నేను కానీ హోం శాఖను తీసుకున్నానంటే.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, ఆయన చేపట్టిన విధానాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన పవన్‌ కళ్యాణ్‌.

Update: 2024-11-04 10:55 GMT

నేను హోం శాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులందరికీ నేను ఈ రోజు చెబుతున్నా.. జాగ్రత్తగా ఉండండి, వీరిపైన హోం మంత్రి అనిత ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలానే ఉంటే, ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే..తాను హోం శాఖ బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.. గుర్తు పెట్టుకోండి.. అరాచక శక్తులను అరికట్టడానికి ధైర్యం లేనప్పుడు పోలీసులు ఉండటం ఎందుకు? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి? నాయకులు ఉన్నది ఓట్లు అడగడానికేనా? బాధ్యతలు నిర్వర్తించడానికి కాదా? నేను అడగ లేక కాదు.. లేక హోం శాఖను తీసుకోలేక కాదు.. నేను హోం శాఖను తీసుకుంటే పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి.. యుపీలో ఆదిత్యనాథ్‌ చేసినట్లు చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ యుపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, ఆయన తీసుకున్న చర్యలను మెచ్చుకుంటూ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించడం విశేషం.

రాష్ట్రంలోని పోలీసులపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ పాలనలో ఒక ఎస్పీ తనపై జులుం ప్రదర్శించాడని వెల్లడించారు. ప్రజలకు అభివాదం చేస్తుంటే, కూర్చోమంటూ తనను భయపెట్టే ప్రయత్నం చేశాడని అన్నారు. ఒక రేపిస్టును ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పినవాడ్ని ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. మాకు ఈ అన్యాయం జరుగుతోంది అని సోషల్‌ మీడియాలో పెడితే, అన్యాయానికి కారకులైన వారిని అరెస్టులు చేయకుండా ఎందుకు వదిలేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలన తాలూకు ఫలితాలు, అప్పులు వారసత్వంగా వచ్చినట్లే.. నేరాలు కూడా అలాగే వారసత్వంగా వచ్చాయన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ను బలంగా అమలు చేయండి అని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చెబుతున్నాని, కానీ పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు నియంత్రణలో లేకుండా చేసేశారని మండి పడ్డారు. ఇప్పుడేమో ధర్మబద్ధంగా శాంతిభద్రతలు అమలు చేయమంటుంటే ఆలోచిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
నేరస్తులకు కులం ఉండదు, క్రిమినల్స్‌కు మతం ఉండదని పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి? అని ప్రశ్నించారు. ఒకడ్ని అరెస్ట్‌ చేయాలంటే కులం సమస్య వస్తుందంటారు, కులం సమస్య ఎందుకు వస్తుందని మండిపడ్డారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్‌ చేస్తే కులాన్ని వెనుకేసుకొస్తారా? ఏం మాట్లాడుతున్నారని మీరు? మీరు ఐపీఎస్‌ చదివారు కదా, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఏం చెబుతోంది మీకు? క్రిమినల్స్‌ ను వెనకేసుకురమ్మని భారతీయ శిక్షా సృతి చెబుతోందా? అని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు మారాలంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
డీజీపీకి, పోలీసు అధికారులకి, ఇంటెలిజెన్స్‌ అధికారులకు, జిల్లా ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు చెబుతున్నాను అని అంటూ అభివృద్ధికి లా అండ్‌ ఆర్డర్‌ చాలా కీలకమైనదన్నారు. హోంశాఖ మంత్రి అనితకి విజ్ఞప్తి చేస్తున్నాని చెబుతూ, వైసీపీ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రౌడీల్లా వ్యవహరిస్తుంటే ఏమి చేస్తున్నారని అనితను ప్రశ్నించారు. ఆడబిడ్డలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా అని అనితను ప్రశ్నించారు. బాధ్యతగా వ్యవహరించాలని, చట్టపరంగా బలంగా వ్యవహరించాలని సూచించారు.
తాను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రినని, హోం మంత్రిని కాదన్నారు. కానీ పరిస్థితి చేయిదాటితే తానే హోం శాఖను తీసుకుంటానని హెచ్చరించారు. నేను హోంశాఖను తీసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లా వ్యవహరిస్తానన్నారు. తనకు డిప్యూటీ సీఎం పదవి పోయినా ఫర్వాలేదు, ఎమ్మెల్యేగా పోయినా పర్వాలేదు ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఆవేశంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వచ్చి రేప్‌లు చేస్తామని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అది భావప్రకటనా స్వేచ్ఛ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అంటున్నారని, తెగేదాకా లాగకండిని హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి సహనం ఎంతుంటుందో, తెగింపు కూడా పదింతలు ఎక్కువ ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టే సంయయనం పాటిస్తున్నామని లేకుంటే చేతకాక కాదని పవన్‌ కళ్యాణ్‌ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.
Tags:    

Similar News