రాళ్లే కోరుకునే రాళ్లమ్మ తల్లి!

రాయి వేస్తే కోరికలు తీరతాయని నమ్ముతున్న భక్తులు. శతాబ్దాలుగా పూజలందుకుంటున్న అమ్మవారు. విశాఖపట్నం జిల్లా పాలవలసలో గుడి లేని వింత దేవత.

Update: 2024-12-20 06:34 GMT
స్వయంభూగా వెలసిన రాళ్లమ్మ వారు రాళ్లమ్మ

ఏ దేవుళ్లకైనా, దేవతలకైనా పళ్లు, ఫలాలు సమర్పించుకుంటారు. కానీ అక్కడ అమ్మవారు మాత్రం భక్తుల నుంచి కేవలం రాళ్లను మాత్రమే కోరుకుంటారు. అలా రాళ్లను సమర్పిస్తే తమ కోరికలు నెరవేరతాయని గట్టిగా నమ్ముతారు. ఆ నమ్మకం పదేళ్లు, ఇరవై ఏళ్ల నుంచి కాదు.. శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా కొనసాగుతోంది. అలా అప్పట్నుంచి వేస్తున్న రాళ్లు ఇప్పుడు కొండల్లా పేరుకుపోయాయి. కొండంత నమ్మకానికి ప్రతిరూపాలుగా కనిపిస్తున్నాయి. విచిత్రంగా రాళ్లతోనే సంతృప్తి చెందుతున్న ఆ అమ్మవారు ఎక్కడున్నారో తెలుసా!

విశాఖపట్నం నగరానికి 25 కిలోమీటర్ల దూరంలోని పాలవలస పంచాయతీ మెట్టవానిపాలెం వద్ద ఆనందపురం - పెందుర్తి జాతీయ రహదారికి ఆనుకుని ఉంది ఈ రాళ్లమ్మ తల్లి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ అమ్మ వారు ఊరికి చివర కొన్ని శతాబ్దాల క్రితమే ఓ చిన్న రాయి రూపంలో స్వయంభూగావెలిశారు. అప్పట్లో ఆ దారిన వెళ్లే కొంతమందికి రాత్రి వేళల్లో అప్పుడప్పుడు అమ్మ వారి రూపంలో కనిపించే వారట! తానుండే చోట రాయి వేస్తే మీ కోరికలు తీరతాయని చెప్పేవారట. అలా ఆ నోటా ఈ నోటా ఈ మాట పాకి రాళ్లమ్మ తల్లిగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆమె చెప్పినట్టుగానే ఒక్కొక్కరు రాళ్లు వేయడం ప్రారంభించారు. వారి నమ్మకానికి తగ్గట్టుగానే కోరిన కోర్కెలు తీరడంతో అమ్మవారిపై భక్తి భావం పెరగడం మొదలైందని గ్రామస్తులు చెబుతారు.




 


ఇలా శతాబ్దాల తరబడి అమ్మవారికి రాళ్లు వేస్తూనే ఉన్నారు. తమ పిల్లలకు పెళ్లిళ్లు జరగాలని, ఉద్యోగాలు రావాలని, వ్యాపారాలు కలిసి రావాలని, ఆరోగ్యం బాగుండాలని ఈ రాళ్లమ్మ తల్లికి మొక్కుకుంటారు. తమ కోరికలు తీరగానే మొక్కులు చెల్లించుకుంటారు. అవి కూడా పసుపు కుంకుమలతోనే తీర్చుకుంటారు. కొంతమంది భక్తులైతే కోరికలు నెరవేరాక కోళ్లు, మేకలను కోసి పది మందికీ భోజనాలు పెడతారు. అంతేకాదు.. కొంతమంది ఊళ్లకు వెళ్లేటప్పుడు క్షేమంగా వెళ్లి రావాలని ఓ రాయి వేసి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు మరో రాయి వేస్తారు. గతంలో అడపా దడపా మొక్కులు తీర్చుకునే వారని, ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య బాగా పెరిగిందని గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. కొన్నేళ్ల నుంచి ప్రతి శుక్ర, ఆదివారాల్లో గ్రామస్తులు పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారని తెలిపారు.

పండుగ ఎరుగని అమ్మవారు..

సాధారణంగా ఊళ్లలో గ్రామ దేవతలకు ఏటా పండుగ చేస్తుంటారు. కానీ ఈ అమ్మవారికి ఏడాదిలో ఒక్కసారి కూడా పండుగ చేయకపోవడం విశేషం! ఊరూరా రాళ్లమ్మ తల్లి విశిష్టత గురించి విస్తృతంగా పాకింది. దీంతో పాలవలస పరిసర గ్రామాల నుంచే కాదు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భక్తులు వచ్చి తమ కోర్కెలు తీర్చాలని రాళ్లు వేసి మొక్కుకుంటారు. కోర్కెలు తీరిన వారు కుటుంబాలతో వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించు కుంటున్నారని మెట్టవానిపాలెం గ్రామానికి చెందిన తమ్మిన అప్పలరాజు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.




 


రాళ్లమ్మ తల్లికి గుడి లేదు..

రాళ్లమ్మ తల్లిగా భక్తుల నమ్మకాన్ని చూరగొన్న ఈ అమ్మవారికి గుడి లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. గుడి ఎందుకు కట్టలేదని గ్రామస్తులను అడిగితే అప్పట్లో అమ్మవారు వద్దన్నారని చెబుతారు. అందువల్ల ఇప్పటికీ పేరుకుపోయిన రాళ్ల గుట్టల మధ్య చిన్న రాయి రూపంలోనే (చుట్టూ ఇటుకలను పేర్చి) పూజలందుకుంటున్నారు. ఆ ఇటుకలను ఆనుకునే ఓ చిన్న హుండీ ఉంటుంది. అంతకు మించి అక్కడ మరే కట్టడాలు కనిపించవు. దీంతో రాళ్లమ్మ ఎండకు ఎండి, వానకు తడుస్తూనే ఉంటుంది. గతంలో కొంతమంది గుడి కట్టడానికి ప్రయత్నిస్తే అమ్మవారు అనుమతించలేదని దీంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు గ్రామస్తులు చెబుతారు. అయితే అమ్మవారు అనుగ్రహిస్తే గుడి కట్టి నిత్య పూజలు చేసేందుకు మరోసారి సన్నాహాలు చేస్తున్నారు.


 



రాళ్లెత్తుకుపోవడానికి విఫలయత్నాలు..

గుట్టలుగా పోగులు పడిన రాళ్లను కొంతమంది తీసుకుపోవడానికి గతంలో ప్రయత్నించినా సాధ్యపడలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఎడ్ల బండిపై రాళ్లను తీసుకెళ్లేందుకు రాగా ఆ బండి ఇరుసు విరిగిపోయి రోజుల తరబడి కదలకుండా ఉండిపోయిందని, కొన్నాళ్ల క్రితం ఓ లారీలోనూ రాళ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆ లారీ మరమ్మత్తులతో నిలిచిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అనుభవాలతో ఎవరూ ఈ రాళ్ల జోలికి వెళ్లడం లేదు.


 



భక్తుల కోర్కెలు తీరుస్తారు..

'ఈ రాళ్లమ్మ తల్లి భక్తుల కోర్కెలు తీరుస్తారు. మొక్కుకున్న వారాల వ్యవధిలోనే నెరవేరుస్తారు. అలవి మాలిన, అసాధారణ కోర్కెలు కాకుండా ధర్మబద్ధమైన కోర్కెలు తీరుతున్నందున భక్తుల్లో ఈ అమ్మవారి పట్ల భక్తిభావం, నమ్మకం పెరిగింది. నా విషయంలోనూ పలుమార్లు రుజువైంది. వ్యాపారాల్లో నష్టాలు రాకూడదని, వివిధ సమస్యలతో సతమతమవుతున్న వారూ, భూవివాదాల పరిష్కారం కోసం వచ్చి అమ్మవారికి మొక్కుకుంటున్నారు. అవి తీరగానే మొక్కులు తీర్చుకుంటున్నారని పాలవలసకు చెందిన మద్ది శేఖర్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. రాళ్లమ్మ తల్లి దగ్గరకు వెళ్లాలనుకునే వారు ఇటు విశాఖ నుంచి, అటు విజయనగరం నుంచి ఆనందపురం వెళ్లేందుకు అనేక బస్సులున్నాయి. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టవానిపాలేనికి ఆటోలూ అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News