సీఐడీ విచారణకు హాజరు కాలేను..రామ్‌గోపాల్‌ వర్మ

సినిమా వర్కు ఉంది. 8 వారాలు సమయం కావాలి. తర్వాత తేదీ చెబితే ఆ ప్రకారం విచారణకు వస్తానని ఆర్జీవీ పోలీసులను కోరారు.;

Update: 2025-02-10 06:05 GMT

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కేసులు, విచారణ అంశం తెరపైకి వచ్చింది. సీఐడీ విచారణకు హాజరు కాలేనంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పోలీసులను కోరడంతో మరో సారి రామ్‌గోపాల్‌ వర్మ చర్చనీయాంశంగా మారారు. సినిమా వర్కులో తాను బిజీ ఉండటం వల్ల సోమవారం సీఐడీ విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై సీఐడీ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కూటమి అధికారం చేపట్టాక రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా పోస్టుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌ సందర్భంగా సోషల్‌ మీడియాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌ల మీద అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో రామ్‌గోపాల్‌ వర్మ మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేశారు. వీటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల మీద అనుచిత వాఖ్యలు, అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారని మద్దిపాడుకు చెందిన టీడీపీ నాయకుడు రామలింగం చేసిన ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ వెళ్లి ఆర్జీవీకి స్వయంగా నోటీసులు అందజేశారు.
అయితే విచారణకు హాజరు కాకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తొలుత నిరాకరించిన హైకోర్టు తర్వాత ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని రామ్‌గోపాల్‌ వర్మను హైకోర్టు ఆదేశించింది. హై కోర్టు ఆదేశాల మేరకు మద్దిపాడు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌గోపాల్‌ వర్మ మద్దిపాడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్‌ సీఐ శ్రీకాంత్‌బాబు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. దాదాపు 9 గంటల పాటు విచారణ చేపట్టారు. మరో సారి విచారణకు హాజరు కావలసి ఉంటుందని అదే సమయంలో పోలీసులు రామ్‌గోపాల్‌ వర్మకు సూచించారు.
ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ పోలీసులు కూడా రామ్‌గోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10న గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు మద్దిపాడుకు వచ్చిన సందర్భంగా ఆర్జీవీని కలిసి అక్కడే సీఐడీ పోలీసులు నోటీసులు అందించారు. రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియా పోస్టుల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరు సీఐడీ పోలీసుల విచారణకు రామ్‌గోపాల్‌ వర్మ హాజరు కావలసి ఉంది. కానీ తాను విచారణకు హాజరు కాలేనని సీఐడీ పోలీసులకు సమాచారం అందించారు. తన సినిమా వర్కులో బిజీగా ఉన్నానని, ఈ నెల 28న సినిమా విడుదల ఉందని, దీంతో ఆ పనిలో తాను బిజీగా ఉన్నానని, దీంతో తనకు 8 వారాల సమయం కావాలని, ఆ తర్వాత డేట్‌ను ఇస్తే ఆ మేరకు విచారణకు హాజరు అవుతానని గుంటూరు సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ తిరుమలరావుకు రామ్‌గోపాల్‌ వర్మ వాట్సాప్‌ ద్వారా తెలియజేశారు.
Tags:    

Similar News