పుట్టపర్తిలో ఇలా జరగనివ్వం.. బ్లాక్ స్పాట్లపై దృష్టి..

ఏడాదిలో 429 ప్రమాదాలు.. 255 మంది మృతిపై కలెక్టర్ శ్యాప్రసాద్ ఆందోళన.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-25 05:55 GMT
కర్నూలు వద్ద దగ్ధమైన బస్సు (ఫైల్)

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటన అధికారులను కూడా కలవరానికి గురి చేసింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య తెరమీదకు వచ్చింది. రాయలసీమలో పుట్టపర్తి జిల్లా ( అనంతపురం జిల్లా )యంత్రాంగం స్పందించింది.

"పుట్టపర్తి జిల్లాలో 11 నెలల్లోనే 429 ప్రమాదాలు జరగడం, 255 మంది మరణించారు" అని గుర్తు చేసిన పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి విషాద ఘటనలకు తెరదించడానికి కఠినంగా వ్యవహరించడం తోపాటు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై స్పందించారు.
పుట్టపర్తి జిల్లాలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయానికి రంగంలోకి దిగారు. జిల్లా స్థాయిలోని రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కమిటీ భేటీ అయింది. జాతీయ రహదారులతో పాటు స్టేట్ హైవేస్ లో కూడా ప్రమాదాల నివారణపై సీరియస్ గా దృష్టి సారించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు.

డీటీసీ (Deputy Transport Commissioner DTC), ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (National Highways), ఆర్డీవోలు, డిఎస్పీలు, డిఎంహెచ్ఓ, డీఈవో, పోలీసు అధికారులతో సమీక్షించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ రహదారులపై ఉన్న 29 బ్లాక్ స్పాట్లు, స్టేట్ హైవేలోని 77 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. వాటిలో పుట్టపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ హెచ్చరించారు.
జిల్లాకు అవసరమైన స్పీడ్ గన్స్ అందజేయాలని ఉన్నతాధికారులకు లేఖ సిద్ధం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీపీ)కి కలెక్టర్ సూచించారు.
ప్రమాదాలు తగ్గాలి..

పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తో కలిసి జిల్లా స్థాయి రహదారి భద్రతా సమన్వయ సమావేశంలో కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మాట్లాడారు. జిల్లాలో జీరో మృతి కేసులు నమోదు కావడానికి అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
"2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 429 ప్రమాదాలు జరగడం, 255 మంది మృతి చెందడం బాధాకరం" అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ఈ ప్రమాదాల్లో 233 ప్రాణాంతక కేసులు, 196 ప్రాణాంతకం కానివి, 483 మంది గాయపడినట్లు నివేదికను ప్రస్తావించారు.
భద్రతా ప్రమాణాలు పాటించాలి..
పుట్టపర్తి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికోసం రవాణా శాఖ అధికారులకు మిగతా ప్రభుత్వ శాఖల్లోని పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సహకారం అవసరమైంది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనా స్థలాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆ సమయంలో ఆమె ఏమన్నారంటే..
"ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా, రెవెన్యూ అధికారులతో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయడం తోపాటు వేగనియంత్రణకు ఎస్ఓపీ పద్ధతిని కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం" అని హోం మంత్రి అనిత ప్రకటించారు. ఆమె మాటలను పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ కార్యాచరణలోకి తీసుకుని వచ్చారు.
బ్లాక్ స్పాట్స్ లో పటిష్ట చర్యలు
సాధారణంగా ఒక మార్గంలో ఐదు సంవత్సరాల్లో జరిగే ప్రమాదాల సంఖ్య, తీవ్రత ఆధారంగా ఏ,బీ,సీ గా బ్లాక్ స్పాట్స్ (Black Spot) వర్గీకరించడం ద్వారా గుర్తించడంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ( Ministry of Road Transport and Highways MoRH) కీలకంగా వ్యవహరిస్తుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,800 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ ఉంటే 77 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. అనంతపురం జాతీయ రహదారుల సర్కిల్ పరిధిలో 685 కిలోమీటర్ల దూరంలో 29 బ్లాక్ స్పాట్లు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గుర్తించింది. ఇందులో అనంతపురం నుంచి తగరకుంట మార్గంలో 10, గుంతకల్లు మార్గంలో నాలుగు, ఉరవకొండ మార్గంలో రెండు, అనంతపురం నుంచి కర్ణాటక అంతర్రాష్ట్ర జాతీయ రహదారిలోని శెట్టూరు మార్గంలో ఎనిమిది బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఇదిలావుంటే, కదిరి నుంచి అనంతపురం జాతీయ రహదారి 42 సమతాగ్రామం కూడలిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రాప్తాడు వద్ద జాతీయ రహదారి 42లో కలుస్తుంది. ఈ మార్గాల్లో సూచికబోర్డులు ఏర్పాటు చేయడం, ఇతరభద్రతా చర్యలకు 55 లక్షల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. నిధుల కొరత ప్రధానంగా మారిందని ఓ అధికారి స్పష్టం చేశారు.
పుట్టపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణకు కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఏమని ఆదేశించారంటే..

"జిల్లాలోని రహదారుల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి. మలుపుల వద్ద జంగిల్ క్లియరెన్స్ ఎప్పటికప్పుడు చేయడం వల్ల కూడా ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది" ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు.
పుట్టపర్తి జిల్లా నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లో అన్ని మీడియన్ ప్రాంతాలలో లైటింగ్ ఏర్పాట్లు పెంచాలని కూడా ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
"పాలసముద్రం క్రాస్ వద్ద ట్రక్ లే బై ఉండి కూడా వాడడం లేదని నా దృష్టికి వచ్చింది. దాన్ని వాడుకులోకి తీసుకురావాలి" అని ఆదేశించారు. జాతీయ రహదారుల్లో ట్రక్ లే బై ఎన్ని ఉన్నాయి, అక్కడ సూచిక బోర్డులు ఉన్నాయా? లేవా? అనే వివరాలతో నివేదిక ఇవ్వాలని సర్వే, రెవెన్యూ, పోలీసు శాఖలను ఆదేశించారు.
నిబంధనలు పరిశీలించండి
జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ లలో ప్రమాదాల నివారణకు పెద్ద పరిమాణంలో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. రంబుల్ స్ట్రిప్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. పాఠశాల బస్సులకు రివర్స్ చేసేటప్పుడు రేర్ కెమెరా ఉండాలని నిబంధనలను చెబుతున్నాయని, ప్రతి పాఠశాల బస్సు కు రేర్ కెమెరా ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించి, ఈ మేరకు పాఠశాల యాజమాన్యం నుంచి సర్టిఫికెట్ పొందాలని డిటిసి, డీఈఓను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. జిల్లాకు అవసరమైన స్పీడ్ గన్స్ అందజేయాలని ఉన్నతాధికారులకు లేఖ సిద్ధం చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారికి సూచించారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు.
పుట్టపర్తి జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు సైన్ బోర్డ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో లైసెన్సు సస్పెండ్ చేయాల్సిన వాటిని డిటిసికి పంపాలని డీఎస్పీలను ఆదేశించారు.
Tags:    

Similar News