ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే కావాలి!

మాకు ఎంపీగా వద్దు, ఎమ్మెల్యేగా ఇవ్వండి. ఇదీ ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో జరుగుతున్న పోరు. ఎందుకు ఎమ్మెల్యే కోసం పట్టుపడుతున్నారు. ఎంపీగా ఎందుకు వద్దుంటున్నారు.

Update: 2024-01-27 09:33 GMT
New Parlament Bhavan

ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ తరపున అభ్యర్థులు భయపడుతున్నారు. ఎందుకు వీరు భయపడుతున్నారు? ఏమైంది? ఎంపీ అంటే భారత రాజధాని ఢిల్లీలో ఉండొచ్చు. పార్లమెంట్‌లో కాలుమోపొచ్చు. అందరూ కోరుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. ఎందుకో ఒకసారి పరిశీలిద్దాం.

ఖర్చు భయం

ఒక పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయాలంటే డబ్బులు ఎంతమొత్తం ఖర్చవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారంటే కనీసం రూ. 70 కోట్లు కావాల్సి వస్తోందంటున్నారు. నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీలు ఉంటే ఒక్కో అసెంబ్లీకి కనీసంలో కనీసంగానైనా పది కోట్లు కావాల్సిందే. అలాంటప్పుడు ఆ పదవి ఎందుకనే ఆలోచన వారిలో ఉంది. ఇప్పటి వరకు ఉన్న వారు చెబుతున్న మాటలు విన్నతరువాత ఎంపీగా మాకొద్దుబాబో అని మొత్తుకుంటున్నారు.
గెలుస్తామో లేదోననే భయం
రెండవది ఇంతఖర్చుపెట్టీ గెలుస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని భావించి పోటీ చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇంత డబ్బు ఖర్చు చేసిన తరువాత తిరిగి పైసా రాదు. కనీసం హోదా అయినా ఉంటుందా అంటే అదీ ఉండదు. అధికారంలో ఉంటేనే ఎవరైనా పలకరిస్తారు. లేకుంటే పార్టీ పెద్దలు కూడా పెదవి విరుస్తారు. అటాంటప్పుడు ఇది అవసరమా? అనే భావనలో ఎంపీ పోటీదారులు ఉన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌లు పోటీలు పడి జనం వద్దకు వెళుతున్నారు. ప్రజల్లో అధికార పార్టీపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. పైగా సీఎం చెల్లెలు వైఎస్సార్‌సీపీని ఓడించండి అంటూ దూసుకు వెళ్లే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదంతా అవసరమా? సర్థుకుంటే పోలా అనే ఆలోచన ఎంపీ స్థానానికి పోటీచేసే వారిని తొలుస్తున్న ప్రశ్న.
ఎంపీగా కనీసం మంత్రులను కూడా కలిసే అవకాశం లేదు
ఎంపీలుగా గెలిచినా పార్టీ పర్మిషన్‌ లేకుండా ఢిల్లీలో మంత్రులను కూడా కలిసే అవకాశం లేదు. ప్రజలు ఎన్నో సమస్యలతో వస్తారు. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే కనీసం సంబంధిత మంత్రితోనైనా మాట్లాడాలి. సాధారణ జనం అప్పుడప్పుడైనా కలుస్తారు. ఎంపీలుగా తాము కలిసేందుకు పార్టీ పర్మిషన్‌ తీసుకోవాలంటే ఎలా? ఇలాంటప్పుడు ఆఎంపీ స్థానానికి దూరంగా ఉండటం మంచిది కదా అనే ఆలోచన ఎంపీ అభ్యర్థుల్లో ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం విజయసాయిరెడ్డి మాత్రమే ఎవరినైనా కలవాలి. వేరెవరూ ఆయనకు తెలియకుండా ఎవ్వరినీ కలిసేందుకు వీలు లేదు. చలికి వణుకుతూ అక్కడ కూర్చునే కంటే ఏపీలో సొంత పనులతో పాటు ప్రజల పనులు కూడా చూడొచ్చు అనే ఆలోచనలో ఎంపీ అంటేనే భయపడుతున్నారు.
ఢిల్లీలో దక్షినాది వారంటేనే వ్యాల్యూలేదు..
ఢిల్లీలో తిరగాలంటే హిందీ, ఇంగ్లీష్‌ తప్పకుండా రావాలి. ఒక వేళ భాషలు వచ్చినా ప్రతిపక్ష ఎంపీలను పెద్దగా పట్టించుకోరు. అధికారులు కూడా పట్టీపట్టనట్లు ఉంటారు. దక్షిణాది వారంటేనే అధికారులు పట్టీపట్టనట్లు ఉండటాన్ని ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్లమెంట్‌లో కనీసం మాట్లాడే అవకాశం కూడా రాదు. ఒక ప్రశ్న వేయాలన్నా విజయసాయిరెడ్డి అనుమతి తీసుకోవాలి. అందుకే మాకొద్దుబాబూ ఈ ఎంపీ పదవి అంటూ పెదవి విరుస్తున్నారు.
వ్యాపారులైతేనే ఉపయోగం
ఎంపీగా టిక్కెట్‌ తీసుకోవాలంటే వ్యాపారులై ఉండాలి. వారికి ఈ పదవి ఉపయోగం. ఎందుకంటే ఢిల్లీలో ఎవరిని కలవాలన్నా ఎంపీ అనే కార్డు ఉంటే చాలు అవకాశం ఇస్తారు. అది లేదంటే కనీసం గేటు ముందు కూడా నిలబడనివ్వరు. అందుకే ఎంతో మంది వ్యాపార, పారిశ్రామిక వేత్తలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనూ, రానున్న ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఎలాగో ఆయా సామాజిక వర్గాల వారికే ప్రయోజనం కల్పిస్తారు. సీటు దక్కి పోటీ చేసి గెలిచినా ఉన్నత సామాజిక వర్గాల వారికి దక్కే విలువ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉండదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. అందుకే మాకొద్దయ్యా ఎంపీ పోస్టు అంటున్నారు నేతలు.
మాకు ఎమ్మెల్యే సీటు కావాలి
ఎంపీ వద్దు, ఎమ్మెల్యే సీటు ఇవ్వండని పలువురు వైఎస్సార్‌సీపీ నాయములు ముఖ్యమంత్రి వద్ద ప్రాదేయపడుతున్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో నర్సాపురం ఎంపీ రగురామ కృష్ణంరాజు మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన వారు మాత్రం మాకు ఎమ్మెల్యేలుగా ఇవ్వాలని ఎక్కువ మంది కోరుతున్నారు. ఇప్పటి వరకు నియమించిన ఇన్‌చార్జ్‌ల్లో తొమ్మిది ఎంపీ స్థానాలు ఉన్నాయి. కర్నూలు ఎంపీ స్థానానికి ప్రస్తుతం ఉన్న డాక్టర్‌ సతీష్‌కుమార్‌ను కాదని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ఇన్‌చార్జ్‌గా వేశారు. జయరామ్‌ ససేమిరా నేను ఎంపీగా పోటీ చేయనని సీఎం వద్ద చెబుతున్నారు. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఎమ్మెల్యే స్థానానికి మార్చి ఆమె స్థానంలో ఎమ్మెల్యే కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మిని ఎంపీగా ప్రతిపాదించారు. ఇందుకు ఆమె సుముఖంగా లేరు. ఏలూరు పార్లమెంట్‌కు కోటగిరి శ్రీధర్‌ను కాదని బీసీ సామాజికవర్గానికి చెందిన కారుమూరు సునీల్‌కుమార్‌ యాదవ్‌ను సీఎం జగన్‌ ఇన్‌చార్జ్‌గా వేశారు. ఆయన కూడా ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరని సమాచారం. ఇక విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కాదని మంత్రి బొత్సా సత్యనారాయణ భార్య భొత్సా ఝాన్సిని రంగంలోకి దించారు. వీరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి ఏదైతేనేం పదవి ఉంటే చాలనుకుంటారు. బొత్స చొరవతో తాను పోటీలో ఉంటానని చెప్పారు. అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యను మార్చి ఆయన స్థానంలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణను ఇన్‌చార్జ్‌గా సీఎం నియమించారు. నాకు ఎంపీ స్థానం వద్దని ఎమ్మెల్యేగానే ఉంచాలని ఆయన పట్టుబడుతున్నారు. చిత్తూరులోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉన్న నల్లకొండగారి రెడ్డెప్పను మార్చి మంత్రి కె నారాయణస్వామిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఎంపీ సీటు నాకు వద్దు స్వామీ అని సీఎంను బ్రతిమాలుకుంటున్నారు నారాయణస్వామి. ఇప్పటి వరకు తొమ్మిది ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను సీఎం జగన్‌ ప్రకటించారు. మరికొందరు ఎంపీలకు సీట్లు ఇవ్వడం లేదనే సంకేతాలు పంపించారు. కావాలని అడుగుతున్న వారికి సీట్లు ఇవ్వడం లేదు. వద్దన్న వారికి సీఎం జగన్‌ ఎంపీ స్థానాలు అప్పగిస్తున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Similar News