ఆదిమూలం ఔట్
వైఎస్సార్సీపీ అధిష్టానం బుధవారం మూడు ఎమ్మెల్యే స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలకు సమన్వయ కర్తలను నియచమించింది.
అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా వుంటుందో చూపించారు వైసీపీ పెద్దలు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పక్కన పెట్టేశారు. మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి నందుకు ఆదిమూలం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక ఈయనకు వైసీపీలో రాజకీయ భవిష్యత్ లేదని చెప్పొచ్చు. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాలో కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా నియమించారు. అయితే వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆదిమూలం బరస్టయ్యారు. ఎస్సీలు మీ వద్ద ఎంతకాలం ఊడిగం చేయాలంటూ మంత్రి పెద్దిరెడ్డిని ప్రశ్నించడంతో ఆయన ఆగ్రహానికి గురైన ఆదిమూలానికి టిక్కెట్ దక్కలేదు. సత్యవేడుకు తిరుపతి ఎంపీ గురుముర్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఆదిమూలం తిరుగుబాటుతో గురుముర్తిని తిరిగి తిరుపతి ఎంపీ స్థానానికి తీసుకొచ్చారు.
నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి సమన్వయ కర్తగా నియమించారు. ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు టిక్కెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో ఆయన వైసీపీని వీడారు. దీంతో బీసీకి ముందుగానే నర్సరావుపేట ఎంపీ స్థానం కేటాయించాలని అనుకున్న వైసీపీ అనిల్ కుమార్ ను ఎంపిక చేసింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేశ్ ను నియమించారు. రమేశ్ ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. రమేశ్ అవనిగడ్డలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆధునిక భావాలు వున్న వ్యక్తిగా పేరు వుంది. మచిలీపట్నం ఎంపీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బాలశౌరికి సీటు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పడంతో ముందుగానే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సింహాద్రి రమేశ్ ను ఎంపిక చేశారు.
కాకినాడ ఎంపీ స్థానానికి చలమలశెట్టి సునీల్ ను సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ నియమించింది. సునీల్ 2014లో వైసీపీ ఎంపీగా కాకినాడ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత 2019లో తెలుగుదేశం పార్టీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీచేసి మరళా ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీలో చేరి తిరిగి ఎంపీ స్థానానికి సీటు సంపాదించారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా వంగా గీత ఉన్నారు. ఆమెకు టిక్కెట్ లేదు.
అరకువ్యాలీ ఎమ్మెల్యే స్థానానికి రేగం మత్స్యలింగంను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ స్థానానికి ఇప్పటికే గొడ్డేటి మాధవిని సమన్వయకర్తగా నియమించారు. కారణాలు ఏమైనా ఆమెను స్థానికులు వ్యతిరేకించడంతో తిరిగి తప్పించి మత్స్యలింగానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వున్న చిట్టి పల్గుణకు సీటు ఇవ్వడం లేదు. అయితే పల్గుణకే సీటు ఇవ్వాలని స్థానికులు పట్టుబడుతున్నారు.