ఆంధ్రాలో ప్రభుత్వ విద్యుత్ దారుణాలకు అంతులేదా!

2004 నుంచి 2019 వరకు వినియోగదారులు వాడిన విద్యుత్ కు దాదాపు రూ.56,735 కోట్లు ప్రజల గోళ్లు ఊడగొట్టి జగన్ ప్రభుత్వం కట్టించింది : సిపిఎం నేత కందారపు మురళి

Update: 2024-01-31 13:41 GMT
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్కరణలు అంటే ముక్కుపిండి అధిక చార్జీలు వసూలు చేయడమే

ఆంధ్ర రాష్ట్రంలో వినాశకర విద్యుత్ సంస్కరణలను ఆపాలని ఈ పేరుతో ప్రజలపై జరుగుతున్న దాడిని నివారించాలని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి అభిప్రాయపడ్డారు. బుధవారం నాటి ఉదయం రెగ్యులేటరీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఇ కార్యాలయం నుంచి కందారపు మురళి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

రానున్న ఆర్థిక సంవత్సరానికి డిస్కాములు 1387 కోట్ల ఆదాయ లోటును చూపాయని ఈ లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పకుండా దొడ్డి దారిన వినియోగదారులపై భారాలు గతంలో లాగే వేస్తారని దీన్ని అనుమతించవద్దని కందారపు మురళి కోరారు. 




 రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఇవ్వాల్సిన పాతికవేల కోట్ల రూపాయలను బకాయి పెట్టడంతో డిస్కములు అధిక వడ్డీకి రుణాలు తీసుకుని సంక్షోభంలో కూరుకు పోయాయని ఈ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయని ఆరోపించారు.


విద్యుత్ రంగం లక్ష కోట్ల రుణాల ఉచ్చులో కూరుకుపోయిందని ఆయన తెలిపారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రభుత్వ ఖజానా నుండి వేల కోట్ల రూపాయలు అదానీ గ్రూపు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఇతర ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందని దీన్ని అడ్డుకోవాలని ఆయన కోరారు.

వినియోగదారుల అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం చెల్లదని ఆయన వాదించారు. ప్రజాధనం వృధా కాకుండా నివారించేందుకు అవసరం లేని స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటును కమీషన్ అనుమతించ వద్దని కోరారు.

కమిషన్ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటంలో విఫలమైందని స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తిరస్కరించాలని ఆయన కోరారు. ట్రూ అప్ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం పేర్లతో ఒక్క యూనిట్ పై రూ. 2. 89పై లు ఈ కాలంలో పెరిగిందని ఆయన తెలిపారు.

వైసీపీ నాలుగేళ్ల పాలనలో రూ. 25 వేల కోట్లు అదనంగా భారం వేశారని చెప్పారు. 2004 నుంచి 2019 వరకు వినియోగదారులు వాడిన విద్యుత్ కు దాదాపు రూ.56,735 కోట్లు ప్రజల గోళ్లు ఊడగొట్టి కట్టించారని విమర్శించారు.

విద్యుత్ బిల్లు 2022 పేరిట రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం ప్రయోగశాలగా మార్చేసిందని అన్నారు. అదనపు అప్పుల కోసం విద్యుత్ రంగాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వం జనం కళ్ళుగప్పి కొత్త కొత్త భారాలు వేస్తున్నదని ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ ఛార్జీలు, విద్యుత్ సుంకం, సర్దుబాటు చార్జీలు, ఇంధన చార్జీలు, అదనపు డిపాజిట్ పేరుతో ప్రజల పై తీవ్రమైన భారాలు మోపుతున్నదని విమర్శించారు.

అదానీతో కుమ్మక్కై విదేశీ బొగ్గు పేరిట స్వదేశీ బొగ్గును వాడుతున్నారని, వేల కోట్ల రూపాయలు అదానీ సంస్థకు చెల్లిస్తున్నారని 30 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం జరిగిందని అన్నారు. తాజాగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో ఒప్పందాలు చేసుకున్నారని ఇది భారీ అవినీతి అని దీనిపై విచారణ జరిపించాలని కోరారు.

విద్యుత్తు సంస్థ పటిష్టతకు కృషి చేసిన కాంట్రాక్ట్ కార్మికుల పట్ల, మీటర్ రీడర్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, హమాలీలు, పీస్ రేట్ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కావడం లేదని, విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన కోరారు.

కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, తిరుపతి.


Tags:    

Similar News