బడ్జెట్ ప్రసంగాన్నీ ప్రశాంతంగా వినరా?

ఏపీ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్నైనా ప్రశాంతంగా సాగనిస్తారా లేదా అనే అనుమానం అధికార వైసీపీని వెంటాడుతుంటే ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ చూస్తోందా?

Update: 2024-02-07 04:33 GMT
Assembly of ap

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజూ గందరగోళంగానే సాగాయి. సభ ప్రారంభం నుంచే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానానికి అనుమతించకపోవడంతో.. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ఎంత చెప్పినా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో 13 మంది సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్‌ చేశారు స్పీకర్‌. ఇక ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీన్నైనా సభ్యులు ప్రశాంతంగా వింటారా లేక గందర గోళం చేస్తారా అనే సందేహం నెలకొంది.

నిన్న ఇలా మొదలై అలా సాగింది...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రెండోరోజూ నిరసనల పర్వం కొనసాగింది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం దాన్ని తిరస్కరించడంతో సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

పేపర్లు చించి స్పీకర్ పైకి విసిరి...

ధరల పెరుగుదలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు.. దీంతో స్పీకర్‌ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. ధరల పెరుగుదల, పన్నుల పేరిట ప్రజల్ని బాదుతున్నారంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.. దీంతో సభను 15 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతోపాటు స్పీకర్‌ పోడియంపైకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించి స్పీకర్‌పైకి విసిరారు. అయితే.. స్పీకర్‌పైకి పేపర్లు విసిరేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది వైసీపీ.

ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఏపీ ప్రభుత్వం ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు-2024ను సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సభలోనే ఈలలు వేస్తూ నిరసన చేపట్టారు. దాంతో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్‌ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు.

ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వాయిదా తీర్మానానికి పట్టుబడితే తమను సస్పెండ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్‌ చేసి తమ గొంతు నొక్కలేరని.. ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు బుచ్చయ్య చౌదరి.

బుధవారం అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది జగన్‌ జర్కారు. దాదాపు 3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మూడు నెలల బడ్జెట్‌కు ఈ సమావేశాల్లో ఆమోదం లభించనుంది. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుంది.

Tags:    

Similar News