చంద్రబాబు, జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మాజీ సీఎం జగన్ కానీ డీలిమిటేషన్ పై పట్టీ పట్టనట్లు ఉండటంలో అంతరార్థం ఏమిటనే చర్చ ప్రజల్లో మొదలైంది.;

Update: 2025-03-22 11:47 GMT

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి. ఆ నిధులు ఏ ప్రాతిపదికన వస్తాయంటే జనాభా ప్రాతిపదికన అని చెప్పక తప్పదు. జనం లేకుండా అక్కడ నిధులు ఖర్చు పెట్టటం ఎందుకనే చర్చ వస్తుంది. అయితే భారత ప్రభుత్వం అధిక జనాభాను అరికట్టే చర్యల్లో భాగంగా 1971లో జనాభా నియంత్రణ చేపట్టాలని పిలుపు నచ్చింది. అప్పట్లో కొందరిని బలవంతంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లు ప్రభుత్వం వైద్య సిబ్బంది ద్వారా చేయించింది. జనాభా నియంత్రణ అనే పదం బాగుండలేదనే భావనతో ప్రభుత్వం ‘కుటుంబ సంక్షేమం’ అనే పదాన్ని తీసుకొచ్చింది. దక్షిణ భారత దేశంలో కేంద్రం పిలుపును అనుసరిస్తూ స్వతహాగానే ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గరు వద్దే వద్దంటూ నియంత్రణ పాటించారు. ఎప్పుడైతే కుటుంబ సంక్షేమాన్ని పాటించడం మొదలు పెట్టారో జనం పెరుగుదల అదుపులోకి వచ్చింది.

ఉత్తరాదిలో ఏమైంది?

కేంద్రం ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సంక్షేమ పథకాన్ని ఉత్తరాది ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సుమారు 50 ఏళ్లలో అక్కడి జనాభా సగానికి సగం పెరిగింది. దక్షిణాదిలో రెండింతలు కూడా పెరగలేదు. జనాభా పెరిగిన కారణంగా ఉత్తరాదిలో కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తరాదికి లాభించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేయని వారికి ఎక్కువ నిధులు ఇస్తూ, ప్రభుత్వ చట్టాన్ని సకాలంలో సక్రమంగా అమలు చేసిన వారికి కనీసపు నిధులు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పలువురు దక్షిణాది రాష్ట్రాల పాలకులు, ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు.

కుటుంబ సంక్షేమం వల్లే దక్షిణాదిలో అభివృద్ధి

జనాభా పెరుగుదలను అదుపులో పెట్టుకోవడం వల్ల స్థానిక సంస్థల్లో కానీ, పారిశ్రామిక రంగం, వ్యవసాయ, ఇతర రంగాల అభివృద్ధి సాధ్యమైందనే దక్షిణాది పాలకులు చెబుతున్నారు. ఉత్పత్తిని సాధించడంలో ముందుండటం, కనీస సౌకర్యాల కల్పనలోనూ ముందుండటం వల్ల సౌత్ ఇండియా అన్ని రంగాల్లో అనుకున్న అభివృద్ధిని సాధించ గలిగింది. అలాంటప్పుడు ఇంకా మంచి అభివృద్దిని సాధించేందుకు నిధులు సమకూర్చాల్సిన కేంద్రం పట్టీపట్టనట్లు ఉందని, పైగా ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పాలకులకు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు లేకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తోందని దక్షిణాది పాలకులు అంటున్నారు. జనాభా ప్రాతిపదికనే డీ లిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశం పూర్తిగా నష్టపోతుందని భావిస్తున్నారు.

జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు

తమిళనాడు పాలకులు డీలిమిటేషన్ ను సవాల్ గా తీసుకున్నారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ప్రాతిపదికనే పునర్విభజన జరిగితే ఉత్తరాదిలో 50 శాతం సీట్లు పెరిగితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వ పెద్దలు పెద్దరికం తీసుకుని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని ఎన్డీఏ వ్యతిరేక కూటములు, పార్టీలకు ఆహ్వానం పంపించారు. అఖిల పక్ష సమావేశానికి హాజరై అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇంకా పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఎందుకు లేదు?

తమిళనాడులో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను తమిళనాడు ప్రభుత్వ ప్రతిధులు కలిసి ఆహ్వానించారు. అయినా జగన్ సమావేశానికి హాజరు కాలేదు. పైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకించి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించింది డిఎంకే నాయకులు, లేఖ రాసింది బీజేపీ ప్రభుత్వ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి. దీని వెనుక ఏముంది? ఎందుకు ఈ విధంగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు. పైగా ఈ లేఖను పార్లమెంట్లో వైఎస్సార్సీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ద్వారా తమిళనాడులో జరిగే అఖిల పక్ష సమావేశానికి కూడా పంపించారు. దక్షిణ భారత దేశానికి డీ లిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని, జనాభా ప్రాతిపదికన తీసుకుని డీలిమిటేషన్ సౌత్ ఇండియాలో చేయొంద్దని లేఖలో పేర్కొన్నారు. సౌత్ ఇండియాకు సంబంధం లేని ముఖ్యమంత్రులు వచ్చినా ఇక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సమావేశానికి వెళ్లే ఓపిక, తీరిక లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో భాగస్వామి కాబట్టి ఆయనకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదు. డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు కూడా అన్యాయం జరుగుతుంది. అందుకే సమావేశానికి వెళ్లి తన అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది. కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ పెద్దలు ఏమంటారోననే భయంతోనే ఆయన నోరు విప్పటం లేదని, ఇందువల్ల భవిష్యత్ లో జరిగే అనర్థాలకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటున్నారు. దక్షిణ భారత దేశానికి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఏపీలోని కమ్యూనిస్టు పార్టీల నాయకులతో పాటు పలు ప్రాంతీయ పార్టీలు చెబుతున్నాయి.

స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నమ్మిన వ్యక్తులుగా ఉన్నారనే ప్రచారం ఉంది. అందులో నిజం కూడా ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ ఏరోజూ ప్రధాన మంత్రిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మాకు కావాల్సినవి ఇవి అని ప్రత్యేకించి అడగ లేదు. రాష్ట్ర విభజన హామీలు కూడా అమలు చేయించుకోలేక పోయారు. అందుకు ప్రధాన కారణం ఆయనపై ఉన్న కేసులేననే చర్చ జరుగుతోంది. కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి వస్తే తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలనే ఆలోచనకు జగన్ వచ్చి ఉంటారని, లేదంటే ఇంతగా ప్రధాన మంత్రికి మోకరిల్లాల్సిన అవసరం ఏమిటనే చర్చ కూడా ఉంది. ఒక వేళ బెయిల్ రద్దు చేస్తే పరిస్థితి ఏమిటనేది కూడా జగన్ ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉంటారనే చర్చ కూడా ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పేవి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. డీలిమిటేషన్ కు ఏపీ వ్యతిరేకం అనే సాహసం చేయలేకపోతున్నారు. కూటమిలో భాగస్వామి కావడమే కాకుండా తనపై కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ముఖ్యమంత్రి కూడా బెయిల్ పైనే ఉన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా బెయిల్ రద్దయిదంటే పరిస్థితి తారు మారవుతుందని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందనే భావనను పార్టీలోని కొందరు ముఖ్యుల వద్ద చంద్రబాబు వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఆయన మాట్లాడలేకపోతున్నారనే ప్రచారం ఉంది.

ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు డీలిమిటేషన్ విషయంలో నోరు మెదపకపోవడం, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి సహకరించకపోవడం చర్చగా మారింది. రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైందని, ఇకపై కేంద్రం నీడ కింద బతకాల్సిన పరిస్థితిని పాలక ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తాయని పలువురు రాజకీయ మేధావులు అంటున్నారు.

మావిధానం మాకుంది: పవన్ కల్యాణ్

ఏపీ ఉప ముఖ్యమంత్రి కేంద్రంలోని బీజేపీని భుజాలకు ఎత్తుకుని ఉన్నందున ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడే అవకాశం లేదు. బీజేపీ వ్యూహం ఏమిటో అదే హ్యూహంలో ముందుకు వెళతారు. చెన్నైలో డీఎంకే నిర్వహించిన సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం అందిందని, అయితే తాము సమావేశానికి హాజరు కాలేమని అప్పుడే వారికి సమాచారం ఇచ్చామని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ తరపున సమావేశానికి వెళ్లినట్లు వచ్చిన సమాచారం ఊహాగానాలు మాత్రమేనని, సమావేశంలో పాల్గొనాల్సిందిగా డిఎంకే తరపున ఆహ్వానం వచ్చిందని, వేర్వేరు కూటములుగా ఉన్నందున సమావేశంలో పాల్గొనటం లేదని చెప్పినట్లు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే తమ అభిప్రాయాలు తమకు ఉన్నాయన్నారు. మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలకు రావడం ఈ ప్రజల దౌర్భాంగ్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News