అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, తాము పది సంవత్సరాలుగా అక్టోబరు ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నామని రాయలసీమ సాధన సమితీ అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆయన ఫెడరల్‌తో మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ హక్కుల పత్రం వెలువడిందని, అందువల్ల అక్టోబరు 1వ తేదీనే ఆంధ్రరాష్ట్రం పుట్టిన రోజు జరుపుకోవాలన్నారు. గౌరవంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ అక్టోబరులోనే నిర్వహించాలని అందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది నవంబరు 1న కాబట్టి నవంబరు 1నే రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలనే ఆలోచన చేయలేదా? ఏ తేదీన చేయాలనే సందిగ్ధంలో అసలు వద్దనుకున్నారా? అనే అంశం స్పష్టం చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినందున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1నే జరగాలని జనచైతన్య వేదిక అధ్యక్షులు వి లక్ష్మణరెడ్డి అన్నారు. ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పటి లాగే నవంబరు ఒకటిన నిర్వహించాలన్నారు. జూన్ 2వ తేదీ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడాల్సిన రోజు కాబట్టి ఆరోజున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం మంచిది కాదన్నారు.
స్వాతంత్య్రానంతరం 1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రం నాడు దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశారు. అక్టోబరు 1న రాష్ట్ర అవతరణ నిర్వహిస్తూ వచ్చారు. ఆ తరువాత హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంతో నవంబరు 1 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నాటి నుంచి నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
సుమారు ఆరు దశాబ్ధాల పాటు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పాలకులు గడిచిన దశాబ్ధ కాలంగా అయోమయానికి గురయ్యారు. వాస్తవానికి నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలి. లేదా జూన్ 2న అయినా నిర్వహించి ఉండాలి. ఈ రెండూ జరగలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం విషయంలో పాలకులు, ప్రతిపక్ష నేతలు ఎంత అయోమయంలో ఉన్నారోననే దానికి ఇదే దర్పణం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవంపై శుభాకాంక్షలు తెలిపారు. ఏమన్నారంటే.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
నవంబరు 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. ఆయన ఫెడరల్‌తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోలేదని, తెలంగాణ మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో నుంచి విడిపోయిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ నవంబరు 1నే జరుపుకోవాలని అన్నారు.