తిరిగొచ్చిన చంద్రన్న..‌ ఇక కౌటింగే మిగిలిందన్నా!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. పోలింగ్ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బాబుకు కార్యకర్తలు, అభిమానులు..

Update: 2024-05-29 06:50 GMT

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రలో పోలింగ్ పూర్తయిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బాబుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను కలిసి భేటీ అయ్యేందుకు కూడా నేతలు ఉత్సాహం కనబరిచారు. కానీ పర్యటన బడలిక తీర్చుకుని ఈ రోజు సాయంత్రం నేతలతో సమావేశం అవతానని చంద్రబాబు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అక్కడి ఏర్పాట్లును పరిశీలించడానికి, కౌంటింగ్ సమయంలో పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి అండగా ఉండటానికే చంద్రబాబు తన పర్యటనను వీలైనంత త్వరగా ముగించుకుని వచ్చారని పార్టీ వర్గాలు చెప్పాయి.

కౌంటింగ్ కోసమే..

ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కోసం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే బాబు తిరిగొచ్చేశారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. జీవితంలో గెలుపోటములు సహజమని ఎన్నికల్లో ఏ నిర్ణయం వచ్చినా తట్టుకునేలా పార్టీ నేతలను సిద్ధం చేయడానికి, వారికి ధైర్యం చెప్పడానికే చంద్రబాబు అనుకున్న సమయానికన్నా ముందుగానే పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారని పార్టీ వర్గాలు వివరించాయి.

నేతలతో భేటీకి సిద్ధం

ఈ సమయంలోనే చంద్రబాబుతో భేటి కావడానికి అనేక మంది నేతలు ఉత్సాహం కనబరుస్తున్నారు. కాగా ఈరోజు సాయంత్రం వారితో భేటి కావడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో మే 19 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న అంశంపై చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ దాడులపై కూడా ఆయన పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి బాబు ప్రయత్నించనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే విదేశీ పర్యటనలకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరో రెండు రోజుల్లో ఆంధ్రకు తిరిగి రానున్నట్లు సమాచారం. ఆయన కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారని తెలుస్తోంది. వారికి ధైర్యం చెప్తారని సమాచారం. అంతేకాకుండా ఐప్యాక్ టీమ్‌తో కూడా మరోసారి భేటీ కావొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News