డీలిమిటేషన్ పై ఆంధ్రా పార్టీల మౌనం- ప్రజల పాలిట శాపమేనా?
రాష్ట్ర ప్రయోజనాలపై గొంతెత్తడమంటే బీజేపీనో, మోదీనో ప్రశ్నించడం కాదు. ప్రజా ప్రయోజనాలను కాపాడుకోవడం. ప్రధానికీ ఈ సంగతి తెలుసు. మరి వీళ్లకెందుకు భయపడుతున్నారు?;
By : A.Amaraiah
Update: 2025-03-24 09:53 GMT
"మౌనంగా ఉండటం, అసత్యం మాట్లాడటం కంటే చాలా ప్రమాదకరం" అంటారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. "సమయం వచ్చినప్పుడు మాట్లాడటం నేరం కాదు, మాట్లాడకుండా ఉండటం నేరం" అంటారు జయప్రకాష్ నారాయణ్. వీళ్లిద్దరూ ప్రజాహక్కుల కోసం పోరాడిన వారే. ఇద్దరూ రాజ్యాంగ నిపుణులే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉందా అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2026 నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), జనసేన పార్టీలు ఈ విషయంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం గోడమీద పిల్లి వాటాన్ని తెలియజేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ డీలిమిటేషన్ అంటే ఏంటి?
డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల సంఖ్యను లేదా పరిమాణాన్ని జనాభా ఆధారంగా పునర్విభజించే ప్రక్రియ. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అయిన డీలిమిటేషన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 2026 తరువాత పార్లమెంటు సీట్ల సంఖ్య పెరుగుతుందని అంచనా. అలా పెరిగితే ఉత్తరాది సీట్లు పెరిగి దక్షిణ రాష్ట్రాలలో తగ్గుతాయనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది. దీనిపై తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే గళమెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ కూటమి మాత్రమే వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
కేంద్రానికి పోతున్న పన్నులు ఎన్నీ?
డీలిమిటేషన్ తో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు పంచినట్టే వనరులనూ పంచుతారు. 15వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ఆధారంగా, రాష్ట్రాలకు కేంద్రం పన్నులలో వాటాను తిరిగి పంపుతుంది. ఇది అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండదు. జనాభా, అభివృద్ధి స్థాయి, భూభాగం, పేదరికం వంటి అంశాల ఆధారంగా మారుతుంది.
కొత్త పార్లమెంటు భవనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి పోతున్న పన్నులు (Income Tax, GST, Excise, Customs, etc.) కంటే తిరిగి వచ్చేవి తక్కువగా ఉన్నాయి. 2022-23 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి సుమారు ₹1.10 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే తిరిగి రాష్ట్రానికి వచ్చింది కేవలం 48 వేల కోట్లు. అంటే రూపాయి కడితే తిరిగి ఇచ్చింది రమారమి 48 పైసలు. ఆర్ధిక లెక్కల్లో ఏపీకి తగ్గిన నష్టం ₹60,000 కోట్లు. దీన్ని "ఫిస్కల్ ఫెడరలిజం"లో అసమతుల్యతకు నిదర్శనంగా చాలా రాష్ట్రాలు పేర్కొంటున్నాయి.
2024 అక్టోబర్‌లో, కేంద్రం మొత్తం రూ.1,78,173 కోట్ల పన్నుల వాటాను 28 రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ కేటాయింపుల్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయమేమిటో తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ కి రూ.31,962 కోట్లు, బీహార్ కి రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కి రూ.13,987 కోట్లు, పశ్చిమ బెంగాల్ కి రూ.13,404 కోట్లు, మహారాష్ట్ర: రూ.11,255 కోట్లు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం కేవలం 7,211 కోట్లు వచ్చాయంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.
ఇక లోక్ సభ సీట్లు తగ్గవనే వాదన...
పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం (Representation in Lok Sabha) ఇప్పుడున్నట్టే ఉంటుందని, తగ్గదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దక్షిణాదికి ఏదో ఒక రూపంలో మినహాయింపు ఇచ్చినా ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెరిగితే తమ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రశ్న.
తమిళనాడు, ఆంధ్ర, కర్నాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలోని లోక్ సభ సీట్లు వరుసగా
ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. అందులో దక్షిణాది ఐదు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక)కు కలిపి ఉన్న సీట్లు 129. తమిళనాడు 39, ఆంధ్రప్రదేశ్ 25, కర్ణాటక 28,తెలంగాణ 17, కేరళ 20. మొత్తం 129 సీట్లు. పుదుచ్చేరి ఒక సీటు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. అంటే దక్షిణాది రాష్ట్రాల మొత్తం శాతం 23.7% లేదా 24 శాతం మాత్రమే.
అదే ఉత్తరాదిలోని నాలుగు ప్రధాన రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఈ నాలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో నిమిత్తం లేకుండానే ఏ పార్టీ అయినా కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
పన్నులు కట్టడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందుండీ సీట్లలో వెనకబడితే తీవ్రనష్టం వాటిల్లుతుందని కూడా ఉండవల్లి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల వాటా (tax contribution) 35-40% వరకు ఉంటోంది. తిరిగి తెచ్చుకునేది తక్కువ ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే డీలిమిటేషన్ తరువాత, లోక్‌సభ సీట్లు జనాభా ఆధారంగా పెరిగితే, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరింత తగ్గే ప్రమాదం ఉంది.
అందుకే దక్షిణాది రాష్ట్రాలలో "మేము ఎక్కువ సంపాదించి, తక్కువ స్థాయిలో ప్రాతినిధ్యం పొందుతున్నాం" అనే అభిప్రాయం బలపడుతోంది.
దక్షిణ రాష్ట్రాల వాదన ఏమిటంటే..
“మేము కుటుంబ నియంత్రణను పాటించి జనాభా పెరుగుదలను తగ్గించాం. కానీ ఇప్పుడు అదే మాకు శిక్షలా మారుతోంది” అని, పన్నులు ఎక్కువగా చెల్లిస్తున్నా, జనాభా తక్కువగా ఉండటంతో తిరిగి వచ్చే వాటా తక్కువగా ఉందని వాదిస్తున్నాయి.
Fiscal Imbalance అంటే ఏమిటి?
ఇది ఒక రాష్ట్రం జాతీయ స్థాయి ఆదాయంతో (per capita income) ఎంత వెనుక ఉందో చూపించే ప్రమాణం. వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. ఇది తాత్వికంగా న్యాయమైనదే. ఎందుకంటే అభివృద్ధి చెందని ప్రాంతాలకు నిధులు అవసరం. కానీ పన్నులు చెల్లిస్తున్నరాష్ట్రాలను శిక్షించి కాదు కదా అని తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిలదీశారు. “మేము అభివృద్ధి సాధించాం. మంచి పాలనతో ఆదాయాన్ని పెంచాం. ఇప్పుడు దానికి శిక్షగా, మాకు తక్కువ పంపకం చేస్తారా, ఇది న్యాయమేనా” అని ప్రశ్నించారు.
ఇక్కడే ప్రధాన సమస్య ఉంది. పన్నుల పంపకంలో ఏ రాష్ట్రం ఎంత పన్ను చెల్లిస్తోందనే దాన్ని ప్రామాణికంగా పరిగణించరు. అంటే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువ టాక్స్ ఇవ్వొచ్చు. కానీ పంపకంలో "తక్కువ ఆదాయం", "ఎక్కువ జనాభా" ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వాటా పోతుంది. అసమతుల్యతను రూపుమాపడం అనే పేరిట ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. దీన్ని చాలా మంది "ఫిస్కల్ అసమతుల్యత" (Fiscal Imbalance) అని అభివర్ణిస్తున్నారు.
జనాభా ఆధారంగా పంపకం చేయడం ఒక క్రైటీరియా కావచ్చు, కానీ ఏకైక ప్రమాణంగా ఉండకూడదు. రాష్ట్రం ఎంత ఆదాయం జెనరేట్ చేస్తుందో, ఎంత పన్ను చెల్లిస్తుందో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే, అభివృద్ధి చేసిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
ఈ సమస్యే ప్రస్తుతం డీలిమిటేషన్ విషయంలోనూ ప్రతిఫలిస్తోంది. ప్రాతినిధ్యాన్ని కూడా జనాభా ఆధారంగా పెంచే ప్రణాళికకి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే ఇదే కారణం.
ఏ పార్టీ ఏం చెబుతోంది?
టీడీపీ:
ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీ, ఈ అంశంపై మౌనం పాటించింది. అయితే, ఈ మధ్య పార్టీలోని కొందరు నేతలు మాత్రం "రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకించాలి" అంటూ అక్కడక్కడా గళం విప్పుతున్నారు. చంద్రబాబు నాయుడి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదంతా ఊహాజనితమే అని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
వైసీపీ:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ కేంద్రంతో స్నేహపూరితంగా ఉంటోంది. ఈమధ్య ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఓ 15 అంశాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. అందులో జనాంతిక విషయాలు ఉన్నయే తప్ప రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించబోమనే హెచ్చరిక లేదు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా, కేంద్రం అనుసరించే విధానాలకే ఈ పార్టీ ఎక్కువ మద్దతు ఇస్తోందన్న విమర్శ ఉండనే ఉంది. ఇప్పటివరకు డీలిమిటేషన్‌పై వైసీపీ నుండి ఎలాంటి అధికారిక వ్యతిరేకత వ్యక్తం కాకపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
జనసేన:
పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఉంటామా అని ఎదురు ప్రశ్న వేస్తోందే తప్ప "రాష్ట్ర హక్కుల పరిరక్షణకు ముందుంటామని" మాత్రం చెప్పడం లేదు. పవన్ కల్యాణ్ తాజాగా "నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నా" అని ప్రకటించారు. డీలిమిటేషన్ వంటి కీలక అంశంలో స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మరి ఏమి చేయాలి?
ఈ మూడు పార్టీలు డీలిమిటేషన్‌పై ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఏ విధమైన డీలిమిటేషన్ నైతికంగా సరైంది కాదు. పార్టీల నాయకత్వం అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పటికే రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా పోయింది. ఇంకా కొన్ని కేంద్ర సంస్థల జాడలేదు. రాష్ట్రం ఇప్పటికే కనీసం ఓ తరం వెనక్కిపోయింది. ఇప్పుడు లోక్ సభ సీట్లు కూడా పోతే రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ఇప్పటి వరకు ఈ అంశంపై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు రామకృష్ణ.
స్టాలిన్ పెట్టిన మీటింగ్ కి మొహం చాటేసిన పార్టీలు
డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవల చెన్నైలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు గైర్హాజరు అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది.
ఇది నిర్లక్ష్యమా? లేక వ్యూహాత్మక మౌనమా?
ఈ మూడు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో వైరం పెంచుకోవాలని అనుకోవడం లేదు. అన్యాయం జరుగుతుందనే భయం ప్రజల్లో నెలకొని ఉన్నప్పుడు కూడ సైలెంట్ గా ఉండడం ఏమిటీ అని ప్రశ్నించారు పౌరహక్కుల సంఘం నాయకుడు ఎం.శేషగిరిరావు. స్టాలిన్ చేసిందో మంచి ప్రయత్నమని, ప్రజల భావోద్వేగాలను గమనంలోకి తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోతే ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుందని శేషగిరి అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద ఈ మూడు రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీ వైఖరిని ప్రశ్నించేందుకు వెనకాడుతున్నాయనేది బహిరంగ సత్యమే. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పరోక్షంగా వాదనలు వినిపిస్తున్నా, బహిరంగంగా వాటిని వ్యక్తీకరించడంలో జంకుతున్నాయి.
స్టాలిన్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పార్టీల నేతలు వెళ్లకపోవడం వారి రాజకీయ సంకోచాన్ని సూచిస్తోంది. "బీజేపీకి భయపడుతున్నాయా?" అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
ఈ మూడు పార్టీలు బీజేపీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొత్తులో ఉన్న నేపధ్యంలో, కేంద్రం ప్రతిపాదించే డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా నిలవడానికి సాహసం చేయడం లేదు.
కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా లాభదాయకం కాదని ఈ పార్టీలు భావించవచ్చు. ఇవి రాజకీయ లెక్కలు కావొచ్చు, కానీ ప్రజా ప్రయోజనాలకంటే అవి మించినవిగా ఉండకూడదు.
పన్నుల పంపక వ్యవస్థను మరింత సమతుల్యంగా మార్చాలి. రాష్ట్రాల ఆదాయ సృష్టి సామర్థ్యాన్ని, పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకునే విధానం అవసరం. అదే విధంగా, డీలిమిటేషన్ విషయంలో కూడా కేవలం జనాభా ఆధారంగా కాకుండా అభివృద్ధి, పాలన నాణ్యత వంటి అంశాలను పరిగణించాల్సిన అవసరం ఉంది. ఏపీ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేసినట్టు డీలిమిటేషన్ ను మరో 25 ఏళ్లు వాయిదా వేయడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.