ఇప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్న నాయకుడు నేడు తిరువూరు వైసీపీ అభ్యర్థి
అమరావతిలో దళిత ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడు తెలుగుదేశం అభ్యర్థి
ఎవరిని స్వాగతించాలో అర్థంకాని ఓటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో తిరువూరుకు ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలను సమానంగా గౌరవిస్తుంటారు ఇక్కడి ఓటర్లు. ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు ఎక్కువ. సుమారు 35వేల వరకు ఉన్నాయి. ఇక్కడి నుంచి హేమాహేమీలు గెలిచారు. కోనేరు రంగారావు కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయారు. 1989, 2004లో కోనేరు గెలిచి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తిరువూరు 1955లో ఏర్పడిన నియోజకవర్గం. 1955, 1962, 1970 సంవత్సరాల్లో జనరల్ నియోజకవర్గంగా ఉంది. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎవరు?
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్‌ను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొక్కిలిగడ్ల రక్షణ నిధి ఉన్నారు. ఆయనను కాదని పది రోజుల క్రితం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన స్వామిదాస్‌కు టిక్కెట్ ఇచ్చారు. ఈయన స్థానికుడు. స్వామిదాస్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా మూడు సార్లు ఓడిపోయి రెండు సార్లు గెలిచారు. రెండు సార్లు కోనేరు రంగారావును ఓడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా స్వామిదాస్ పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా కోనేరు పోటీ చేశారు. స్వామిదాస్ గెలుపు 1994, 1999ల్లో జరిగింది. ఆ తరువాత వరుసగా మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు కాంగ్రెస్ చేతిలో, మరో మారు వైఎస్సార్‌సీపీ చేతిలో ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో స్వామిదాస్‌కు టీడీపీ టిక్కెట్ ఇవ్వకుండా మాజీ మంత్రి జవహర్‌కు టిక్కట్ ఇచ్చింది. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రక్షణనిధి చేతిలో ఓడిపోయారు. ప్రజలతో మమేకమై తిరగనందునే ఈ స్థితి వచ్చిందని స్థానికులు వ్యాఖ్యానించడం విశేషం. తిరిగి ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తరపున స్వామిదాస్ రంగంలోకి దిగారు. వరుసగా నాలుగు సార్లు ఓటమి చెందిన స్వామిదాస్‌ను తిరిగి వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించడం పలువురిలో చర్చకు దారితీసింది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నానీ)కి అనుంగు శిశ్యుడు. రాజకీయంగా వీరి ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవు. అందుకే నానీ వైఎస్సార్‌సీపీలో చేరగానే స్వామిదాస్ కూడా ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీలో చేరారు.
టీడీపీ నుంచి అమరావతి దళిత ఉద్యమ నాయకుడు
తెలుగుదేశం పార్టీ నుంచి కొలికిపూడి శ్రీనివాసరావును చంద్రబాబు నాయుడు తిరువూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సారి స్వామిదాస్‌కు టిక్కెట్ లేదనే ప్రచారం సాగింది. ముందు నుంచే శ్రీనివాసరావును నియోజవర్గం చూసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ మేరకు శ్రీనివాసరావు తిరువూరులో తిరగటం మొదలు పెట్టారు. అయితే స్థానిక నాయకుల నుంచి ఆయనకు తగిన ఆదరణ రాలేదని చెప్పొచ్చు. స్వామిదాస్ ఎప్పుడైతే వైఎస్సార్‌సీపీలో చేరాడో అప్పటి నుంచి శ్రీనివాసరావు టీడీపీకి దిక్కయ్యారు. లోకల్ లీడర్స్ కూడా కాస్త మెత్తబడి కొలికిపూడిని స్వాగతిస్తున్నారు. కొలికిపూడి కొత్తగా పోటీలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు అమరావతిలో జరుగుతున్న ఉద్యమంతో పాటు అమరావతి రాజకీల్లోనూ అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీ దళిత నాయకులను, కార్యకర్తలను కలుపుకుని అమరావతి రాజధాని కావాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమంలో ముందుభాగాన నిలిచారు. ఈయన మూడు రోజుల క్రితం తిరువూరులో తలకు తలగడ చుట్టుకుని సైకిల్‌పై వీధుల్లో తిరిగారు. ఎవ్వరు కూడా శ్రీనివాసరావుగా గుర్తించకపోవడం విశేషం. స్థానికంగా వుంటూ మొదటి నుంచీ సీటు ఆశిస్తున్న దేవదత్ కూడా ఫిబ్రవరి 29న జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా స్వాగతించారు.
మూడు సార్లు ఓడిన వానికి టిక్కెట్
వైెఎస్సార్సీపీ వారికి అభ్యర్థి దొరకలేదు. మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన స్వామిదాస్ వారికి అభ్యర్థి అయ్యాాడు. ఇంతకంటే మంచి నాయకుడు వైెస్సార్సీపీకి దొరకకపోవడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని చెప్పాలి. తిరువూరు ఓటర్లు స్వామిదాస్ ను నమ్మడం లేదు. లేకుంటే ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతాడో ఆలోచించాల్సి వుంది. జనంలో లేనప్పుడు ఎన్ని చేసినా ఫలితం వుండదు.
యండ్రాపి కిరణ్, టౌన్ కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ.
నాన్ లోకల్
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాన్ లోకల్. సమస్యలపై అవగాహనలేదు. స్థానికుల గెలుపు ఖాయంగా వుంటుంది. అందుకే వైెఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని నేను భావిస్తున్నాను. వైెఎస్సార్ వాళ్లు కూడా ాలోచించి అందుకే టిక్కెట్ ఇచ్చారు. స్థానిక సమస్యలు ఏంటో తెలియకుండా నాయకుడు అయ్యాడంటే ఎంతో మేధావి అయి ఉండాలి.
వాళ్ల సురేష్, తిరువూరు మండల వైెఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు.