ఆంధ్రాలో జగనన్న స్టీల్ రాజకీయాలు : కడప ముద్దు, వైజాగ్ వద్దా?

విశాఖ స్టీల్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపిస్తున్నదని మాజీ ఐఎఎస్ అధికారి డా. ఇఎఎస్ శర్మ అంటున్నారు .

Update: 2023-12-31 12:31 GMT
కడప జిల్లాలో జెఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు 2033 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. (సాక్షి ఫోటో)

డా. ఇఎఎస్ శర్మ


విశాఖ స్టీల్ కర్మాగారం, ఐదారు దశాబ్దాల క్రితం, ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేయడం కారణంగా వచ్చిన ప్రాజెక్టు. అప్పటిలో, ఏడుగురు రాష్ట్ర ఎంపీలు వారి పార్లమెంట్ సభ్యత్వం వదులుకుంటామని ఒత్తిడి పెట్టిన తర్వాత, కేంద్రం లొంగి విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి ఒప్పుకుంది. విశాఖ స్టీల్ వలన, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఎన్నో విధాలుగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అటువంటి ప్లాంటును ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయివేటైజ్ చేసే నిర్ణయం ఇక్కడి ప్రజలకు వెన్నుపోటు వంటిది.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్ ప్రభుత్వరంగం లోనే ఉంటుందని నమ్మించి, సుమారు 20,000 ఎకరాలను రైతుల వద్ద నుంచి, అప్పటి భూసేకరణ చట్టం క్రింద సేకరించింది. ఆ కారణంగా విశాఖ స్టీల్ ను ప్రైవేట్ చేయడం చట్ట విరుద్ధం అవుతుంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన పాత్ర ఉండటం దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే ప్రైవేటు కంపెనీలకు అప్పగించకూడదని, కేంద్రాన్ని నిలదీసే బదులు, మీ ప్రభుత్వం మౌనం వహించడం తగదు. 


డా. ఇఎఎస్ శర్మ , మాజీ కేంద్ర కార్యదర్శి

విశాఖ స్టీల్ ప్రయివటైజ్ చేసిన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకోచించకుండా వ్యతిరేకిస్తుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారు, కాని ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపించడం బాధాకరంగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల ఉద్దేశాలను గౌరవించని రాజకీయ పార్టీలను, ఇక్కడి ప్రజలు సమర్ధించరని గుర్తించాలి.

విశాఖ స్టీల్ ఆర్ధికంగా బలహీనపడటానికి ముఖ్యమైన కారణం, కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ కు కావలసిన స్వంత ఇనుపగనిని ఏళ్ల తరబడి కేటాయించక పోవడం. అదే కేంద్రం, గత తొమ్మిది సంవత్సరాలలో, ప్రైవేటు కంపెనీలకు విచ్చలవిడిగా బిలియన్ల డాలర్ల మూల్యం ఉన్న వందలాది గనులను తక్కువ ధరలకు ధారాదత్తం చేసినా, విశాఖ స్టీల్ కు మాత్రం ఇనుపగనిని ఇవ్వకపోవడం, ప్రైవేటు కంపెనీల మీద కేంద్రం చూపిస్తున్న అత్యంత వ్యామోహానికి ఋజువు. అదీకాక, కేంద్రం

విశాఖ స్టీల్ కు కొద్దిగా ఆర్ధిక సహాయం కూడా చేసి ఉంటే, ప్లాంట్ ఎప్పుడో లాభాల లోనికి వచ్చి, సమస్యలు లేకుండా మిగిలిన స్టీల్ ప్లాంటులతో పోటీ చేసే స్థితిలో ఉండేది.

కొన్ని రోజుల క్రింద, తనే ఆర్ధిక సహాయం చేయడం బదులు, కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ను పునరుద్ధరించడం కోసం, ఒత్తిడి పెట్టి జిందాల్ స్టీల్ కంపెనీ తో ఒప్పందం చేయించి, ప్లాంటును ప్రయివటైజ్ చేయడంలో మొదటి అడుగు తీసుకుంది. అదే జిందాల్ స్టీల్ కంపెనీకి కేంద్రం ముందే స్వయం ఇనుపగనిని ఇచ్చి, వైజాగ్ స్టీల్ పట్ల విచక్షణ చూపించింది. ఆ విషయంలో మీ ప్రభుత్వం మౌనం వహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది.

విశాఖ స్టీల్ ను కేంద్రం ప్రయివేట్ కంపెనీలకు అప్పగించడాన్ని రాష్ట్రప్రభుత్వం వ్యతిరేకంచకపోవడం, విశాఖ స్టీల్ కు కావలసిన సహాయం గురించి ఎటువంటి చర్యలు తీసుకోక పోవడమే కాకుండా, విశాఖ స్టీల్ తో పోటీ పడే ఇంకొక స్టీల్ ప్లాంటును కడపలో పెట్టే నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వరంగంలో నిర్మించే బదులు ఆ ప్రాజెక్టును జిందాల్ (JSW) కు కట్టపెట్టడం, ఆ ప్రాజెక్టు పేరున, JSW కు అతివిలువైన 3,149 ఎకరాల భూమిని, ఎకరానికి 1.6 లక్షల రూపాయలకు బదలాయించడం, పైగా ఆ ప్రాజెక్టు కు కావలసిన ముడి ఇనుమును ఇప్పించాలని, ప్రాజెక్టుకు కావలసిన మౌలిక సదుపాయాలకు కేంద్రం 700ల కోట్లరూపాయల సహాయం చేయాలని కోరడం విశాఖ స్టీల్ విషయంలో చూపని ఆసక్తి, మీ ప్రభుత్వం JSW విషయంలో చూపడం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అతి తక్కువ ధరలకు ఇనుపగనులను ఇచ్చిన ప్రయివేట్ కంపెనీలలో, అత్యంత అధికంగా గనులు పొందిన కంపెనీ JSW కంపెనీ అని మీ అధికారులే చెప్పగలరు.

ఆలస్యమైనా, ఇప్పుడైనా మీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి, విశాఖ స్టీల్ ను ప్రైవేటు కంపెనీకి అప్పగించకూడదని, ప్లాంటుకు కావలసిన స్వంత ఇనుప గనిని తత్క్షణం కేటాయించాలని, ప్రత్యేకమైన ఆర్ధిక సహాయం అందించి విశాఖ స్టీల్ ను పెంపొందించాలని, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి.


(ఇది డాక్టర్ ఇఎఎస్ శర్మ, మాజీ కేంద్ర కార్యదర్శి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రాసిన లేఖ)

Tags:    

Similar News