కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు డిమాండ్

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాల్సిన వారు జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు బయోడేటాలు ఇస్తున్నారు. అసెంబ్లీలకు ఇప్పటికే 190 వచ్చాయి.

Byline :  The Federal
Update: 2024-01-31 11:17 GMT
హస్తం గుర్తు

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఒకప్పుడు కేంద్ర అధిష్టానం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్ ఉండిపోయారు. షర్మిల రాష్ట్ర టూర్ చేస్తున్న సమయంలో ఠాగూర్ టిక్కెట్లకు దరఖాస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలోనే చాలా జిల్లాల్లో నాయకులు టిక్కెట్ కోసం బయోడేటాలు అందజేశారు. రాష్ట్ర కార్యక్రమాలను ఠాగూర్ తో పాటు మాజీ మంత్రులు జేడీ శీలం, పళ్లంరాజు, కొప్పుల రాజు, రాష్ట్రానికి సంబంధించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథం, ఎస్సీ సెల్ చైర్మన్ సాకె శంకర్, పీసీసీ మాజీ అధ్యక్షులు సాకె శైలజానాథ్, గిడుగు రుద్రరాజు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

190 బయోడేటాలు

మంగళవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ టిక్కెట్ కావాలని 190 మంది దరఖాస్తులు చేశారు. పార్లమెంట్ టిక్కెట్లు రావాలని 18 మంది దరఖాస్తు చేశారు. బుధవారానికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ నుంచి 18 మంది ఇప్పటికి టిక్కెట్ కావాలని దరఖాస్తులు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యమైన వారు వస్తున్నారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన డీవై దాసు ఇప్పటికే వైఎస్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ కు దరఖాస్తు చేశారు. కాపు రామచంద్రారెడ్డి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసీస్సులు కూడా వుండటంతో కాపు ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కిశోర్ చంద్రదేవ్ కూడా తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఆయన కూడా కాంగ్రెస్ లో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పీసీసీ చీఫ్ రష్మిలతో పాటు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఎన్ తులసిరెడ్డిలు రాష్ట్ర పర్యటనలో పాలు పంచుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయని, కాంగ్రెస్ వాదులంతా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చి తన సత్తా నిరూపించుకోవాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ మంచి చేస్తుందని నమ్ముతున్నారా?

రాష్ట్రానికి కాంగ్రెస్ మంచి చేస్తుందని, ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేయిస్తానని షర్మిల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు నిలబడేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. ఈలెక్కన కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పోటీ కూడా ఎక్కువగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News