డాక్టర్‌గా కాదు... దళారీగా వెలిగిన నమ్రత?

వైద్య వృత్తిలోకి అడుగు పెట్టినప్పట్నుంచి డాక్టర్ నమ్రత ఆలోచనలన్నీ అక్రమ సంపాదన చుట్టూనే తిరిగాయి.;

Update: 2025-07-29 12:05 GMT

వైద్య వృత్తిలోకి అడుగు పెట్టినప్పట్నుంచి డాక్టర్ నమ్రత ఆలోచనలన్నీ అక్రమ సంపాదన చుట్టూనే తిరిగాయి.

ఆ డబ్బు యావతోనే సాటి అడబిడ్డల పేగు బంధాన్నీ తెంచేసింది. వారి శిశువులను అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ఆమెను చాలా దగ్గర్నుంచి చూసిన వారు చెబుతున్నారు.

డాక్టర్ పచ్చిపాల నమ్రత ఎలియాస్ డాక్టర్ అత్తలూరి నమ్రత..! పచ్చి డబ్బు మనిషి అని ఈ  నమ్రతకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లోని వైద్య రంగంలో ఆమె పేరు వింటే అమ్మో! నమ్రతా? అంటారు ఆమె దగ్గర పని చేసిన ఓ ఉద్యోగి.


ఆమె బాధితులు చెప్పిన విశ్వసనీయ సమాచారం మేరకు... తన ప్రతిభతో కాకుండా అక్రమార్జనకు ఎంచుకున్న మార్గాలతో ఆమె అత్యంత వివాదాస్పదురాలయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నమ్రత తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సరోగసీ, ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. సంతాన సాఫల్యంలో తనకు మించిన వారు లేరంటూ సొంత వెబ్సైట్లలో అసత్యాలను ఊదరొట్టింది.

డాక్టర్ నమ్రత.. ఇలా ఎంతమందిని మోసం చేసినా, ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నా, ఎన్నిసార్లు అరెస్టయి జైలుకెళ్లినా తన తీరు మార్చుకోలేదు. జైలుకెళ్లి వచ్చిన ప్రతిసారీ అంతకు మించిన ఎత్తుగడలతో మరింతగా దోపిడీకి పదును పెట్టింది. తనకున్న డబ్బు బలంతో పాలకులను, అధికారులను తన జోలికి రాకుండా ఓ సామ్రాజ్యాన్ని 'సృష్టి'ంచుకుంది. దీంతో కేసులకు, జైళ్లకు వెరవకుండా నిర్భీతిగా తన అనైతిక వ్యాపారానికి సామ్రాజ్ఞి అయింది.

సికింద్రాబాద్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్

తన డబ్బు యావ ముందు సాటి ఆడబిడ్డలను మోసం చేస్తున్నానన్న స్పృహ, వారికి పుట్టిన శిశువులను విక్రయించి వారి పేగు బంధాన్ని తెంచేస్తున్నానన్న బాధ తన మస్తిష్కంలోకి రాకుండా పోయింది. సాధారణంగా సాటి మహిళల పట్ల వైద్యులు దయాగుణాన్ని కలిగి ఉంటారు. తమ వద్దకు వచ్చే మహిళా రోగులు/ గర్భిణులకు చేతనైనంత సాయం చేస్తారు. ప్రసవ నొప్పులు, పురిటి సమయంలో వారితో పాటే మహిళా వైద్యులూ కళ్లు చెమరుస్తారు. అలాంటి వైద్య దేవతలున్న ఈ రంగంలో డాక్టర్ నమ్రత.. ఓ డబ్బు పిశాచిలా మారింది. ఎందరో మహిళల పేగు బంధాన్ని తెంచేసి వైద్య రంగానికే కళంకం తెచ్చిపెట్టింది.

నమ్రతకు ఆది నుంచి డబ్బు జబ్బే..

డాక్టర్ నమ్రత వైద్య రంగంలోకి అడుగుపెట్టగానే డబ్బు జబ్బు సోకిందని ఆమె గురించి తెలిసిన వైద్యులు చెబుతుంటారు. 1990-95 వరకు నమ్రత విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ డాక్టర్ని ప్రేమ పేరుతో కులాంతర వివాహం చేసుకుందని అంటారు. గైనకాలజీలో ఎండీ చేశాక.. కాసులు కురిపించే ఫెర్టిలిటీ మెడిసిన్లో శిక్షణ పొందింది. అనంతరం ఆమె తన గైనకాలజీపై కాకుండా ఫెర్టిలిటీ వ్యాపారంపై దృష్టి సారించింది. రూ. లక్షలకు లక్షలు కళ్ల జూడడంతో తన అక్రమాలను ఇక అప్రతిహతంగా కొనసాగిస్తూ వచ్చింది.

ఎంతలా అంటే.. ముందుచూపుతో తన ఇద్దరు కుమారుల్లో ఒకరితో న్యాయ విద్య చదివించింది. సరోగసీ (అద్దె గర్భం), ఐవీఎఫ్ పేరిట తాను చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఎవరో లాయర్ను ఆశ్రయించే బదులు తన సొంత కొడుకు జయంత్ కృష్ణ ద్వారానే ఆ పని చేయించాలన్న వ్యూహంతో లా (న్యాయశాస్త్రం) పూర్తి చేయించింది. సికింద్రాబాద్లోని ఆమె నివాసంలో ఒక అంతస్తులో కుమారుడితో లీగల్ ఆఫీసును పెట్టించింది ఇప్పుడా కొడుకే ఈమె చేస్తున్న సరోగసీ అక్రమాలను వెనకేసుకు వస్తూ డాక్టర్ నమ్రత చేతిలో మోసపోయిన బాధితులను 'లీగల్'గా మీపై కేసులు పెడ్తామంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

టెస్ట్ ట్యూబ్ బేబీకి దూరం..

డాక్టర్ నమ్రత నడుపుతున్న సృష్టి ఆస్పత్రుల్లో ఐవీఎఫ్, సరోగసీతో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీల సదుపాయం కూడా ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీ విధానంలో భార్యాభర్తల వీర్యం, అండాలను సంబంధిత ట్యూబ్లో ఉంచి శిశువు ఎదిగేలా చూస్తారు. బిడ్డ ఎదిగే క్రమంలో తల్లిదండ్రులను చూసేందుకు అనుమతిస్తారు తొమ్మిది నెలల అనంతరం ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. అయితే ఇందులో మోసాలకు పాల్పడడానికి కుదరదు.

అందువల్ల డాక్టర్ నమ్రత టెస్ట్ ట్యూబ్ బేబీలకంటే సరోగసీ (అద్దె గర్భం)పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. సరోగసీలో అయితే దంపతుల వీర్యం, అండాలను మరొక మహిళ గర్భంలో ఉంచుతారు. ఆ మహిళకు పుట్టిన బిడ్డను దంపతులకు అప్పగిస్తారు. ఈ సరోగసీలో అయితే మోసం చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే నమ్రత ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. పేదరికంతో ఉన్న, లేదా అక్రమ మార్గం ద్వారా గర్భం దాల్చిన మహిళలు/యువతులను ట్రాప్ చేస్తున్నారు. ఈ మహిళకు రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు.

భువనేశ్వర్ లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్

సరోగసీలో నమ్రత ఒక్కో బిడ్డకు రూ.30-40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అంటే రూ. లక్ష పెట్టుబడితో రూ.30-40 లక్షలు అప్పనంగా సంపాదిస్తున్నదన్న మాట! టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో ఆస్పత్రి నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. లాభార్జన తక్కువగా ఉంటుంది. ఇలా ఇప్పటివరకు డాక్టర్ 2,200కు పైగా సరోగసీ కేసులను డీల్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో కేసు నుంచి సగటున రూ.30 లక్షలు చూసినా ఎన్ని వందల కోట్లు అక్రమంగా గడించిందో? అని వైద్య వర్గాలే ముక్కున వేలేసుకుంటున్నాయి.


Tags:    

Similar News