మలుపు తిరిగిన మంత్రి సంధ్యారాణి కుమారుడి కేసు
చివరకు ఫిర్యాదుదారే నిందితురాలైంది. ఆమెను కటకటాల వెనక్కు నెట్టారు.
By : The Federal
Update: 2025-12-23 10:12 GMT
ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు పృథ్వి, ఆమె పీఏ సతీశ్‌లపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో అసలు ఏం జరిగిందనే వివరాలు ఇప్పుడు పోలీసులు బయటపెడుతున్నారు. చివరకు ఫిర్యాదుదారే నిందితురాలైంది. ఆమెను కటకటాల వెనక్కు నెట్టారు. అసలింతకీ ఏమి జరిగిందందే..
త్రివేణి అనే మహిళ ఉద్యోగం కోసం మంత్రి సంధ్యారాణి కుమారుణ్ణి, ఆమె పీఏను ఆశ్రయించారు. ఈ సందర్భంలో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని, వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
త్రివేణి ఫిర్యాదు చేసిన రోజు నుంచే ఆమెపై వేధింపులు ప్రారంభమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోపక్క ఈ వ్యవహారమై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఆరోపణలన్నీ కల్పితమని తేల్చారు. నిందితురాలు త్రివేణి, తన స్నేహితుడు భానుప్రసాద్ (దేవిప్రసాద్) సహాయంతో మంత్రి కుమారుడి పేరు మీద నకిలీ (Fake) ఎస్‌ఎంఎస్‌లను సృష్టించినట్లు ఫోరెన్సిక్ దర్యాప్తులో వెల్లడైంది.
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, కావాలనే దురుద్దేశంతో ఈ ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు.
నిందితుల అరెస్ట్
తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి, తప్పుదోవ పట్టించినందుకు గాను ఫిర్యాదుదారు త్రివేణిని, ఆమెకు సహకరించిన భానుప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సామాన్యుల అపోహలు ఏమిటంటే..
ఏదైనా కేసులో అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు, విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అన్న అనుమానం కలగడం సహజం. ఈ విషయాన్ని మనం రెండు కోణాల్లో విశ్లేషించవచ్చు.
అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందా?
సాధారణంగా ప్రజల్లో ఉండే సందేహాలు ఇవే. అధికార పార్టీకి చెందిన మంత్రి కావడంతో, పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా కాకుండా మంత్రికి అనుకూలంగా దర్యాప్తు చేసి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు మంత్రికి అత్యంత సన్నిహితులు (కుమారుడు, పీఏ) కావడం వల్ల కేసును నీరుగార్చడానికి అవకాశం ఉందనే విమర్శలు రావచ్చు.
పోలీసుల వాదన ఎలా ఉందంటే...
మరోవైపు, పోలీసులు ఈ కేసును కేవలం మాటల మీద కాకుండా సాంకేతిక ఆధారాల (Forensic Evidence) ఆధారంగా నిగ్గు తేల్చామని పోలీసులు చెబుతున్నారు.
రాజకీయంగా కలకలం రేపిన ఈ కేసు, చివరకు కుట్రగా తేలడంతో మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాయి.