దఫేదార్‌ను గుర్తుపట్టిన సీజేఐ చంద్రచూడ్.. పులకరించిన దొరై రాజు

కోర్టు చిరుద్యోగిని సిజేఐ ఆత్మీయంగా పలకరించారు. ఈ దృశ్యం అక్కడున్న న్యాయమూర్తులు, సిబ్బందిని మంత్రముగ్ధులను చేసింది.

Update: 2024-03-27 07:10 GMT
దఫేదార్‌ను పలకరిస్తున్న సీజేఐ చంద్రచూడ్

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం అధిపతి (సీజేఐ) సామాన్య ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించి, కుశల ప్రశ్నలు వేశారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ చిరుద్యోగిని పరిచయం చేశారు. చీఫ్ జస్టిస్ ఆప్యాయతకు ఆ చిరుద్యోగి ఆనంద పరవశానికి లోనయ్యారు. సమీపంలో ఉన్న రాష్ట్ర, జిల్లా జడ్జిలు ఆశ్చర్యానికి గురైన సన్నివేశం ఇది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సందేశాన్ని సీజేఐ చెప్పకనే చెప్పారు. ఈ అపురూప సన్నివేశం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం న్యాయ శాస్త్ర విభాగం వద్ద కనిపించింది.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్ర దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) మంగళవారం తిరుపతికి చేరుకున్నారు. ఆ తర్వాత ఉత్సవాలు జరిగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆడిటోరియం వద్దకు కారులో వచ్చారు. కారు నుంచి దిగగానే.. ఎదురుగా అధికారులతో పాటు ఉన్న కోర్టు దఫేదార్ అయ్యా.. నమస్కారం అంటూ ముకుళిత హస్తాలతో నమస్కారం చేశారు.

సిజేఐ ఆత్మీయత

తనను పలకరించిన తిరుపతి జిల్లా మూడో అదనపు జడ్జి దఫేదార్ ఎం దొరై రాజును గుర్తుపట్టిన సీజేఐ చంద్రచూడ్ ఆత్మీయంగా పలకరించారు. క్యా రాజు. కైసా హే యాప్. బీబీ బచ్చే కైసే హై (ఏం రాజు. ఎలా ఉన్నావ్. భార్య పిల్లలు ఎలా ఉన్నారు. అంతా కుశలమే కదా) అనే ఆత్మీయ పలకరింపు ఆశ్చర్య చకితులను చేసింది. అంతేకాకుండా, సీజేఐ తన సతీమణికి కూడా పరిచయం చేసి, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సమీపంలోనే ఉన్న, ఏపీ చీఫ్ జస్టిస్, హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.

మా నాన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా..

సిజెఐ డీవై చంద్రచూడ్ తండ్రి వైబి చంద్రచూడ్ కూడా సిజేఐగా పనిచేశారు. మిగతా ప్రముఖుల తరహాలో వైబి చంద్రచూడ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. అప్పుడు కూడా ఇదే దఫేదార్ ఎం దొరై రాజ్ అధికారుల వెంట ఉంటూ ప్రోటోకాల్ విధుల్లో పాల్గొనేవారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న ప్రస్తుత డివై చంద్రచూడ్.. "నేను దురై రాజుని అప్పటినుంచి చూస్తున్నా" అని అక్కడున్న వారికి వివరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. తన తండ్రి ద్వారా పరిచయమైన చిరుద్యోగిని గుర్తించి ఐదు నిమిషాల పాటు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడిన సన్నివేశం ఆహ్లాదంగా కనిపించింది. కోర్టు చిరు ఉద్యోగి దఫేదార్ ఎం దొరై రాజ్‌తో సీజేఐ సంభాషణ చూసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా మంత్రముగ్ధులయ్యారు. "ఇలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించే అవకాశం నాకు లభించింది. నా ఫోటో జర్నలిజం అనుభవాల్లో ఇదో మధుర జ్ఞాపకంగా ఉంటుంది" అని సీనియర్ ఫోటోగ్రాఫర్ మహమ్మద్ రఫీ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News