ఏపీలో మద్యం మరింత ప్రియం

మద్యం ప్రియుల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ప్రతి బాటిల్ పైనా రూ. 10లు ప్రభుత్వం పెంచింది. కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మధ్యం ధరలు ఎక్కువగా ఉన్నాయి.;

Update: 2025-02-12 06:06 GMT

ఏపీ ప్రభుత్వానికి మద్యం ప్రత్యేక ఆదాయ వనరుగా మారిందా? గత ప్రభుత్వం మధ్యం ధరలు ఇష్టానుసారం పెంచి మొదట్లో సొమ్ము చేసుకుని నిదానంగా తగ్గిస్తూ వచ్చింది. ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఛీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ. 130 నుంచి రూ. 150 వరకు అమ్మింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధిక ధరలు తగ్గిస్తామని, గతంలో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ మార్కెట్లోకి తెస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఛీప్ లిక్కర్ మాత్రం క్వార్టర్ రూ. 100లు అమ్ముతున్నారు. మిగిలిన బ్రాండ్స్ ధరలు ఏవీ తగ్గించలేదు. ఉదాహరణకు బ్యాలెన్ టైన్స్ (Ballantines) స్కాచ్ విస్కీ 750 ఎంఎల్ బాటిల్ ధర రూ. 2,090లు. జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 2,400లు అమ్మారు. కూటమి ప్రభుత్వం (ప్రస్తుతం) లో రూ. 2,610లు ఎమ్మార్పీగా అమ్ముతున్నారు. ఇలా కొన్ని బ్రాండ్స్ ధరలు పెరిగాయి. బాగా తగ్గినవంటూ ఏవీ లేవు. వ్యాపారులకు మార్జిన్ తక్కువగా వస్తోందని బాటిల్ పై రూ. 10లు ధరను ప్రభుత్వం పెంచింది.

బాట్లింగ్ కంపెనీ వారు ప్రభుత్వానికి ఎంతకు ఇస్తారో తెలియదు

మద్యం తయారీ కంపెనీల వారు ప్రభుత్వానికి ఎంత మొత్తానికి అమ్ముతారో మద్యం ప్రియులకు తెలియదు. బాటిళ్లపై ధరల మార్పుల లేబుళ్లు ఒకదానిపై ఒకటి అంటిస్తుంటారు. ధరలు పెరిగినప్పుడల్లా లేబుళ్లు మారుస్తారు. ఈ లేబుల్స్ బాట్లింగ్ కంపెనీల అంటించడం లేదు. మద్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం డిపోల్లో ధరల లేబుళ్లు అంటిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాట్లింగ్ కంపెనీల నుంచి ప్రభుత్వం మద్యం డిపోకు బాటిళ్ల కేసులు వచ్చిన తరువాత వాటిని దించేందుకు, తిరిగి డిపో నుంచి షాపులకు ఎత్తేందుకు సిబ్బందిని ప్రభుత్వం నియమించుకుంది. ఆ సిబ్బంది జీత భత్యాలు ప్రభుత్వమే చూసుకుంటుంది.

30 శాతం మేర ప్రభుత్వానికి మార్జిన్ ఉంటుందా?

మద్యం అమ్మకాల ద్వారా 30 శాతం మర్జిన్ ప్రభుత్వానికి ఉంటుందని మద్యం షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు మద్యం అమ్మకాలు చేస్తున్నందున బాట్లింగ్ కంపెనీల నుంచి వచ్చిన మద్యాన్ని ప్రభుత్వ మద్యం డిపోల నుంచి ప్రైవేట్ వారు నిర్వహిస్తున్న మద్యం షాపులకు సరఫరా చేస్తారు. మద్యం కంపెనీల వారి నుంచి ప్రభుత్వం మద్యాన్ని కొనుగోలు చేసిన తరువాత కంపెనీకి చెల్లించే ధరపై 30 శాతం ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా ఎక్సైజ్ శాఖ వారు తగిన చర్యలు తీసుకొంటున్నారని సమాచారం. అలాగే మద్యం రిటైల్ వ్యాపారులకు రూ. 20 శాతం మార్జిన్ ఉంటుందని లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు వారి నుంచి నాన్ రిఫండబుల్ డిపాజిట్ ను తీసుకున్నది.

మద్యం వ్యాపారుల గగ్గోలుతో ధరల పెంపు

ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అమ్మకాలపై వ్యాపారులకు 20 శాతం మార్జిన్ ఉండటం లేదు. ఛీప్ లిక్కర్ అమ్మకాలపై కేవలం 8శాతం మాత్రమే మార్జిన్ ఉంటోందని, మిగలిన బ్రాండ్స్ విషయంలో పది శాతం దాటటం లేదని ప్రభుత్వం వద్ద వంచాయతీ పెట్టారు. షాపులు కేటాయించే సమయంలో తమ నుంచి నాన్ రిఫండబుల్ డిపాజిట్ తీసుకున్న సమయంలో 20 శాతం మార్జిన్ ఉంటుందని చెప్పారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాపారులు వివరించడంతో మద్య ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ద్వారా మద్యం ప్రియులపై ఏడాదికి సుమారు రూ. 3వేల కోట్ల అదనపు భారం పడుతుందని ప్రస్తుతం జరుగుతున్న అమ్మకాలను బట్టి అంచనా వేశారు.

ధరలు పెంచినా మద్యం వ్యాపారులకు వచ్చే మార్జిన్ 14.4 శాతమే నట..

ప్రభుత్వం ప్రతి బాటిల్ పై రూ. 10లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల వ్యాపారులకు రూ. 14.4 శాతం మార్జిన్ మాత్రమే ఉంటుందట. ఈ విషయం ప్రభుత్వమే లెక్కలు వేసి తెలియజేసిందట. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ప్రకారం అమ్మితే ఈ మేరకు వ్యాపారులకు లాభం ఉంటుందనేది ప్రభుత్వం చెబుతున్న మాట. ఎక్సైజ్ శాఖ వారు ఇన్వాయిస్ షాపుకు ఇచ్చిన తరువాత అమ్మకాలపై ఎంత మొత్తం మార్జిన్ ఉంటుందనేది షాపుల వారికి వివరించారు. ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించి షాపులు కేటాయించిన సందర్భంలో చెప్పినట్లు కాకుండా ఇప్పుడు ఇంత మార్జిన్ తగ్గిపోవడం ఏమిటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఉండే మార్జిన్ నుంచి ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ పోను ప్రభుత్వం కొంత మిగిల్చుకుంటుందని వ్యాపారులు అంటున్నారు. తమ పేర్లు చెబితే ప్రభుత్వ వేధింపులు భరించలేమని వారు చెబుతున్నారు.

మార్జిన్ ఎలా నిర్ణయిస్తారు?

ప్రభుత్వం మద్యం ధరను నిర్ణయించి బాటిల్ పై వేసిన ఎమ్మార్పీ కి అమ్మాల్సిందిగా మద్యం దుకాణా దారులకు ఆదేశాలు ఇస్తుంది. అంటే ప్రభుత్వం మద్యం దుకాణానికి విక్రయించేటప్పుడే 14శాతం మర్జిన్ ఉండేలా చూస్తుంది. ఉదాహరణకు ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర రూ. 130లు అనుకుంటే ప్రభుత్వం మద్యం దుకాణానికి రూ. 116లకు విక్రయిస్తుంది. ఎమ్మార్పీకి మద్యం కొనుగోలు దారుకు షాపుల వారు విక్రయించినప్పుడు రూ. 14లు వ్యాపారికి మిగులు తుంది. దీనిని ప్రభుత్వం మద్యం వ్యాపారికి ఇచ్చిన మార్జిన్ గా చెబుతున్నారు.

ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే..

మధ్యం దుకాణాలకు 14 శాతం మార్జిన్ పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ మాత్రం గండి పడే అవకాశం లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బాటిల్ పై రూ. 10 పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ. 100 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో మాట్లాడుతూ మద్యం షాపుల కేటాయింపు నుంచి బ్రాండ్ల పునరుద్దరణ వరకు ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. మద్యం పాలసీకి సంబందించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను అన్నింటినీ సరిదిద్దుతూ తమ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని రూపొందించి అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మద్యం షాపులకు ఏకంగా 90 వేల దరఖాస్తులు వచ్చాయని, తద్వారా ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల మేర ఆధాయం వచ్చిందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ల సమక్షంలో నిర్వహించి పారదర్శకంగా షాపులు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న ఆరు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ షాపుల కేటాయింపు పారదర్శకంగా, ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయించడం జరిగిందని, ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారు భంగపడ్డారన్నారు.

రూ.99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, 12 రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే షాపులకు తరలిస్తున్నామన్నారు. ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా డిపోల నుంచి వచ్చే ఇండెంట్ ఆధారంగా మాత్రమే మద్యం కేటాయింపులు చేస్తున్నామన్నారు. సారా రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో త్వరలోనే నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన మేరకు పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.

Tags:    

Similar News