ప్రతి పిల్లోడు బడిలోనే ఉండాలి.. అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్రంలో బడికి వెళ్లే వయసులో ఉన్న ఏ పిల్లోడు బయట ఉండకూడదని విద్యాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని, వాటిలో ప్రతి పిల్లోడు చదువుకునేలా చేయడం ప్రథమం అని చెప్పారు.

Update: 2024-08-13 14:33 GMT

రాష్ట్రంలో బడికి వెళ్లే వయసులో ఉన్న ఏ పిల్లోడు బయట ఉండకూడదని విద్యాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలని, వాటిలో ప్రతి పిల్లోడు చదువుకునేలా చేయడం ప్రథమం అని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోవడంపై కూడా ఆరా తీశారు. రాష్ట్రంలోని విద్యాశాఖ పనితీరుపై మంత్రుల సమక్ష్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఉన్న టీచర్ల కొరతను అధికారులు సీఎంకు వివరించారు. వెంటనే టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఎక్కడా కూడా టీచర్ల కొరత లేకుండా చూస్తామని, అందుకోసం వాలంటీర్ టీచర్లను నియమించుకోవాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాకుండా ఆ నియామకాలు ఎంత వరకు వచ్చాయో కూడా అడిగి తెలుసుకున్నారు.

ఉత్తమ ఫలితాలే లక్ష్యం

‘‘విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలి. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి. పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చుచేస్తోంది. క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలి. మారుతున్న కాలానికి అగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేయాలి. ఇందుకోసం విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి’’ అని సిఎం సూచించారు.

అవసరాన్ని బట్టి బోధన

‘‘విద్యార్థులకు బోధించే చదువు వారికి జీవితంలో ఉపయోగపడేలా ఉండాలి. వచ్చే 10 -20 ఏళ్లకు ఏమి అవసరమూ గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలి. విద్య ప్రతి ఒక్కరి హక్కు.. బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు. ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థుల 100 శాతం ఎన్రోల్మెంట్ జరగాలి. గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ జరగాలి’’ అని ఆదేశించారు.

 

అపార్ ద్వారా ఐడీ

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన APAAR (Automated permanent academic account registry) ద్వారా ప్రతి విద్యార్ధికి ఐడీ ఇవ్వాలి. ప్రైవేటు స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు పటిష్టంగా నిర్వహించాలి’’ అని సూచించారు. ఈ సందర్బంగా కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారని అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. వారందరినీ కూడా రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు.

మైదానాలను సద్వినియోగం చేసుకోవాలి

‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పెద్ద పెద్ద క్రీడా మైదానాలను సద్వినయోగం చేసుకుని పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలి. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలి. జీవో నెంబర్ 117పై అధ్యయనం చేయండి. ఈ విషయంలో విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక ఇవ్వాలి’’ అని చెప్పారు.

తెలుగుకు ప్రాధాన్యం

‘‘స్కూళ్లలో ఇంగ్లీష్‌తో పాటు మాతృభాష తెలుగుకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రోత్సహించింది గత తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ 2019-2024 మధ్య ఉన్న వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయి. ఆ డ్రాప్ అవుట్స్‌ను నియంత్రించాలి. ఆఖరికి పాఠశాలల్లో పనిచేసే ఆయాలకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. ఆ జీతాలను వెంటనే అందించాలి’’ అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వారికి అవకాశం ఇవ్వాలి

‘‘ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సిఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ది చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలి. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన వారు తమ పాఠశాల అభివృద్ధికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వాలి’’ అని వెల్లడించారు.

 

టీచర్లకు శిక్షణ

‘‘మధ్యాహ్న భోజనం అమలులో లోపాలకు తావులేదు. పిల్లలకు పెట్టే ఆహారంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విడివిడిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. దీని కోసం ఐవీఆర్ఎస్ విధానాన్ని అవలంభించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ అందించే డైట్ కాలేజీల్లో ఉన్న పెండింగ్ పోస్టులు భర్తీ చెయ్యాలి. టీచర్స్ కు కూడా నిరంతరం లీడర్ షిప్ ట్రైనింగ్ అందించాలి. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షల నిర్వహణ నిర్దేశిత ప్రమాణాలతో ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు.

ఒత్తిడితో ఉపయోగం లేదు: లోకేష్

ఈ సమావేశంలో భాగంగా విద్యాశాఖలో తీసుకొచ్చిన నూతన విధానాలు, సంస్కరణల గురించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. సీఎం చంద్రబాబుకు వివరించారు. ఒక క్లాసుకు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నామని, తద్వారా టీచర్లపై పడుతున్న అనవసర ఒత్తిడి తగ్గుతుందని, ఆ ఒత్తిడి వల్ల ఉపయోగం ఉందని వివరించారు. అంతేకాకుండా ఉపాద్యాయులపై యాప్‌ల భారం కూడా తగ్గించినట్లు వెల్లడించారు. అలాగని విద్యార్థులకు నాణ్యమైన భోధన, సేవలు అందించే విషయంలో రాజీ పడట్లేదని, ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో మాట్లాడి విద్యాశాఖలో నిర్ణయాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లు నిర్వహించాలని సీఎం అన్నారు. ఆ మీటింగులకు తనతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా హాజరవుతారని తెలిపారు. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షలపై ఏడాది చివర్లో థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయాలని సూచించారు. మొత్తం విద్యా వ్యవస్థను, రోజువారీ వ్యవహారాలను మోనిటర్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్స్ కార్డులో నమోదు చేయాలని సీఎం సూచించారు.

 

రాష్ట్రంలో స్కూళ్ల వివరాలు ఇలా

రాష్ట్రంలో మొత్తం 44,570 ప్రభుత్వ స్కూళ్లు, 813 ఎయిడెడ్ ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 10 మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలలు 5,520 కాగా 20 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లు 8,072 ఉన్నాయని వివరించారు. మొత్తం రాష్ట్రంలోని స్కూళ్లలో 70,22,060 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అందులో ప్రభుత్వ స్కూళ్లలో 35 లక్షల 13 వేల 533 మంది ఉండగా, ఎయిడెడ్ పాఠశాలల్లో 92,579 మంది, ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల 15 వేల 948 మంది విద్యార్థులు చదువకుంటున్నారు. ఇక టీచర్ల విషయానికి వస్తే.. ప్రభుత్వ స్కూళ్లలో 1,87,996 మంది టీచర్లు పని చేస్తుండగా, ఎయిడెడ్‌లో 3,396 మంది టీచర్లు ఉన్నారన్నారు. 2014-19 మధ్య విద్యావ్యవస్థలో ప్రధానమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏటా 4,026 ప్రతిభా అవార్డులు అందించామని, ఇందులో భాగంగా రూ.20 వేలు నగదు, మెడల్, ట్యాబ్ ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇదొక స్ఫూర్తిగా ఉంటుందని సీఎం చెప్పారు. డ్రాపౌట్స్ గల కారణాలపై లోతైన విచారణ చేసి నివారణపై ఫోకస్ పెట్టి పనిచేయాలని సూచించారు.

Tags:    

Similar News