆకథ వేరు.
పొద్దున 7.30 కల్లా టిఫిన్ ముగించుకుని ఆఫీసులోకి వచ్చాడో లేదో విజిటర్ల దాడి మొదలవుతుంది. ఆయన కార్యాలయం అద్భుతంగా పని చేసేది. చాలా సిస్టమాటిక్ గా పని చేసేది. ప్రతి విజిటర్ సమాచారం దస్తరంలోకి ఎక్కించేవారు. కనీసం పదిహేను వాల్యూమ్స్ గా వీటిని బౌండ్ చేయించాడు. వచ్చిన వాడి పనేమిటో ఎర్రన్నాయుడు స్వయంగా తెలుసుకునేవాడు. వెంటనే ఆ కేంద్ర మంత్రికో , అధికారికో పోన్ వెళ్లేది. ఇదంతా రికార్డు చేసే వాళ్లు. ఆ పనిని తప్పనిసరిగా ఫాలో అప్ చేసేవారు. తాను స్వయంగా కలవకుండా ఒక్క విజిటర్ గా కూడా ఎర్రన్నాయుడు వెనుతిప్పి పంపేవాడు కాదు. నాలుగు రోజులు ఆగే ఒపిక లేని విజిటర్లు రోజూ వచ్చేవారు. ఎవ్వరిని విసుక్కునే వారు. దూర ప్రాంతాలనుంచి వచ్చే వాళ్లకి భోజనం కూడా పెట్టేవారు. అవసరమయితే, ఆయన స్వయంగా మంత్రి దగ్గిరకో, అధికారి దగ్గిరకో తీసుకువెళ్లే వాడు. ఇదే తంతు ఆయన శ్రీకాకుళంలో ఉన్నా కొనసాగుతుంది. ప్రతి విజిటర్ కు పని ప్రోగ్రెస్ ఎమిటో సమాచారం చేరవేసేవాళ్లు.
ఆయన శ్రీకాకుళంలో బస చేస్తే ఆయన కలుసుకుని విజ్ఞప్తులందించేందుకు ఎంత పెద్ద క్యూ ఉండేదో. తన కోసంవచ్చే విఐపి విజిటర్లకంటే ఎర్రన్నాయుడు ఈ సాధారణ ఓటర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. తాను అందుబాటులో లేకపోతే, ఆయన పిఎ సత్యనారాయణ వాళ్ల పనులను ఫాలో అప్ చేసేవాడు.
ఎర్రన్నాయుడు ఢిల్లీలో ఉంటే దినంలో 10 -12 గంటలు విజిటర్ల కే టాయించేవాడు. చాలా మంది ఎంపిలు ఢిల్లీకి సంసారం మార్చరు. కాని ఎర్రన్నాయుడు మాత్రం సంసారం ఢిల్లీకి మార్చి పిల్లలను ఢిల్లీలో చదివించాడు తన పిల్లలు తన లాగా ఎజుకేషన్ లో వెనకబడరాదనేది ఆయన తాపత్రయం. ఈ విషయంలో ఆయన విజయవంతమయ్యాడు. రామ్మోహన్ నాయుడు మంచి భవిష్యత్తు ఉన్న ఎంపిగా తయారయ్యేందుకు కారణం ఎర్రన్నాయుడి ముందుచూపే.
ఎక్కడున్నా కలకలమే
ఎర్రన్నాయుడు ఎక్కడున్నా కలకలమే. పార్లమెంటులో తిరుగుతుంటే కలకలం, సెంట్రల్ హాల్ ఉంటే కలకలం. సభలో ఉంటే కలకలం. సభాధ్యక్ష స్థానంలో ఉంటే కలకలం. బంగళాలో ఉంటే కలకలం. ఎయిర్ పోర్టులో ఉంటే కలకలం. ఎదైనా రాష్ట్రానికి పార్లమెంటరీ కమిటీ తరఫున టూర్ వెళ్లితే, అక్కడి వాళ్లు టకీమని గుర్తు పెట్టేది ‘నాయుడు సాబ్ ’నే.
ఎర్రన్నాయుడు అంతరించిపోతున్న ‘ప్రజానాయకుడు’ అనే తరానికి చెందిన నేత. ఇలాంటి ప్రజానాయకులు ఇక ముందు రావడం కష్టం. రాజకీయాల ధ్యేయం మారిపోయింది. ఎర్రన్నాయుడు ఎందుకు ప్రజానాయకుడంటే ఆయనకు ప్రజలు, ప్రజాజీవితమే మొదటి ప్రాధాన్యం. కుటుంబ సభ్యులకు గనులు, వ్యాపారాలు, ఇసుక, కంకర అన్ని కట్టి పెట్టాలని , కనిపించిన ఏజన్సీలన్నింటిని ఇప్పించి పెద్దవాళ్లని ఆయన ఎపుడూ కలకనలేదు.
ఆయనకేమయిన వ్యాపారాలుంటే ఉండవచ్చేమో. ప్రజలను కలుసుకోవాలని, ప్రజల తనకోసం రావాలని వాళ్లడిగిన పనులన్నీ చేసి ప్రజల్లో బాగా పేరుతెచ్చుకోవాలనేదే ఆయన తపనంతా. ఆయన కుటుంబ వ్యాపారాలెపుడూ రాజకీయచర్చల్లో గాని, టివి డిబేట్లలోగాని సంచలనం సృష్టించలేదు. అవేవీ ఎవరికీ తెలియవు. బ్యాంకులను తన బిజినెస్ కు వాడుకున్న వివాదాలు కూడా లేవు. పేకాట బ్యాచ్ ఎంపిలలో ఆయనెపుడూ కనిపించే వాడు కాదు. మధ్యాహ్నం సాధారణంగా కునుకు తీయడు. ఎపుడూ ఏదో ఒక పని పెట్టుకుని బిజీగా ఉంటాడు. నిద్రపోవాలనుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోసం ఎదురుచూస్తూ సిఎం ఆఫీస్ విజిటర్స్ గదిలోనే నిద్రపోగలడు ఎపుడూ నియోజవర్గంలో పర్యటనలకు ప్రాధాన్యమిచ్చేవాడు. ఈపర్యటనలో ఉండగనే ఆయన కారు ప్రమాదానికి గురయింది. . అందుకే పదహారాణాల ప్రజా నాయకుడిగా ఎర్రన్నాయుడు మిగిలిపోయాడు.
రాజకీయాల్లో చాలా ఓర్పు ఉండాలి. ఈ ఓర్పు ఎర్నాయుడు గొప్పగా అలవర్చుకున్నారు. పార్టీ నేత చంద్రబాబు నాయుడు తనని సైడ్ లైన్ చేస్తున్నాడని ఒక దశలో అనిపించినా బాధపడ్డాడు తప్ప ఆయన పార్టీ మారడం గురించి ఆలోచించేవాడు కాదు. “ఇంకేం కావాలయ్యా నాకు, టిడిపి అన్నీ ఇచ్చింది. నేనయితే ప్రధాని కాలేనుగా. క్యాబినెట్ మంత్రి అయ్యాను.జైపాల్ రెడ్డి, కోట్ల, శివశంకర్ వంటి గొప్పవాళ్లు చేపట్టిన క్యాబినెట్ పదవిని నాకు టిడిపి ఇచ్చింది. పార్లమెంటరీ పార్టీ నాయకుడిని అయ్యాను. ఇంతకంటే ఏంకాావాలి. పార్టీ మారాలనే పాడు ఆలోచన ఏమిటి?” అనే వాడు.
ఎర్రన్నాయుడి హఠాన్మరణం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటే. ఆయన మరణంతో తెలుగు వాళ్లు అంతకంటే ఎక్కువగా నష్టపోయారు. ఎందుకంటే, తెలుగు వాళ్లు ఢిల్లీలో ఒక అండ, ఒక అడ్రసు, ఒక ఫోన్ నెంబర్ కోల్పోయారు.