తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘సృష్టి’ సరోగసీ వ్యవహారం మూలాలు విశాఖతోనే ముడిపడ్డాయి. సికింద్రాబాద్‌లో తీగలాగితే వైజాగ్‌లో డొంక కదిలింది. ‘యూనివర్సల్ సృష్టి’ అనే పేరుతో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వాహకురాలు డాక్టర్ అత్తలూరి నమ్రత ఎలియాస్ పచ్చిపాళ్ల నమ్రత చేస్తున్న అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఈనాటివీ కావు.. దాదాపు రెండు దశాబ్దాలుగా చేస్తున్న మోసాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఫిర్యాదులు, కేసులు, అరెస్టులు, జైలు కెళ్లి రావడాలు షరా మామూలు అయిపోయాయి. అయినా రక్తం మరిగిన పులిలా అక్రమార్జన రుచి మరిగిన డాక్టర్ నమ్రత అండ్ ఫ్యామిలీ తమకున్న పలుకుబడితో తేలిగ్గా బయట పడుతూ వస్తున్నారు. పదిహేనేళ్లుగా ఈ ‘సృష్టి’ వ్యవహారాలు వెలుగు చూడడం, మీడియా హడావుడి చేయడం, అధికారులు ఆ సెంటర్ లైసెన్సులు రద్దు చేస్తుండడం, మళ్లీ సృష్టికి మరో పేరు సృష్టించి కొత్త లైసెన్సులు తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారాయి. వీరి వ్యవహారానికి సంబంధిత ఉన్నతాధికారులు సహకరిస్తుండడంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి.
సృష్టి ఎండీ, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత
ఆన్‌లైన్‌లో అట్టహాసపు ప్రచారం..
‘సృష్టి పేరుతో డాక్టర్ నమ్రత సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతాల్లో ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్నారు. ఈ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లపై ఎన్నో వివాదాలు, మరోన్నో కేసులు ఉన్నప్పటికీ తమకున్న నెట్‌వర్క్‌తో దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ‘బెస్ట్ ఐవీఎఫ్ సెంటర్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారాన్ని ఉంచడం ద్వారా ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వీరి వలలో చిక్కుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టిలో జరిగిన వ్యవహారంలోనూ రాజస్థాన్‌కు చెందిన దంపతులు కూడా ఆన్‌లైన్ ద్వారానే ఈ సెంటర్‌ను అప్రోచ్ అయ్యారు.
తాజాగా రాజస్థాన్ దంపతుల సరోగసీ వ్యవహారం విశాఖ కేంద్రంగానే సాగింది. తొలుత సికింద్రాబాద్‌లో డాక్టర్ నమ్రతను గతేడాది ఆగస్టులో ఈ దంపతులు సంప్రదించాక విశాఖలోని తమ సృష్టి సెంటరుకు వారిని పంపించింది. సెప్టెంబర్‌లో సరోగసీ కోసం అక్కడ భర్త వీర్యం, భార్య అండాన్ని సేకరించి పంపేశారు. విశాఖలో జూన్ 4న సరోగసీ బిడ్డ జన్మించిందని, ఆమెను వచ్చి తీసుకెళ్లాలని ఫోన్ చేశారు. దీంతో భార్య సోనీ జూన్ 5న విశాఖ చేరుకుంది. సృష్టి మేనేజర్ కల్యాణి నగరంలోని లోటల్ ఆస్పత్రిలో బిడ్డ ఉందని అక్కడకు ఆమెను తీసుకెళ్లారు. సోనీ ఆ బిడ్డ డీఎన్‌ఏ రిపోర్టులు అడిగితే తొలుత ఇవ్వడానికి కల్యాణి నిరాకరించారు దీంతో ఇద్దరికీ కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు డీఎన్‌ఏ పరీక్ష చేయించి ఇస్తామని చెప్పడంతో బిడ్డను తీసుకుని సోనీ విమానంలో వెళ్లిపోయింది. సృష్టి ఎండీ డాక్టర్ నమ్రత ఎన్నిసార్లు డీఎన్‌ఏ నివేదిక గురించి అడిగినా దాటవేస్తుండడంతో అనుమానం వచ్చిన ఈ దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్ష చేయించడంతో తమది కాదని తేలింది. దీనిపై నమ్రతను గట్టిగా నిలదీయడంతో తప్పు జరిగిందని అంగీకరించింది. దీంతో సరోగసీ దంపతులు హైదరాబాద్ గోపాలపురం పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
వేరొకరి బిడ్డకు విశాఖలోనే పురుడు పోసి..
పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం చెందిన గర్భం దాల్చిన ఓ మహిళతో డాక్టర్ నమ్రత కుదుర్చుకున్న ఒప్పందంతో ఆమెను హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ తీసుకొచ్చారు. ఆమెకు జూన్ 4న విశాఖలోని లోటస్ ఆస్పత్రిలో పురుడు పోశారు. ఆమెకు పుట్టిన బిడ్డను సరోగసీ బిడ్డగా నమ్మించి బాధిత దంపతులకు అప్పగించారు. అనంతరం అసలు తల్లిని హైదరాబాద్‌కు పంపేశారు. ఈ వ్యవహారంలో సోనీ దంపతుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్నారు. ఇందులో తల్లిని కన్న బిడ్డకు రూ.90 వేలు మాత్రమే చెల్లించారు. డీఎన్‌ఏ రిపోర్టు సరిపోలక పోవడంతో సృష్టి గుట్టు రట్టయింది. అసలు సరోగసీయే జరగకుండా వేరొకరికి పుట్టిన బిడ్డను అప్పగించినట్టు తేలింది.
విశాఖ కేంద్రంగా ‘సృష్టి’ లీలలెన్నో..
విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద 15 ఏళ్లకు ముందే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ఈ సెంటర్ నిర్వాహకులు చేసిన లీలలెన్నో ఉన్నాయి. ఈ కేంద్రంపై 2016, 2018, 2020ల్లోనూ కేసులు నమోదయ్యాయి. అప్పట్లో ఈ సెంటర్ లైసెన్సులను కూడా రద్దు చేశారు. నమ్రత సహా పదిమందిని అరెస్టు చేశారు. అయినప్పటికీ తమకున్న పలుకుబడితో తిమ్మిని బమ్మి చేసి కొన్నాళ్లకే సృష్టికి మరోపేరు జోడించి లైసెన్సులు తెచ్చుకుని అదే కేంద్రంలో నిర్భీతిగా నడుపుతున్నారు. అలా ఏర్పడిందే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్. 2020లో శిశువుల అక్రమ రవాణా కేసులో సృష్టి ఎండీ డాక్టర్ నమ్రతతో పాటు మరో వైద్యుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లకు జైలు నుంచి బెయిలుపై వచ్చేసి ఎప్పటిలాగే తమ అక్రమాలను కొనసాగిస్తున్నారు. విశాఖ సృష్టి సెంటర్‌కు 2018లో మళ్లీ లైసెన్సు తెచ్చుకున్నారు. 2023తో ఈ లైసెన్స్ కాలపరిమితి ముగిసింది. అయితే లైసెన్స్‌ను రెన్యూవల్ చేయించకుండానే నడుపుతున్నారు. ప్రస్తుతం విశాఖలో నడుస్తున్న ‘సృష్టి’కి అనుమతుల్లేవని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. విశాఖలో 9 సరోగసీ, 50 ఐవీఎఫ్ సెంటర్లు నడుస్తున్నాయని చెప్పారు.
విశాఖలో సోదాలు.. మేనేజర్ అరెస్టు..
సికింద్రాబాదులో కేసు నమోదు నేపథ్యంలో అక్కడ నుంచి పోలీసులు విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు వచ్చారు. ఆ సెంటర్‌లో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మేనేజర్ కల్యాణిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకెళ్లారు. మరో వైద్యురాలు ఉష పరారీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం విశాఖలోని సృష్టి సెంటర్ మూతపడింది.
ఊరూరా క్యాంపులు పెట్టి మరీ.. డాక్టర్ నమ్రత నేతృత్వంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న నిర్వాహకులు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారిని ఆకట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉచిత పరీక్షలు పేరిట టెస్టులు చేసి పిల్లలు కావాలనుకున్న వారు తమను సంప్రదించాలని చెబుతారు. సరోగసీకి రూ.లక్షలు వెచ్చించాల్సి రావడంతో ఎగువ మధ్య తరగతి వారు ఆకర్షితులవుతున్నారు. ఏ కొద్దమిందికో సరోగసి చేసినా ఎక్కువ మందికి మాత్రం ఇతర మహిళలకు పుట్టిన వారినే సరోగసీ బిడ్డగా నమ్మించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో వీరు ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా డబ్బు అవసరం ఉన్న పేద గర్భిణీలతో ఒప్పందం కుదుర్చుకుని వ్యవహారం నడిపిస్తున్నారు. ఒక్కో సరోగసీకి రూ.20 నుంచి 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
బెజవాడలోనూ సరోగసీ దందా..
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల సరోగసీ దందా విజయవాడలోనూ కొనసాగుతోంది. అక్కడ జరుగుతున్న సరోగసీపై కూడా 2010లోనే కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విజయవాడలో ముగ్గురు డాక్టర్లతో ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. విజయవాడ సృష్టికి కూడా అనుమతులు లేవని అధికారులు తాజాగా తేల్చారు. తాజా వివాదంతో ఈ ఆస్పత్రి వైద్యులు కరుణ, సోనీలు పరారీలో ఉన్నారు. ఇంకా ఈ ‘సృష్టిపై తిరుపతిలోనూ శిశు అక్రమ రవాణా కేసులు. పశ్చిమ బెంగాల్‌లో సరోగసీ కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ఇకనైనా ‘సృష్టి’ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే సంతానం కోసం అర్రులు చాస్టున్న మరెందరో దంపతులు వీరి వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.