అమరావతిలో ఎటు చూసినా ఐకానిక్సే, హైటెక్సే!!
ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడాయన ఐకానిక్ టవర్లుగా పిలిచే బహుళ అంతస్తుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు.;
By : The Federal
Update: 2025-04-17 05:21 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి స్టైలే వేరు. ఆయన ఏది చేసినా హైటెక్ లెవెల్లోనే ఉంటుంది. ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడాయన ఐకానిక్ టవర్లుగా పిలిచే బహుళ అంతస్తుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టవర్ల కోసం ఆయన వివిధ దేశాల్లోని వందలాది భవంతుల్ని పరిశీలించారు. ఇప్పుడూ నిర్ణయానికి వచ్చారు. తొలి విడతలో ఆయన శాశ్వత సచివాలయం, ప్రభుత్వ విభాగాలకు ఆఫీసులు నిర్మించాలని తలపెట్టారు. ఈమాటే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థకు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది.
మొత్తం ఐదు టవర్లను నిర్మిస్తారు. మూడు ప్యాకేజీల కింద విభజించారు. రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయం.
మేనెల 1న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు పంపుకోవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెరుస్తారు. ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే వాళ్లకి పనులు ఇవ్వాలన్నది సూత్రప్రాయ నిర్ణయం. చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2014లో అధికారంలోకి వచ్చినపుడే రూ.2,703 కోట్లతో టెండర్లు పిలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని కాస్తా అటకెక్కించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడీ ప్రాజెక్ట్ ను మళ్లీ వెలికితీశారు. ఈ ఐదేళ్ల కాలంలో అంచనా వ్యయం 73 శాతం పెరిగింది. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ కింద రూ.1,126.51 కోట్లతో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ టవర్ (జీఏడీ), రెండో ప్యాకేజీలో రూ.1,897.86 కోట్లతో సచివాలయం 1,2 టవర్లు.. మూడో ప్యాకేజీ కింద రూ.1,664.45 కోట్లతో 3, 4 టవర్లు నిర్మించాలన్నది ప్లాన్.
ఐకానిక్ టవర్ల ఆకృతులను ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. అన్నింటి కంటే ఎత్తుగా నిర్మించనున్న జీఏడీ టవర్ బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా ఉంటుంది. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. దీని టెర్రస్‌పై సీఎం ప్రయాణాల కోసం హెలిప్యాడ్ కూడా ఉంటుంది.
మిగిలిన 4 హెచ్‌ఓడీ టవర్లనూ 39 అంతస్తుల చొప్పున నిర్మిస్తారు. ఐకానిక్ టవర్ల మొత్తం విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. 60 వేల టన్నుల స్టీల్ పడుతుందని అంచనా.